బ్రిటిష్‌ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో నిర్బంధకాండ

Published : 29 Nov 2023 05:27 IST

జగన్‌ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మోదీ వచ్చాకే పెరిగిన అదానీ ఆస్తులు
ఏపీ కర్షక-కార్మిక, ప్రజాసంఘాల సమితి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘బ్రిటిష్‌ పరిపాలనలో సైతం ధర్నాలు, నిరసనలకు అవకాశముండేది. కానీ జగన్‌రెడ్డి.. బ్రిటిష్‌వారిని తలదన్నేలా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలపై నిర్బంధకాండ అమలు చేస్తున్నారు’ అని ఏపీ కర్షక-కార్మిక, ప్రజాసంఘాల సమితి విమర్శించింది. రెండురోజుల మహాధర్నా విజయవాడ జింఖానా మైదానంలో మంగళవారం ముగిసింది. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు మోపడంతో.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోందని ధర్నాలో పాల్గొన్న వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.


మోదీ.. జగన్‌ జోడీ

-ఐ.వెంకటేశ్వర్లు, టీచర్‌ ఎమ్మెల్సీ

‘కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా అదానీ లాంటి బడా వ్యాపారవేత్తల కోసమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వట్లేదు. ఇక్కడ జగన్‌, కేంద్రంలో మోదీ ఎన్నడూ మీడియా ముందుకు రారు. అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయట్లేదు.’


అమరావతి రైతులను హీనంగా చూస్తున్నారు

-గద్దె అనురాధ, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌

‘ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్యల్లో తలమునకలైన సీఎం.. రైతులను గాలికొదిలేశారు. వైకాపా ప్రభుత్వంలో కర్షకుల బాధ అరణ్య రోదనలా మారింది. 33 వేల ఎకరాల సాగుభూమిని రైతులు అమరావతి రాజధాని కోసం ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక వారిని హీనంగా చూస్తోంది.’


పోర్టులన్నీ అదానీకే

-సుంకర రాజేంద్రప్రసాద్‌, న్యాయవాది

‘మోదీ ప్రభుత్వం వచ్చాక అనుభవం లేని అదానీ లాంటి వ్యక్తులకు 8 రాష్ట్రాల్లోని 12 నాన్‌ మేజర్‌ పోర్టులను కారుచౌకగా కట్టబెడుతున్నారు. ఇలా సంస్థల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టకుండానే వాటిపై పెత్తనం చేస్తూ రూ.వేల కోట్లు గడిస్తున్నారు. మోదీ రాకముందు ప్రపంచ కుబేరుల జాబితాలో ఎక్కడో ఉన్న అదానీ.. ప్రధాని అయ్యాక ముందుకు వచ్చారు.’


కుంభకోణాల మయం

-నక్కా సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు

‘ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోదీ.. అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారు. యుద్ధ విమానాల కొనుగోలు, బొగ్గుగనుల కేటాయింపుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి.’


పెట్రో ధరలు పైపైకి

-నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు

‘మోదీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో విఫలమైంది. పెట్రో ధరలు నానాటికీ పైకి వెళ్తున్నాయి. అన్నింటిలోనూ జీఎస్టీ తప్పనిసరి చేసిన కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. అలా తీసుకొస్తే లీటరు పెట్రోలు రూ.65కే వస్తుంది.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని