సంబంధం లేని అధికారిని కోర్టుకు పిలిపించేలా చేస్తారా?

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన ఘటనతో సంబంధం లేని ఓ అధికారిని ప్రతివాదిగా పేర్కొనడంతోపాటు, ఆయనను కోర్టుకు పిలిపించేలా చేసినందుకు పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Published : 24 Feb 2024 04:29 IST

ఖర్చుల కింద సీసీఐ ఛైర్మన్‌కు రూ 30వేలు చెల్లించండి
పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన ఘటనతో సంబంధం లేని ఓ అధికారిని ప్రతివాదిగా పేర్కొనడంతోపాటు, ఆయనను కోర్టుకు పిలిపించేలా చేసినందుకు పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఛైర్మన్‌, ఎండీని ముంబయి నుంచి కోర్టు ధిక్కరణ కేసులో అనవసరంగా హైకోర్టుకు పిలిపించడానికి కారణమైనందుకు ఆయనకు రూ. 30వేలు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ తప్పు పిటిషనర్‌ వల్ల జరిగిందని, దీంతో సీసీఐ ఛైర్మన్‌కు అసౌకర్యం కలిగిందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల్లో అధికారులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని హితవు పలికింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

సీసీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజరు(సీజీఎం) ఎలాంటి విచారణ జరపకుండా సర్వీసు నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ సీసీఐ గుంటూరు బ్రాంచికి చెందిన జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ కె.వికాస్‌ గతేడాది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మార్చి 31న విచారణ జరిపిన న్యాయస్థానం తొలగింపు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులకు అధికారులు కట్టుబడకపోవడంతో వికాస్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. సీసీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా లలిత్‌కుమార్‌ గుప్త, గుంటూరు బ్రాంచ్‌ సీసీఐ బ్రాంచ్‌ మేనేజరు స్వప్నిల్‌, పూర్వ మేనేజరు సాయి ఆదిత్యలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇటీవల కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యంలో ప్రతివాదుల హాజరుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముంబయి నుంచి లలిత్‌కుమార్‌ గుప్త శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లలిత్‌కుమార్‌ గుప్త సీసీఐ ఛైర్మన్‌, ఎండీగా వ్యవహరిస్తున్నారన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆయన పేరును చీఫ్‌ జనరల్‌ మేనేజరుగా తప్పుగా ప్రస్తావించారన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేసే విషయంలో సీసీఐ ఛైర్మన్‌గా లలిత్‌కుమార్‌ గుప్తకు సంబంధం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. లలిత్‌కుమార్‌ పేరును పిటిషనర్‌ సీజీఎంగా తప్పుగా పేర్కొన్నారని ఆక్షేపించారు. సీసీఐ ఛైర్మన్‌ గుప్త ముంబయి నుంచి హైకోర్టుకు రావడానికి కారణమైనందుకు రూ 30వేలు ఖర్చుల కింద చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని