విశాఖకు కార్యాలయాల తరలింపు వ్యాజ్యంపై ఏజీ అభ్యంతరం

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ అభ్యంతరం తెలిపారు.

Published : 07 Dec 2023 04:21 IST

త్రిసభ్య ధర్మాసనం లేదా డివిజన్‌  బెంచ్‌ విచారించాల్సి ఉందని వెల్లడి
పిటిషనర్లు ఫోరంషాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణ
వాదనల కొనసాగింపునకు రేపటికి వాయిదా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం.. హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్దకు విచారణకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ అభ్యంతరం తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం లేదా డివిజన్‌ బెంచ్‌ ముందుకు వ్యాజ్యం విచారణకు రావాల్సి ఉందని బుధవారం వాదనలు వినిపించారు. పిటిషనర్ల్లు ఫోరంషాపింగ్‌కు పాల్పడుతూ నచ్చిన బెంచ్‌ను ఎన్నుకున్నారన్నారు. సీఎం క్యాంపు కార్యాలయ వ్యవహరంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలో విచారణ జరిపిన సంగతి పిటిషనర్లకు తెలుసన్నారు. మొదటి పిటిషనర్‌ గతంలో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారని గుర్తుచేశారు. సింగిల్‌ జడ్జి వద్దకు కేసు విచారణకు వచ్చేలా వ్యాజ్యంలో వివరాలను పేర్కొన్నారన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణను వాయిదా వేశారు.

సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ  ఐఏఎస్‌ల కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా జారీచేసిన జీవో 2283ని రద్దు చేయాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ అమరావతిలోని సచివాలయం నుంచి కార్యాలయాలను తరలిస్తున్నారన్నారు.  పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం వాదనలు ప్రారంభించడానికి ముందే.. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్య విచారణార్హతపై ఏజీ అభ్యంతరం తెలుపుతూ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని