NRI Yashasvi: అమ్మకు అనారోగ్యమన్నా.. చూసి మళ్లీ వస్తానన్నా

దూడకు పాలిచ్చి వచ్చి ఆహారంగా మారతానని ఆవు చెబితే.. క్రూరమృగమైన పులి మనసు కరిగిపోయి, వెళ్లి వచ్చేందుకు అనుమతిచ్చిందని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం.

Updated : 24 Dec 2023 13:33 IST

యశస్విపై కరుణ చూపని ఏపీసీఐడీ
ప్రభుత్వ విధానాలను సోషల్‌మీడియాలో ప్రశ్నించారని లుక్‌ ఔట్‌ నోటీసు
అమెరికా నుంచి రాగానే.. శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి
అర్ధరాత్రి వేళ గుంటూరుకు తరలింపు
సెల్‌ఫోన్‌, పాస్‌పోర్టు స్వాధీనం

ఈనాడు, అమరావతి: దూడకు పాలిచ్చి వచ్చి ఆహారంగా మారతానని ఆవు చెబితే.. క్రూరమృగమైన పులి మనసు కరిగిపోయి, వెళ్లి వచ్చేందుకు అనుమతిచ్చిందని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు క్రూరమృగం చూపిన కరుణా చూపించలేకపోయారు. వారిలో మనుషుల్లో ఉండాల్సిన మానవత్వమూ లేకపోయింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి తర్వాత వస్తానని అమెరికా నుంచి వచ్చిన యశస్వి (NRI Yashasvi) వేడుకున్నా.. కాళ్లావేళ్లా పడినా.. కుదరదంటూ హైదరాబాద్‌ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా గుంటూరుకు తరలించారు. ఎందుకంటే అది ఏపీసీఐడీ! అందులోనూ పెట్టిన కేసు.. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారని!

యశస్వి ఏ అంతర్జాతీయ ఉగ్రవాదో, దేశద్రోహో కాదు. కరడుగట్టిన అంతర్జాతీయ నేరగాడూ కాదు. విదేశాల్లో ఉంటూ వైకాపా ప్రభుత్వ విధానాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుపట్టారు. సీఐడీ దృష్టిలో అదే మహా నేరమైపోయింది. లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసింది. అందుకే అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చారనే మానవత్వం చూపకుండా అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. తల్లి అనారోగ్యంతో బాధ పడుతున్నారని, చికిత్స తీసుకుంటున్నారని తెలిసి అమెరికా నుంచి బయల్దేరిన ఆయన.. శుక్రవారం రాత్రి 7.45కు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్‌ ఔట్‌ నోటీసు ఉందని చెప్పిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు విమానాశ్రయంలోనే కూర్చోబెట్టారు. తర్వాత ఏపీసీఐడీ పోలీసులు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తమ వెంట రావాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి, తర్వాత వస్తానని యశస్వి వివరించినా విన్పించుకోలేదు. అర్ధరాత్రి బయల్దేరి శనివారం ఉదయం 8 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ‘ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? మీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతా వివరాలేంటి’ అని గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం 2024 జనవరి 11న తిరుపతి సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలంటూ 41ఎ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఆయన పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు.

ప్రభుత్వ విధానాలను కించపరిచారని..

యశస్విపై ఏపీసీఐడీకి చెందిన సైబర్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పాత గుంటూరుకు చెందిన పొలిమేర మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఒక కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వ విధానాలను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో యశస్వి పెడుతున్న పోస్టింగ్‌ల వల్ల సమాజంలో ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదముందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంపైనే కాదు సీఎం, వారి కుటుంబీకులపైనా సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ 153ఎ, 505(2), 120బి సెక్షన్ల కింద సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటకు చెందిన దొప్పలపూడి అశోక్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జులై 5న మరో కేసు పెట్టారు. ప్రభుత్వ విధానాలపై యశస్వి ఉద్దేశపూర్వకంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో పోస్టింగ్‌లు పెడుతున్నారని, వాటిని తెదేపా వారితో వివిధ వేదికలపై ప్రచారం చేయిస్తున్నారని, అతని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై ఐపీసీ 153ఎ, 505(2), 504, 503 రెడ్‌విత్‌ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఉద్యోగాలపై ప్రశ్నిస్తే.. ఇంటిపై దాడి

‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వ తీరును సోషల్‌ మీడియాలో ప్రశ్నించా. అందుకే హైదరాబాద్‌లోని మా ఇంటిపై నాలుగేళ్లలో ఐదు సార్లు దాడులు జరిగాయి. నాలుగుసార్లు గోడల్ని బద్దలు కొట్టారు. సీసీ కెమెరాల్ని పగలగొట్టారు’ అని యశస్వి మీడియా ముందు వాపోయారు. ‘వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో అత్యంత జుగుప్సాకరంగా పోస్టింగ్‌లు పెట్టినా, వాటిని సర్క్యులేట్‌ చేసినా వారిపై చర్యలు తీసుకోరు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టింగ్‌ పెడితే చాలు.. కేసులు, అరెస్టులంటూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి చర్యలకు బెదిరేది లేద’ని స్పష్టంచేశారు. ‘నేను పెట్టిన పోస్టింగుల్లో ఏ తప్పు ఉందని పోలీసులు కేసులు నమోదు చేశారో చెప్పాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ యువతకు నాలుగున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందో వివరించాలి’ అని డిమాండు చేశారు. తన అమ్మ అనారోగ్యంతో బాధ పడుతోందని, నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన తనపై తప్పుడు కేసులు పెట్టి అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని, తర్వాత వస్తానని చెప్పినా విన్పించుకోకుండా బలవంతంగా గుంటూరు తీసుకొచ్చారని వివరించారు.

తెదేపా నేతల ఆందోళన

యశస్విని సీఐడీ పోలీసులు గుంటూరుకు తరలిస్తున్నారన్న సమాచారంతో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు తెదేపా నాయకులు ఆయనకు మద్దతుగా శనివారం ఉదయం గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వానికి, సీఐడీ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. యశస్విని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాలన చేతకాని సీఎం జగన్‌.. సమస్యలపై ప్రశ్నిస్తున్న తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకోవడమే యశస్వి చేసిన తప్పా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. యశస్వికి 41ఎ నోటీసులిచ్చిన గుంటూరు సీఐడీ పోలీసులు పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారని, వాటిని తిరిగి ఇప్పించేలా హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్‌చంద్ర, చుక్కపల్లి రమేష్‌, గూడపాటి లక్ష్మీనారాయణ తెలిపారు.


సీఎంను విమర్శిస్తే లుక్‌ ఔట్‌ నోటీసా?

‘వైకాపా నేతలైతే ఎవరినైనా వెంటాడి వేధించొచ్చు. భౌతిక దాడులూ చేయొచ్చు. విపక్షాల వారు మాత్రం నోరెత్తకూడదు. సీఎం జగన్‌ను పల్లెత్తు మాటా అనకూడదు. ఎందుకంటే రాష్ట్రంలో సీఐడీ చట్టం ఇది. కాదని ఎవరైనా సీఎంను ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా వారిపై లుక్‌ ఔట్‌ నోటీసులిచ్చేందుకు వెనకాడదు’ అని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదంటూ నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్న మాటల కంటే సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా చేసే విమర్శలు ఎక్కువా? అప్పుడు సీఐడీ ఏ కేసులు పెట్టింది? 41ఎ నోటీసు ఇవ్వడానికి లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేస్తారా? విమానాశ్రయానికి వెళ్లి అదుపులోకి తీసుకోవాల్సినంత అవసరముందా?’ అనే ప్రశ్నలు మాజీ పోలీసు అధికారుల్లోనూ వ్యక్తమవుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని