చదువూ లేదు.. కొలువూ రాదు!

పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్‌... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Published : 29 Nov 2023 06:13 IST

పేద పిల్లలు ఎక్కువగా చేరే ఐటీఐలపై సీఎం జగన్‌ శీతకన్ను
అద్దె భవనాలు, రేకులషెడ్లే దిక్కు
1.42 లక్షల సీట్లలో భర్తీ 50 శాతంలోపే
8 వేల పోస్టులకు.. ఉన్నది 1,140 మందే

పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్‌... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. సొంత భవనాల్లేక కొన్నిచోట్ల అద్దెకు తీసుకున్నవాటిలో మరికొన్ని చోట్ల పాఠశాలల ఆవరణల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, పరికరాల్ని మార్చడం లేదు. నాబార్డు నుంచి తీసుకున్న నిధుల్నీ ఖర్చు చేయడం లేదు. ప్రాంగణ నియామకాలు 30 శాతానికి మించడం లేదు. ఈ సమస్యల వల్ల నాలుగైదు పర్యాయాలు కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఐటీఐల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 517 ఐటీఐల్లో 1.42 లక్షల సీట్లుండగా 50 శాతంలోపే భర్తీ అవుతున్నాయి.

నంద్యాల, కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంతకల్లు, బాపట్ల జిల్లా నిజాంపట్నం, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం, అల్లూరి జిల్లా హుకుంపేట, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, వైయస్‌ఆర్‌ జిల్లా మైలవరం ఐటీఐల్లో కొన్నింటిని స్థానిక పాఠశాలల ఆవరణల్లో, మరికొన్నింటిని ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు.  


చెప్పుకొంటే తీరే కష్టాలా?...

  • తిరుపతి జిల్లా తడ ఐటీఐలో లక్షలు వెచ్చించి నిర్మించిన హాస్టల్‌ భవనం నిరుపయోగంగా మారడంతో కొందరు పశువుల పాకగా వినియోగిస్తున్నారు. అరకులోయలోని ఐటీఐలో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల్లేక కొన్ని ట్రేడ్‌ల తరగతుల్ని ఉదయం.. మరికొన్నింటిని మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు.  

  • పార్వతీపురం మన్యం సాలూరు ఐటీఐ కోసం సొంత భవన నిర్మాణానికి కేంద్రం రూ.5 కోట్లిచ్చినా రాష్ట్రం స్థలం కేటాయించలేదు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది ట్రేడ్‌లలో 350 మంది శిక్షణ పొందుతున్నారు.
  • చిత్తూరు జిల్లా విజయపురంలో ఎనిమిదేళ్లుగా అద్దె భవనాల్లో ఐటీఐని నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐటీఐలకూ అద్దె భవనాలే దిక్కు.

శిక్షణ ఇచ్చే వారేరీ?

శిక్షణ అధికారి, సహాయ శిక్షణ అధికారి, డిప్యూటీ శిక్షణ అధికారి... ఇలా అన్ని రకాల పోస్టులు కలిపి 8,077 ఉండగా... ప్రస్తుతం పని చేస్తోంది 1,140 మందే. శిక్షణ, బోధనకు కీలకమైన సహాయ శిక్షణ అధికారి(ఏటీఓ) పోస్టులు 96 శాతం ఖాళీనే. 702 పోస్టులకు రెగ్యులర్‌ సిబ్బంది 27 మందే ఉన్నారు. 266 మంది కాంట్రాక్టు ఏటీఓలతోనే ఐటీఐలు కొనసాగుతున్నాయి. చిత్తూరు, పుంగనూరు ఐటీఐల్లో బోధనకు 16 మంది అవసరం. ఇక్కడ రెగ్యులర్‌ సిబ్బంది ఐదుగురే ఉన్నారు.

  • తిరుపతి జిల్లా తడలో పదిమంది శిక్షకులు అవసరం. నలుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఐటీఐలో ఇటీవలి బదిలీల్లో సిబ్బందిని వేరేచోటకు పంపి, కొత్త వారిని నియమించలేదు.
  • పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఐటీఐలో 11 మంది ఉండాలి. ప్రిన్సిపల్‌తో కలిపి ఉన్న రెగ్యులర్‌ సిబ్బంది నలుగురే. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనర్‌ మెకానిక్‌, మోటారు వెహికల్‌ మెకానిక్‌ తదితర కోర్సులున్నా దేనికీ యంత్రాలు, పరికరాల్లేవు. ప్రాక్టికల్స్‌కు యంత్రాలు, ఎలక్ట్రికల్‌, మరమ్మతు పరికరాల్ని సమకూర్చేందుకు రూ.2.5 కోట్లు అవసరం. ఈ చిన్న మొత్తాన్నీ ప్రభుత్వం ఇవ్వడం లేదు.
  • అల్లూరి జిల్లా చింతపల్లి ఐటీఐలో గిరిజన విద్యార్థుల వసతి గృహానికి ప్రహరీ లేదు. బాలికలకు వసతిగృహాన్ని నిర్మించలేదు. అరకులోయ ఐటీఐలో ఫిట్టర్‌ ట్రేడ్‌కు బోధకులే లేరు.  
  • కర్నూలు జిల్లా ఆదోనిలో మైనారిటీ ఐటీఐకి భవనం నిర్మించి, ఐదు ట్రేడ్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చిన ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తరగతుల్ని ప్రారంభించలేదు. పారిశ్రామిక వాడ శ్రీసిటీ సమీపంలో ఉన్న తడ ఐటీఐలోనూ బోధన సిబ్బంది కొరత వేధిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఐటీఐలో కంప్యూటర్లు, సామగ్రి లేదని వార్షిక పరీక్షలకు విద్యార్థుల్ని విజయనగరం ఐటీఐకి పంపిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని