AP Unemployment: రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య

జాబ్‌ క్యాలెండర్ల జాడ లేదు... డీఎస్సీ మాటే లేదు... పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ మోక్షం లేదు...  గ్రూప్‌-1, 2 కొలువుల భర్తీకి అతీగతీ లేదు... నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూసి.. చూసి నిరుద్యోగుల గుండెలు పగిలిపోతున్నాయి.

Updated : 06 Dec 2023 08:00 IST

వైకాపా పాలనలో జాబ్‌ క్యాలెండర్ల జాడ లేదు
డీఎస్సీ మాట లేదు
గ్రూపు 1, 2 కొలువుల భర్తీకి అతీగతీ లేదు..
ఉద్యోగాలు దక్కక... భవిష్యత్తుపై భరోసా చిక్కక బలవన్మరణాలు
ప్రమాద మరణాలు - ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2022 విశ్లేషణ
ఈనాడు - అమరావతి

జాబ్‌ క్యాలెండర్ల జాడ లేదు... డీఎస్సీ మాటే లేదు... పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ మోక్షం లేదు...  గ్రూప్‌-1, 2 కొలువుల భర్తీకి అతీగతీ లేదు... నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూసి.. చూసి నిరుద్యోగుల(jobless youngsters) గుండెలు పగిలిపోతున్నాయి. ఓ వైపు వయసు పెరిగిపోతోంది. మరోవైపు పట్టణాలు, నగరాల్లో ఏళ్లతరబడి అద్దెలకు, శిక్షణకు ఖర్చులు భరించలేక.. భవిష్యత్తుపై భరోసా దక్కక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఏదైనా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిద్దామంటే జగన్‌ ప్రభుత్వం ఆ రంగాన్నీ నాశనం చేసేసింది. వీటి పర్యవసానంగా రాష్ట్రంలో సగటున రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొరుగునే ఉన్న తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువమంది నిరుద్యోగులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. జాతీయ నేరగణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ‘‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2022’’ను విశ్లేషిస్తే రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.

ప్రతి వందమందిలో నలుగురు

రాష్ట్రంలో గతేడాది ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి వందమందిలో నలుగురు నిరుద్యోగులే. 2022లో రాష్ట్రంలో 8,908 మంది బలవన్మరణాలకు పాల్పడగా వారిలో 364 మంది నిరుద్యోగులే. వీరిలో 326 మంది పురుషులు, 38 మంది మహిళలు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 12వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది 15,783 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడగా... అందులో 2.30% మంది ఏపీ వాసులు. వైకాపా పరిపాలన ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

బిహార్‌, పశ్చిమబెంగాల్‌ కంటే ఇక్కడే ఎక్కువ

నిరుద్యోగం, ఉపాధి లేమికి బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా చెబుతారు. ఆ రెండు రాష్ట్రాల్లో కలిపి ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో.. అంతకంటే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీసుకున్నారు. ఒకప్పుడు ఉపాధి, ఉద్యోగావకాశాలకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా ఉండేది. ప్రైవేటురంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించేవి. కానీ జగన్‌ అధికారం చేపట్టాక ఉపాధికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ఉపయోగపడే అమరావతిని నిర్వీర్యం చేసేశారు. వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులను ఆపేశారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేశారు. పారిశ్రామికవేత్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఫలితంగా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు దక్కని దుస్థితి. అటు ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు రాక.. ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లభించక.. దిక్కుతోచక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని