Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది.

Updated : 29 Nov 2023 07:48 IST

చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ
‘బెయిల్‌ రద్దు’ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వెల్లడి
క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చాక ఈ కేసును వింటామన్న ధర్మాసనం
తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా

ఈనాడు, దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి(Chandrababu) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. అయితే అంతవరకూ ఈ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబును ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ఆయన బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు స్వేచ్ఛనిచ్చింది. ‘బెయిల్‌ రద్దు’ కేసును ఆయన క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాత వింటామని స్పష్టం చేసింది. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు మంగళవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

సీఐడీ తరుఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు 39 పేజీల ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకుంటూ.. ఇదివరకు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో ఉత్తర్వులు వెలువడేంతవరకూ వేచి చూడాలని సూచించారు. అందుకు ఆయన అంగీరించారు. తర్వాత న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది జోక్యం చేసుకుంటూ ‘ఇప్పుడు ఆయన (చంద్రబాబు) సాధారణ బెయిల్‌పై ఉన్నారా?’ అని ప్రశ్నించారు. అందుకు సీఐడీ తరఫు న్యాయవాది అవునంటూ సమాధానమిచ్చారు. నవంబరు 28వ తేదీ వరకు ఆయన ఆరోగ్య కారణాల నిమిత్తం మంజూరైన బెయిల్‌పై ఉన్నారని, ఆ మరుసటి రోజు నుంచి సాధారణ బెయిల్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు.

దాంతో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది స్పందిస్తూ.. బెయిల్‌ రద్దు కేసును వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. దానికి న్యాయవాది రంజిత్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ కేసుని క్వాష్‌ పిటిషన్‌లో తీర్పు వచ్చిన తర్వాత వింటామని పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత న్యాయవాది రంజిత్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ఇక్కడ చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా హాజరయ్యారని, అందువల్ల ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ఆయన ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా ఆంక్షలు విధించాలని కోరారు. అక్టోబరు 31న, నవంబరు 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో తీర్పులో హైకోర్టు ఆయనను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని.. అలాగే బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పిందని గుర్తుచేశారు. ఆ ఆంక్షలను సుప్రీం కోర్టు తుది నిర్ణయం వెలువరించేంత వరకూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రతివాదికి నోటీసులు జారీ చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మాట్లాడుతూ తమ వాదనల ప్రకారం ప్రతివాదికి తప్పనిసరిగా నోటీసులు జారీచేయాలని, బెయిల్‌ అప్లికేషన్‌లో ఇచ్చిన 40 పేజీల తీర్పులో మెరిట్స్‌పై హైకోర్టు అభిప్రాయాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని మళ్లించినట్లు తాము ఇదివరకే వాదనలు వినిపించామని గుర్తుచేశారు.


‘స్కిల్‌ కేసు’పై మాట్లాడొద్దని ఆదేశం

ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చినప్పుడు హైకోర్టు రెండు రకాల ఆంక్షలు విధించిందని తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత సాధారణ బెయిల్‌ ఇచ్చినప్పుడు రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, నిర్వహించడంపై ఆంక్షలు తొలగించిందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు గురించి మాట్లాడకుండా సంయమనం పాటించడంలో తమకేమీ ఇబ్బంది లేదని.. అయితే బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనవద్దని అక్టోబరు 31న, నవంబరు 3న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లోని రెండో భాగం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరుతున్నారని, అది తమకు ఇబ్బందికరమని స్పష్టం చేశారు.

ఆ వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ బేలా త్రివేది.. స్కిల్‌ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా.. బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని సూచించింది. తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఈ కేసు గురించి పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు, అధికారులు కూడా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిలువరించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఆ ఆంక్షలను ఇరుపక్షాలకూ వర్తింపజేయాలని కోరారు. అప్పుడు న్యాయమూర్తి బేలా త్రివేది ఆ విజ్ఞప్తితో ఏకీభవిస్తున్నట్లుగా ‘ఇరుపక్షాలూ’ అని వ్యాఖ్యానించారు. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అభ్యంతరం తెలిపారు.

దాంతో జస్టిస్‌ త్రివేది స్పందిస్తూ.. హైకోర్టు అక్టోబరు 31న, నవంబరు 3న జారీచేసిన ఆంక్షల్లో మొదటి భాగం (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై బహిరంగంగా వ్యాఖ్యానించకూడదు) అమల్లో ఉంటుందని, రెండో భాగాన్ని (సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదు) తదుపరి ఉత్తర్వుల వరకూ మినహాయిస్తున్నామని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై 8వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు