విశాఖ స్టీల్‌కు రూ.2,058 కోట్ల నష్టం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో పన్ను చెల్లింపునకు ముందు రూ.2,268 కోట్లు, పన్ను చెల్లించిన తర్వాత రూ.2,058 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే తెలిపారు.

Updated : 05 Dec 2023 03:54 IST

ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో పన్ను చెల్లింపునకు ముందు రూ.2,268 కోట్లు, పన్ను చెల్లించిన తర్వాత రూ.2,058 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే తెలిపారు. రాజ్యసభలో సోమవారం ఆయన భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ ప్లాంట్‌లో ఏప్రిల్‌లో 415, మే-246, జూన్‌-376, జులై-404, ఆగస్టు-414, సెప్టెంబర్‌- 384, అక్టోబరులో 368 వేల టన్నుల ద్రవ ఉక్కు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు సామర్థ్య వినియోగం 2018-19లో 87% ఉండగా, 2019-20లో79%, 2020-21లో 71%, 2021-22లో 87%, 2022-23లో 68శాతానికి పరిమితమైనట్లు చెప్పారు. ద్రవ్య సమస్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి తగ్గినట్లు వెల్లడించారు. ఉత్పత్తి పెంచడానికి ప్లాంట్‌ బొగ్గు, ఇనుప ఖనిజాన్ని ప్రత్యామ్నాయ మార్గాల నుంచి సేకరిస్తోందని చెప్పారు.


విశాఖ మినహా ఏపీలో విమానాశ్రయాలన్నీ నష్టాల్లోనే

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం మినహాయిస్తే మిగిలిన అన్ని విమానాశ్రయాలూ నష్టాల్లోనే ఉన్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకేసింగ్‌ సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో రాజమండ్రి విమానాశ్రయానికి వరుసగా రూ.45 కోట్లు, రూ.46 కోట్లు, రూ.44 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తిరుపతికి ఇదే సమయంలో రూ.40కోట్లు, రూ.39 కోట్లు, రూ.50 కోట్లు, విజయవాడకు రూ.67కోట్లు, రూ.65కోట్లు, రూ.69 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు.విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు తొలి రెండేళ్లు రూ.29 కోట్లు, రూ.3 కోట్ల నష్టం వాటిల్లినా 2022-23లో రూ.2.41 కోట్ల లాభం వచ్చినట్లు వివరించారు.


ఏపీలో రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టాం

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీలో రూ.1,50,705 కోట్ల విలువైన 155 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌సింగ్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 31 నాటికి ఈ ప్రాజెక్టుల వ్యయం అంచనా రూ.1,59,599 కోట్లకు చేరగా, ఇప్పటివరకు రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 48 ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 93 కొనసాగుతున్నాయని, 13 ప్రాజెక్టులను ఆపేసినట్లు వివరించారు. మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌ సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

* రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో పౌర విమానయానానికి సంబంధించినవి 3, ఉక్కు పరిశ్రమలు 2, పెట్రోలియం 23 (వీటి విలువ రూ.రూ.69,452 కోట్లు), విద్యుత్తు 4 (రూ.1,259 కోట్లు), వైద్యారోగ్యం 2, రైల్వే 10 (రూ.15,555 కోట్లు), జాతీయ రహదారులు 105 (రూ.67,712 కోట్లు), పట్టణాభివృద్ధి 2, ఉన్నత విద్యాశాఖకు సంబంధించినవి 3 చొప్పున ఉన్నాయని తెలిపారు.


‘కొప్పర్తి సిటీ’ అభివృద్ధిపై ఏపీ ప్రతిపాదనలు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘కొత్త నగరాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం రూ.8 వేల కోట్లు కేటాయించింది. దీనికింద 21 రాష్ట్రాల నుంచి 26 కొత్త నగరాలకు ప్రతిపాదనలు అందాయి. ఎంపికైన ఒక్కో నగరానికి రూ.వెయ్యి కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా తక్కువ కాబట్టి, అక్కడ రూ.500 కోట్ల చొప్పున ప్రతిపాదించాం. ఈ నిధి ద్వారా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కొత్త నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోవచ్చు’ అని వివరించారు.


గ్రోత్‌ హబ్‌ కార్యక్రమానికి విశాఖ ఎంపిక

2047కల్లా 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్న లక్ష్యం మేరకు నగర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రోత్‌ హబ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘గ్రోత్‌ హబ్స్‌ ప్రోగ్రాం కింద ప్రయోగాత్మకంగా ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌, వారణాశి, సూరత్‌, విశాఖపట్నంలను ఎంపిక చేశాం. విశాఖపట్నం సిటీ రీజియన్‌ పరిధిలోకి విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు విస్తృతి దృష్ట్యా.. నీతి ఆయోగ్‌ సీఈవో నేతృత్వంలో నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్టు అమలుకు నీతి ఆయోగ్‌.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సస్టెయినబిలిటీ, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ గ్రోత్‌ (ఐఎస్‌ఈజీ) ఫౌండేషన్‌, వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ)లతో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై సంతకం చేశామ’ని వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌ను డ్రిప్‌ స్కీంలో చేర్చలేదు

డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డ్రిప్‌) 2, 3 దశల కింద ఆంధ్రప్రదేశ్‌ను ఇంకా లాంఛనంగా చేర్చలేదని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ.. ‘చిత్తూరు జిల్లాలోని రాయలచెరువు డ్యాంను డ్రిప్‌ పథకం కింద చేర్చాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. డ్రిప్‌ 2, 3 దశల్లో భాగస్వాములయ్యే రాష్ట్రాల జాబితాను కేంద్రం ఆమోదించగా, వాటిలో ఏపీ కూడా ఉంది. అయితే ప్రపంచ బ్యాంకు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతిపాదించిన ప్రాజెక్టు సంసిద్ధత కొలమానాలను (ప్రాజెక్ట్‌ రెడీనెస్‌ క్రైటీరియా) ఏపీ పూర్తి చేయలేదు. దీంతో ఆ రాష్ట్రాన్ని డ్రిప్‌లో లాంఛనంగా చేర్చలేదు. రాష్ట్రాలు ప్రతిపాదించిన డ్యాంలనే ఈ పథకం కింద ఎంపికచేసి మరమ్మతులు చేపడతాం. డ్రిప్‌ 2, 3 స్కీం కింద రాయలచెరువుకు మరమ్మతులు చేయాలంటూ ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు. ఏపీలోని 31 డ్యాంలకు రూ.667 కోట్లతో మరమ్మతులు, భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని కేబినెట్‌ నోట్‌లో ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కాటన్‌ బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టు, రైవాడ రిజర్వాయర్ల మరమ్మతులు కోరుతూ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. మిగిలిన ప్రాజెక్టుల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంది’ అని కేంద్ర మంత్రి వివరించారు.


ఏపీలో 5.57 లక్షల ఉజ్వల కనెక్షన్లు

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఏపీలో అక్టోబర్‌ 31 నాటికి 5.57 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఏపీలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 1,09,220 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి కేంద్రం ఇస్తున్న సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచడం వల్ల వార్షిక సగటు వినియోగం 2019-20 నుంచి 2023-24 మధ్యకాలంలో 3.01 సిలిండర్ల నుంచి 3.71కి పెరిగింద’ని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని