Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!

పోలవరం... ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం.

Updated : 08 Dec 2023 09:22 IST

రివర్స్‌గేర్‌లో జీవనాడి పోలవరం పనులు
జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయాలతో అంతా మొదటికి
ఆంధ్రావని ప్రయోజనాలకంటే అస్మదీయులకే పెద్దపీట
కేంద్రం హెచ్చరించినా పట్టించుకోని వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి

బండి ముందుకు నడవాలంటే మొదటి గేర్‌లో మొదలై క్రమంగా గేర్లు మార్చుతూ సాగాలన్నది ఇంగితజ్ఞానం!

కానీ, అలా కాకుండా రివర్స్‌గేర్‌ వేసి బండి ముందుకు పోవట్లేదని మొత్తుకుంటే..?

ఆ బుద్ధినేమనాలి? అలాంటి వారినేమని పిలవాలి?

జగనన్న హయాంలో ఆంధ్రావని జీవనాడి పోలవరం నిర్మాణం అచ్చంగా ఇదే తరహాలో రివర్స్‌గేర్‌లో సాగుతోంది!

ఆకలితో నకనకలాడుతున్న వాడి   నోటికాడికొచ్చిన ముద్దను లాక్కొని... మరింత రుచికరకంగా వండుతాను ఆగు... అని అంటే ఎలా ఉంటుందో పోలవరం విషయంలో జగన్‌ సర్కారు ధోరణి అలాగే ఉంది.

చంద్రబాబు హయాంలో అంతా పూర్తయి... మరో రెండు పనులు చేస్తేచాలు ఆంధ్రుల తరతరాల కల నిజమవుతుందనుకుంటున్న దశలో... జగన్‌ ప్రభుత్వం వచ్చింది. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ అస్మదీయులకు పనులను కట్టబెట్టేందుకు పోలవరానికి రివర్స్‌గేర్‌ వేసింది.

కేంద్రం వద్దన్నా... నిపుణులు వలదన్నా.. వినలేదు జగనన్న. ఫలితం కాలయాపనలో అప్పటిదాకా కట్టిన డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది.  మాట మార్చటం... మడమతిప్పటం మా ఇంటావంటా లేదంటూ... ఫలానా నెలలో ప్రారంభోత్సవం అని ప్రకటించిన జగన్‌ ఇప్పుడు వెన్నుచూపి చేతులెత్తేశారు!


పోలవరం(Polavaram)... ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. రెండంటే రెండే అడుగులు... ఒకటి కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చటం, మరోటి స్పిల్‌ వేలో మిగిలిన సగభాగం పూర్తి చేయడం.. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మిస్తే చాలు... చరిత్రలో నిలిచిపోయేది. ఆంధ్రావని దశ మారిపోయేది! అలా... ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వస్తుందనగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉంటే... అప్పటికి నాలుగేళ్లుగా వేగంగా సాగుతున్న ప్రాజెక్టు పనుల పరుగును అందిపుచ్చుకొని ఉంటే.. ప్రణాళిక మేరకు పూర్తి చేసి ఉంటే... ముఖ్యమంత్రి కుర్చీలో ఏ రాజనీతిజ్ఞుడో, పాలనాదక్షుడో కూర్చొని ఉంటే... పోలవరం కల ఇప్పటికల్లా సాకారం అయ్యుండేది.

కానీ తెలుగు ప్రజల దురదృష్టం కొద్దీ 2019లో సీఎం పగ్గాలు చేపట్టిన జగనన్న.. ఆంధ్రావని ప్రయోజనాలను పక్కకుతోసి.. అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేశారు. ఖజానాపై భారం తగ్గిస్తున్నామన్న ముసుగులో రివర్స్‌ టెండరింగ్‌ పేరిట కావల్సినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ప్రాజెక్టు పనులను పూర్తిగా అటకెక్కించేశారు. జగన్‌ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం కూడా పదేపదే హెచ్చరించినా వినలేదు. కేంద్ర నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టులో అనిశ్చితికి, డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలు ఏర్పడటానికి కారణం మానవ వైఫల్యమే (ఆ సమయంలో ముఖ్యమంత్రి జగనే) అని తేల్చి చెప్పింది!! ప్రాజెక్టు నత్తనడకపై ఇటీవలే కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది కూడా!


చెప్పినా.. చెవికెక్కలేదు..

1

వేగంగా సాగుతున్న పోలవరం పనులను జగన్‌ అర్ధంతరంగా ఆపేశారు. రివర్స్‌ టెండర్ల పేరుతో దాన్నో ప్రహసనంలా మార్చారు. ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రమూ హెచ్చరించింది. వివరణ కోరినా.. వైకాపా సర్కారు పట్టించుకోలేదు. మొండిగా రివర్స్‌ టెండర్లు నిర్వహించింది. కేవలం జగన్‌కు కావాల్సిన గుత్తేదారు సంస్థ మేఘా ఒక్కటే టెండరు దాఖలు చేసింది. వారికే పనులు ఇచ్చేసింది. చివరికి కేంద్రం చెప్పినట్లే ప్రాజెక్టు పురోగతి పడకేసింది.


2

2019 నవంబరులో మేఘాతో ఒప్పందం కుదుర్చుకుంటే, 2021 జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే. విలువైన సమయాన్ని వృథా చేశారు. ఎగువ కాఫర్‌డ్యాం గ్యాప్‌లు పూడ్చలేదు. దిగువ కాఫర్‌డ్యాంనూ నిర్మించలేదు. ఫలితంగా 2020 భారీ వరదలకు పోలవరంలో కీలక నిర్మాణమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట... భారీ గోతులు ఏర్పడి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దిగువ కాఫర్‌డ్యాంలోనూ నష్టం జరగడంతో పనులు నిలిచిపోయాయి.

కేంద్రం ఆదేశాలతో పోలవరం సమస్యపై హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించింది. ‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటానికి, నదీ గర్భం కోతకు గురికావడానికి ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్‌డ్యాంలో గ్యాప్‌లను పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాతానికి కారణం’ అని తేల్చిచెప్పింది. సకాలంలో ఎగువ కాఫర్‌డ్యాం గ్యాప్‌లను పూడ్చనిది జగన్‌ ప్రభుత్వమే.


3

పోలవరంలో స్పిల్‌ వేకు ఇబ్బంది కలగకుండా గైడ్‌బండ్‌ నిర్మించారు. అది కూడా కుంగిపోయింది. దాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేని నిర్మాణం, ఆకృతులకు తగినట్లుగా నిర్మించకపోవడమే అందుకు కారణమని కేంద్ర కమిటీ తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్‌-1 ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదీ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే!


4

గువ, దిగువ కాఫర్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. అవి సక్రమంగా ఉంటే... ప్రధానడ్యాం నిర్మించనున్న వైపు వరద రాకూడదు. వాటి సీపేజీ అంచనాలకు మించడంతో ప్రధానడ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. సీపేజీపై తాము ముందే హెచ్చరించినా, రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర నిపుణులు తప్పు బట్టారు.


అది 2019, జూన్‌ 20న...

(తొలిసారి సీఎం హోదాలో జగన్‌ పోలవరం సందర్శన.. అక్కడే సమీక్ష)

‘ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి చేయగలరో గడువు మీరే చెప్పండి’ అంటూ ఇంజినీరింగ్‌ అధికారులను అడిగిన సీఎం జగన్‌ వెంటనే... ‘ఒకటి, రెండు నెలలు ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు. కచ్చితంగా చెప్పండి’ అన్నారు. ‘2020 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలం’ అని సంబంధిత అధికారులు జవాబిచ్చారు. అంటే..చంద్రబాబునాయుడు హయాంలో 2019 జూన్‌ నాటికే పోలవరం ప్రాజెక్టు పనులు సింహభాగం పూర్తయ్యాయని, మరో ఏడాదిలో మిగతావీ అయిపోతాయని సాక్షాత్తు ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పకనే చెప్పేశారు. ఆ రోజు వరకు పోలవరం పూర్తి చేసేందుకు ఎటువంటి సవాళ్లు లేవని అంగీకరించారు. అధికారుల స్పందన వినగానే... వెంటనే ముఖ్యమంత్రి జగన్‌... ఉత్సాహంగా ‘2021 జూన్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తాం’ అని అక్కడిక్కడే అధికారికంగా ప్రకటించారు.


2023.. ఆగస్టు 7న...

గోదావరి వరదల్లో చిక్కుకున్న నిర్వాసిత గ్రామాల్లో జగన్‌ పర్యటించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో వారికి ప్రభుత్వం ఎలాంటి పునరావాసమూ కల్పించలేదు. అక్కడ మాట్లాడుతూ... 2025 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లందిస్తామని ప్రకటించారు. అంటే ఏడాదిన్నరలో పూర్తి చేసెయ్యగల ప్రాజెక్టును, తన హయాంలో ఐదేళ్లయినా అందుబాటులోకి తీసుకురాలేకపోయానని జగన్‌ పరోక్షంగా అంగీకరించారు.


ఇప్పుడు అన్నీ సవాళ్లే...

ప్రస్తుతం పోలవరంలో అన్నీ సవాళ్లే. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ సమస్యను పరిష్కరించుకోవాలి.

కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది.

గైడ్‌బండ్‌ మళ్లీ నిర్మించుకోవాలి. గ్యాప్‌-1 డ్యాం నాణ్యతను నిర్ధారించుకోవాలి. 

అనేక సాంకేతిక అంశాలకు ఇంకా పరిష్కారం గుర్తించాలి.


అవును.. గత  ప్రభుత్వ హయాంలోనే వేగంగా పనులు  (అంకెలన్నీ రూ.కోట్లలో)

పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు ఎంత విలువైన పని జరిగిందో ఈ ఏడాది జనవరిలో జల వనరుల శాఖ అధికారులు లెక్కలు కట్టారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో అధికారులు తేల్చిన లెక్కలే ఇవి. వాటి ప్రకారం చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగినట్లు, ఎక్కువ వ్యయం చేసినట్లు తేల్చారు. 2023 జనవరి నాటికి  జరిగిన పని ప్రకారం కట్టిన లెక్కలు ఇవీ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని