అంగట్లో బోగస్‌ సర్టిఫికెట్లు

సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది.

Published : 29 Nov 2023 05:21 IST

పశుసంవర్ధకశాఖ సహాయకుల ఉద్యోగాలొస్తాయంటూ ఎర
గతంలోనూ ఫిర్యాదులు, ఆందోళనలు
నేతల అండదండలతో మళ్లీ అక్రమాలు?

ఈనాడు, కర్నూలు: సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది. సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న 1,896 పశుసంవర్ధశాఖ సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇవ్వనున్నట్లు ప్రచారంలో ఉండటంతో.. సంబంధిత పత్రాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 1,035 పోస్టులు ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

రంగంలోకి పలు ముఠాలు

అర్హులైన పలువురు ఆయా పోస్టుల్ని సాధించేందుకు అవసరమైన శిక్షణ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేశారు. పశుసంవర్ధశాఖ సహాయకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో ఏళ్లుగా శ్రమిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఆ పోస్టులను అడ్డదారుల్లో దక్కించుకోవాలనుకునే వారికోసం కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. అవసరమైన అర్హత ధ్రువపత్రాల పేరుతో నకిలీవి విక్రయిస్తూ అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. కొందరు నేతల అండదండలతోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీగా వసూళ్లు

12 రకాల కోర్సుల్లో ఏది పూర్తి చేసినా వారిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్‌.వి.వి.యు.) నుంచి పశుసంవర్ధక విభాగంలో పాలిటెక్నిక్‌, పాడి పరిశ్రమ/ పౌల్ట్రీసైన్స్‌ పాఠ్యాంశాలతో ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సు, రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా/ రెండేళ్ల ఇంటర్‌ ఎం.పి.వి.ఎ. (మల్టీపర్పస్‌ వెటర్నరీ అసిస్టెంట్‌), ఇంటర్‌ (ఎ.పి.ఒ.ఎస్‌.ఎస్‌.), ‘పాడి పరిశ్రమ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌’ అందించే ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సు, బీఎస్సీ (డెయిరీ సైన్స్‌), ఎమ్మెస్సీ (డెయిరీ సైన్స్‌), బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ), డెయిరీ ప్రాసెసింగ్‌ డిప్లొమా, భారత్‌ సేవక్‌ సమాజ్‌ అందించే వెటర్నరీ సైన్స్‌ డిప్లొమా తదితర అర్హతలను ఉద్యోగ ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆయా కోర్సులకు సంబంధించిన అర్హతగల ధ్రువపత్రాలు ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి వారి స్తోమతను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం.

భారత్‌ సేవక్‌ సమాజ్‌కు గుర్తింపుతో వివాదం

భారత్‌ సేవక్‌ సమాజ్‌ పేరుతో జారీ చేస్తున్న ధ్రువపత్రాలు బోగస్‌వని కొన్ని విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పేరుతో ఉన్న అర్హత పత్రాలతో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కొలువులు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో వారికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం వారు కోర్సుల్ని పూర్తిచేశారా.. లేదా అన్న దానిపై తదుపరి దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఈసారీ ‘భారత్‌ సేవక్‌ సమాజ్‌’ వెటర్నరీ సైన్స్‌ కోర్సును గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం విశేషం.


బోగస్‌ ధ్రువపత్రాలపై దర్యాప్తు జరగాలి

ఎంపికైన అభ్యర్థులు సమర్పిస్తున్న ధ్రువపత్రాలు నిజమైనవా.. కావా.. అన్న అంశంపై ఎలాంటి విచారణ జరగడంలేదు. ఫలితంగా బోగస్‌ అర్హత పత్రాలు సమర్పించిన వాళ్లు దర్జాగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనిపై గతంలో ఆందోళనలు చేశాం. అయినా పట్టించుకోలేదు. తాజాగా మళ్లీ బోగస్‌ ధ్రువపత్రాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

 నగేశ్‌, డీవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని