జగన్‌.. ఇదేనా మీ ప్రా‘ధాన్యం’!

కత్తులు దూసే ప్రకృతి విపత్తులను ఎలాగోలా ఎదుర్కొంటున్న రైతన్న.. నమ్మిస్తూ నట్టేట ముంచుతున్న జగన్‌ దొంగదెబ్బలకు మాత్రం కకావికలమవుతున్నాడు.

Updated : 22 Feb 2024 04:33 IST

ఏటికేడు సేకరణ తగ్గించుకుంటున్న జగన్‌ సర్కారు
ఆర్‌బీకేల పేరుతో చేసేది హడావుడే
దక్కని మద్దతు ధర.. తేమ పేరుతో కొర్రీలు

కత్తులు దూసే ప్రకృతి విపత్తులను ఎలాగోలా ఎదుర్కొంటున్న రైతన్న.. నమ్మిస్తూ నట్టేట ముంచుతున్న జగన్‌ దొంగదెబ్బలకు మాత్రం కకావికలమవుతున్నాడు. మద్దతు ధర దక్కక.. పెట్టుబడీ పొందక.. బక్క రైతు బిక్కచచ్చిపోతున్నాడు.. చెమటోడ్చి పండించిన పంటను.. రైతు భరోసా కేంద్రాల్లో అమ్మలేక... అక్కడ వేసే కొర్రీలతో వేగలేక... దళారుల దాష్టీకానికి బలవుతున్నాడు... ఆంధ్రప్రదేశ్‌ను.. అన్నపూర్ణగా.. దక్షిణ భారత ధాన్యాగారంగా నిలిపిన అన్నదాతల పరిస్థితి జగన్‌ పాలనలో తలకిందులైంది!

ధాన్యం రైతులతో.. వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర దక్కడం లేదు. కొనుగోలుకూ.. రకరకాల కొర్రీలు పెడుతోంది. ఎకరాకు రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టే రైతులకు.. నష్టాలే మిగులుతున్నాయి. నాణ్యమైన ధాన్యం అయినా క్వింటాల్‌కు రూ.100 కోత తప్పడం లేదు. తడిస్తే మరిన్ని వెతలే. మొత్తంగా ఎకరాకు సగటున రూ.10వేలకు పైనే నష్టపోతున్నారు. గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. సేకరణ మావల్ల కాదంటూ, జగన్‌ సర్కారు ధాన్యం సేకరణను క్రమంగా తగ్గించుకుంటోంది. అదీ లక్షల టన్నుల్లో! 2019-20లో 83 లక్షల టన్నులు సేకరిస్తే.. 2022-23 నాటికి 49లక్షల టన్నులకే పరిమితం చేసింది. రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)ల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని, మిల్లర్ల పాత్ర లేకుండా చేశామని గొప్పలు చెప్పే సర్కారు.. అక్కడికి వచ్చే రైతుల్ని పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ-క్రాప్‌, ఈ కేవైసీ మొదలు.. పంట నమోదు, తేమ శాతం, ట్రక్‌షీట్‌ జారీ వరకూ రకరకాలుగా వేధిస్తోంది. ఇంత చేసినా మిల్లరు అంగీకరిస్తేనే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి.


వరి రైతుకు.. ఉరి వేస్తున్న సర్కారు

వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరి రైతుల్ని కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏడాదికి రెండుమూడు సార్లు మునక (నారు మళ్ల దశ నుంచి నాట్లు పూర్తయిన నెల వరకు) తప్పడం లేదు. ఆపైన పంట చేతికొచ్చే సమయానికి తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్నిచోట్ల గింజ కూడా చేతికి రాని పరిస్థితులున్నాయి. 2023 మిగ్‌జాం తీవ్ర తుపాను ధాటికి కోతకు కొచ్చిన పంట నేల వాలడంతో.. కొన్ని జిల్లాల్లో రైతులు దమ్ము తొక్కించాల్సి వచ్చింది. గతేడాది అంబేడ్కర్‌ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లోనూ కొన్నిచోట్ల పంట విరామం ప్రకటించాల్సిన దుస్థితి. ఏటా ముంపు బారిన పడుతుండటంతో ఖరీఫ్‌ పంట సాగు చేయలేదు. అయినా జగన్‌ ప్రభుత్వం మొద్దునిద్రలో జోగుతోంది.


సొమ్ము జమ చేయడానికీ.. సతాయింపులే

కూలీలకు చెల్లింపులతోపాటు, అప్పు తీర్చుకోవాలని రైతులు పంట అమ్ముతారు. అయితే వైకాపా ప్రభుత్వం మాత్రం ధాన్యం అమ్మిన.. 21 రోజులకు డబ్బు ఇస్తామంటోంది. గతంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లో చెల్లింపుల విధానం ఉండేది. కొన్ని దఫాలు ఆలస్యమైనా.. అధికశాతం రైతులకు నిర్ణీత గడువులోగా డబ్బు జమ అయ్యేది. నాలుగున్నరేళ్లుగా.. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఈ రోజు ధాన్యం కొంటే.. ట్రక్‌షీట్‌ తయారు చేసే సరికి 10-15 రోజులపైనే అవుతోంది. అంటే అమ్మిన తర్వాత 15 రోజులకు లెక్కలో రాస్తారు. అప్పటినుంచి 21 రోజులు లెక్క వేస్తారు. అధిక సందర్భాల్లో ఆ గడవూ దాటి రెండు, మూడు నెలలు అవుతోంది.


ధాన్యం సేకరణకూ ‘ఏకీకృతం’?

జగన్‌ అధికారం చేపట్టాక.. ఏకీకృత విధానం అమలు చేస్తున్నారు. ఇసుక అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మద్యం సరఫరా విధానం కూడా ఏకీకృతం చేసి.. సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలతోపాటు.. అంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. 2022 రబీలోనే.. ధాన్యం సేకరణ బాధ్యతల్ని జిల్లాకు ఒక మిల్లరుకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచించింది. దీనికి అనుగుణంగా టెండర్లు కూడా పిలిచింది. అంటే జిల్లాలో ధాన్యం సేకరణను గుత్తాధిపత్యం చేస్తూ.. ఎంపిక చేసిన మిల్లరుకు అప్పగిస్తారు. ఇప్పటికే మద్దతు ధర అందక పోవడం, తడిసిన ధాన్యం కొనుగోలుకు ఎదురు సొమ్ములు, కిలోల లెక్కన కోత, రుసుములు అందకపోవడం తదితర సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకీకృత విధానం అమల్లోకి వస్తే.. మిల్లరు చెప్పినట్లు తలూపాల్సిందే.


ఏటికేడు కుదించడమే.. వైకాపా సర్కారు ఘనత

ధాన్యం సేకరణను కూడా ప్రభుత్వం భారంగా భావిస్తోంది. ఏటికేడు కొనుగోలు చేసే ధాన్యం పరిమాణం తగ్గుతుండటమే దీనికి నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 85 లక్షల టన్నులను సేకరించగా.. 2022-23 నాటికి అది 49 లక్షల టన్నులకు తగ్గింది. ఉత్పత్తిలో తగ్గుదల 4లక్షల టన్నులే అయినా.. సేకరణలో మాత్రం 35లక్షల టన్నుల మేర కోత పెట్టారు. పోనీ రైతులకు ఏమైనా అధిక ధరలు దక్కి.. బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారా? అంటే అదీ లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సేకరించేది దొడ్డు రకాల ధాన్యమే. సన్న రకాలను ఎలాగూ బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటారు. వాటికి మంచి ధరలు కూడా దక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాణ్యమైన ‘జయ’ రకం బియ్యాన్ని సరఫరా చేస్తే తీసుకుంటామని గతేడాది కేరళ ప్రభుత్వం కోరింది. తర్వాత పర్యటనలైతే చేశారు, సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు, కానీ.. బియ్యం మాత్రం పంపలేదు. ‘జయ’ రకం వేస్తే, వాటిని కొంటారనే ఆశతో సాగు చేసిన రైతులు.. చివరకు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. అవి మిల్లర్లకు చేరాక ధర పెరిగింది. ఏపీ నుంచి సరఫరా లేకపోవడంతో.. ఈ ఏడాది తెలంగాణ నుంచి సేకరించేందుకు కేరళ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.



కౌలు రైతు.. గొగ్గోలు!

కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదు. కౌలు కార్డుల్లేవంటూ పంటనష్టానికి పెట్టుబడి రాయితీ రాదు. బీమా అందదు. ఇతర రాయితీలూ ఉండవు. కూలీనాలీ చేసి కూడబెట్టిన సొమ్మును.. ఎకరా, రెండెకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడిగా పెడుతున్నారు. చిల్లిగవ్వా దక్కక.. సాగు మానుకుంటున్నారు.

2023-24లో వరి సాధారణ విస్తీర్ణం 57.88లక్షల ఎకరాలు కాగా.. 44.88 లక్షల ఎకరాల్లోనే అంటే 77.53% విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయి. ఇందులో ఒక్క రబీ పంట చూస్తే.. ఫిబ్రవరి మొదటి వారానికి 64% విస్తీర్ణంలోనే నాట్లు వేశారు. సాధారణం కంటే సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కరవు కారణంగా చాలా ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. కృష్ణా డెల్టాలో నీరందక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పంట కోత సమయంలో.. మిగ్‌జాం వచ్చి ముంచేసింది. అయినా ఇటీవల విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో ఎకరాకు సగటు దిగుబడి ఖరీఫ్‌లో 22 క్వింటాళ్లు, రబీలో 28.50 క్వింటాళ్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.


ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని