ఏపీ పోలీసులు.. ఒకవైపే చూస్తారు

అధికార పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు విశాఖపట్నంలో మంత్రి రోజా వాహనశ్రేణిపై చెప్పులు విసిరితే పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టేశారు.

Updated : 22 Feb 2024 07:04 IST

రెండోవైపు చూస్తే అధికార పార్టీ అరాచకాలు కనబడతాయని భయం
వారు దాడులు, దౌర్జన్యాలకు తెగబడినా నామమాత్రపు కేసులే
ప్రతిపక్షాలపై చిన్నదానికీ హత్యాయత్నంలాంటి కఠిన సెక్షన్లతో కేసులు

ఈనాడు, అమరావతి: అధికార పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు విశాఖపట్నంలో మంత్రి రోజా వాహనశ్రేణిపై చెప్పులు విసిరితే పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టేశారు. ఘటనాస్థలిలో లేని వారిని సైతం కేసులో ఇరికించి అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్లి మరీ వందల మందిని అరెస్టు చేశారు. అదే కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులైన 250 మందికి పైగా వైకాపా గూండాలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడి గంటన్నర పాటు తీవ్ర విధ్వంసం సృష్టిస్తే ఆస్తి నష్టం నేరం కింద కేసుతో సరిపెట్టేశారు. ఒక్క వ్యక్తిని మాత్రమే నిందితుడిగా పేర్కొన్నారు. 24 గంటలవుతున్నా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు.

గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యాలయంపై ఎవరో అల్లరిమూకలు రాయి విసిరితే... రాత్రికి రాత్రి ప్రతిపక్ష పార్టీలకు చెందిన 30 మందిని అరెస్టు చేశారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేనివారినీ అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్లలోపు శిక్షపడే అవకాశమున్న కేసు అయినప్పటికీ అరెస్టు చేసి కోర్టు ముందుంచారు. అదే అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాల బండారం బయటపెట్టేందుకు వెళ్లిన ‘న్యూస్‌టుడే’ విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా నడిపిస్తున్న వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే.. వారం రోజులవుతున్నా నిందితులెవర్నీ అరెస్టు చేయలేదు. హత్యాయత్నం సెక్షనే పెట్టలేదు.ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లుగా అధికార వైకాపాకు పోలీసులు ఎంత ఏకపక్షంగా కొమ్ముకాస్తున్నారో చెప్పేందుకే ఈ తాజా ఉదంతాలే నిదర్శనం. ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడినా, దమనకాండకు తెగబడినా, విధ్వంసం సృష్టించినా, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లు, కార్యాలయాలు తగలబెట్టేసినా, చివరికి పాత్రికేయులను అంతమొందించేందుకు యత్నించినా, పత్రికా కార్యాలయాలపై దాడులు చేసినా అవేవీ పోలీసులకు కనిపించవు. అత్యధిక సందర్భాల్లో కేసే నమోదు చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేసినా.. నామమాత్రపు సెక్షన్లతో మమ అనిపించేస్తున్నారు. అరెస్టు ఊసే ఉండట్లేదు. అదే వైకాపా వారిపై ఈగ వాలినా, వారి అవినీతిని, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక్క పోస్టు పెట్టినా దానికి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలే బాధ్యులంటూ అడ్డగోలుగా కేసులు పెట్టేస్తున్నారు. వెతికి వెంటాడి మరీ అరెస్టులు చేస్తున్నారు. వైకాపా నాయకులు తప్పు చేసినా ఒప్పు.. ప్రతిపక్ష నాయకులు ఏం చేసినా తప్పే అన్నట్లు వ్యవహరించటం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకే చెల్లింది.

మారణాయుధాలతో దాడికి తెగబడితే.. ఆస్తి నష్టం కేసా?

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులైన వైకాపా గూండాలు నేరపూరిత కుట్రకు రూపకల్పన చేసి.. కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. రాళ్లు విసిరి, కర్రలతో కొట్టి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం తాళాలు పగలకొట్టేందుకు యత్నించారు. సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమై ‘ఈనాడు’ కార్యాలయానికి తాళాలు వేసి బయటకు వెళ్లటంతో ముప్పు తప్పింది. లేదంటే ఆ మూక.. విలేకరులపైన దాడికి పాల్పడి వారి ప్రాణాలకు హాని కలిగించి ఉండేది. ఇంత తీవ్ర విధ్వంసానికి పాల్పడితే కేవలం రూ.50, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తి నష్టం (ఐపీసీ సెక్షన్‌ 427) నేరం కింద కేసు పెట్టి సరిపెట్టేశారు. అది కోరల్లేని సెక్షన్‌. కర్రలు, రాళ్లతో  దాడికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఐపీసీ సెక్షన్‌ 324 కింద కేసు ఎందుకు పెట్టలేదు? మారణాయుధాలతో అల్లర్లకు తెగబడితే ఐపీసీ 147, 148 సెక్షన్లు ఎందుకు వర్తింపజేయలేదు? ముందస్తు కుట్రతోనే దాడికి వచ్చారని స్పష్టంగా కనిపిస్తున్నా ఐపీసీ 120బీ సెక్షన్‌ పెట్టకపోవటమేంటి? అల్లర్లతో ‘ఈనాడు’ కార్యాలయాన్ని, ఆ ప్రాంతాన్ని అక్రమంగా నిర్బంధించిన వారిపై ఐపీసీ 341 సెక్షన్‌ పెట్టరా? వారంతా మారణాయుధాలతో అంతమొందించేందుకే వచ్చినట్లు కనిపిస్తుంటే హత్యాయత్నం నేరం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు పెట్టకపోవటమేంటి? వందల మంది దాడి చేయటానికి వస్తే ఒక్కర్నే నిందితుడిగా పెడతారా? ఈ దాడికి కుట్రదారయిన కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ఇది అధికార వైకాపాకు కొమ్ముకాయటం కాదా?

దాడి చేసిన వారెవరో తెలుస్తున్నా... పోలీసులకు కనిపించదా?

రాప్తాడులో ఈ నెల 18న జరిగిన ‘సిద్ధం’ సభ  ఫొటోలు తీస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ ఫొటో జర్నలిస్ట్‌ శ్రీకృష్ణపై వైకాపా గూండాలు ఆటవికంగా దాడికి తెగబడ్డారు. దాడి చేసిన వారెవరో ఆ ఫొటోల్లో, వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఇప్పటి వరకూ పోలీసులు కేవలం ఒక్కర్నే, అది కూడా చాలా ‘గౌరవంగా’ అరెస్టు చేశారు.


తగలబెట్టేస్తామన్నా అరెస్టు చేయరా?

  • అమరావతి మండలం మల్లాది రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన ‘న్యూస్‌టుడే’ విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై ఈ నెల 14న వైకాపా మూకలు హత్యాయత్నం చేశాయి. ‘పెట్రోల్‌ తీసుకురండిరా.. తగలెట్టేద్దాం’ అంటూ ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్‌ కింద పోలీసులు కేసు పెట్టలేదు. మారణాయుధాలతో దాడి, అక్రమ నిర్బంధం సెక్షన్లతో సరిపెట్టేశారు. నిందితులైన వైకాపా నాయకులు వెంప శ్రీను, తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్‌, భవిరిశెట్టి నాగేశ్వరరావు తదితరులెవర్నీ అరెస్టు చేయలేదు.
  • గత నెల 7న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర కవరేజికి వెళ్లిన ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్‌ సంపత్‌, ‘న్యూస్‌టుడే’ విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, ‘ఈటీవీ’ విలేకరి మంజునాథ్‌పై వైకాపావారు 150 మంది దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా వారిని నిలువరించలేదు.  కేసు నమోదు చేసినా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు.
  • అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2022 జూన్‌ 11న వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఓ గుత్తేదారుపై దాడి చేస్తుంటే చిత్రీకరించినందుకు.. ‘న్యూస్‌టుడే’ విలేకరి ఎర్రస్వామిపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదై ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ ఎవర్నీ అరెస్టు చేయలేదు.

రాష్ట్రంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీలకు ఈ అరాచకాలు కనిపించట్లేదా?


తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండేళ్లవుతున్నా..

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబరు 19న వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ అనుచరులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రెండేళ్లవుతున్నా ఈ కేసులో ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.

విజయవాడలో తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీ కంటిని వైకాపా వారు ఇనుపచువ్వతో పొడిస్తే.. హత్యాయత్నం కేసే అవసరం లేదని పోలీసులు తేల్చేశారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం, తెదేపా కార్యకర్త నివాసంపై వైకాపా నాయకులు చేసిన దాడికి నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులపై మాత్రం హత్యాయత్నం కేసులు పెట్టేశారు. కొన్ని ఘటనల్లో పోలీసులే ఫిర్యాదుదారులుగా మారిపోయి వైకాపాకు కొమ్ముకాస్తున్నారు.


రెండోవైపు చూడాలంటే ఎందుకంత భయం?

  • చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా 2022 ఆగస్టులో తెదేపా వారిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దాడిచేసిన వారిని వదిలేసి, ఈ ఘటనలో బాధితులైన తెదేపా కార్యకర్తలు, నాయకులు 65 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడం గమనార్హం.  
  • అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి  సత్యకుమార్‌ వాహనశ్రేణిపై రాళ్లు విసిరి,    కర్రలతో దాడి చేసిన వారిని 11 నెలలు గడిచినా ఇప్పటికీ పట్టుకోలేదు.
  • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఇంటిపై 3 గంటలపాటు దాడి చేసి, విధ్వంసం సృష్టిస్తే రెండు రోజుల వరకూ కేసే లేదు. ఆ తర్వాత 11 మందిపైనే కేసు పెట్టినా వారినీ అరెస్టు చేయలేదు. రామచంద్రయాదవ్‌, ఆయన అనుచరులపై మాత్రం అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు.
  • చంద్రబాబు ఇంటిపైకి వైకాపా ఎమ్మెల్యే (ప్రస్తుత మంత్రి) జోగి రమేష్‌ తన అనుచరులతో దండయాత్రగా వెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తే ఆయన్ను వదిలేశారు. పైగా ప్రతిఘటించిన ప్రతిపక్ష శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు.

ఒక్క సెక్షన్‌.. ఒకే నిందితుడా?

కార్పొరేటర్లనూ గుర్తించలేకపోయారా!
వైకాపా నేతల్ని సంతృప్తిపరచేలా కేసు

ఈనాడు, కర్నూలు: కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం సృష్టించింది.. ఆ దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.. దాడిలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయం వాటిల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా పోలీసులు మాత్రం వైకాపా నాయకులకే కొమ్ముకాస్తున్నట్లుగా వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేలా.. ఇదేదో అతిసాధారణమైన సంఘటన అన్నట్లుగా కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు 250 మందికి పైగా వచ్చి ఆందోళన చేసి విధ్వంసం సృష్టించారు. పోలీసులు మాత్రం వారిలో ఒక్కరిని మాత్రమే నిందితుడిగా గుర్తించడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో కేసు దర్యాప్తు ఎలా సాగబోతుందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆస్తులను ధ్వంసం చేసినట్లుగా సెక్షన్‌ 427 కింద సుమోటోగా కేసు నమోదు చేశారు. అదికూడా బెయిలబుల్‌ సెక్షన్‌ కావడం విశేషం. కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన వారిలో పలువురు కార్పొరేటర్లు, వైకాపా నాయకులు ఉన్నప్పటికీ హనుమంతరెడ్డి అన్న ఒకే ఒక్క వ్యక్తిని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఆ ఒక్క వ్యక్తి కూడా ‘ఈనాడు’ కార్యాలయం తలుపును తన్నే క్రమంలో కాలికి గాయమైంది. అంతమందిలో అతనొక్కడినే పోలీసులు నిందితుడిగా చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి ఒక్కరి పేరు చూపినా దర్యాప్తులో భాగంగా మిగిలిన వారిని గుర్తించి అందరి పేర్లనూ నిందితుల జాబితాలో చేర్చుతామని డీఎస్పీ విజయశేఖర్‌ ‘ఈనాడు’తో అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని