మేయర్లు.. మేసేస్తున్నారు!

నగరాలకు రక్షకులుగా ఉండాల్సిన మేయర్లే.. ప్రధాన భక్షకులుగా తయారయ్యారు.. పని జరగాలంటే ముడుపులు.. ప్రాజెక్టులు మొదలవ్వాలంటే.. పర్సంటేజీలు కాదూ కూడదంటే.. అధికారులకు బదిలీలు..

Updated : 24 Feb 2024 05:04 IST

అక్రమార్జన రుచిమరిగిన నగరాల ప్రథమ పౌరులు
ప్రజల సమస్యలు పట్టవు.. పైసా లేనిదే పనులు జరగవు
ఇదీ జగన్‌ పాలనలో  నగరపాలికల పరిస్థితి

నగరాలకు రక్షకులుగా ఉండాల్సిన మేయర్లే.. ప్రధాన భక్షకులుగా తయారయ్యారు..
పని జరగాలంటే ముడుపులు.. ప్రాజెక్టులు మొదలవ్వాలంటే.. పర్సంటేజీలు కాదూ కూడదంటే.. అధికారులకు బదిలీలు..
గుత్తేదారులకు బిల్లులు ఆపేయడాలు.. జగన్‌ స్ఫూర్తితో.. అవినీతిలో వైకాపా కీర్తితో.. అక్రమాల్లో వాయువేగంతో దూసుకుపోతున్నారు.

అడుగడుగునా అరాచకాలకు గొడుగు పట్టి.. ఓ మోస్తరు భయోత్పాతం సృష్టించి రాష్ట్రంలో 13 మేయర్‌ పీఠాలను దక్కించుకుంది వైకాపా. ఆపైన ఈ రెండున్నరేళ్లలో నగరపాలక సంస్థలను అవినీతికి, అక్రమ వసూళ్లకు కొందరు మేయర్లు పుట్టినిళ్లుగా మార్చారు. కమీషన్లు, భూ దందాలు, అక్రమ వసూళ్లే పరమావధిగా చెలరేగిపోతున్నారు. రహదారులు దారుణంగా ఉన్నా, విషంలాంటి కలుషిత నీరు తాగి ప్రజలు మృత్యువాత పడుతున్నా, కాలువల్లోని మురుగు రోడ్లపైకి వస్తున్నా.. పట్టించుకోవడం లేదు. దోమల రొదతో ప్రజలు అల్లాడుతున్నా, వెలగని వీధి దీపాలు, శునకాల స్వైరవిహారంతో అవస్థలు పడుతున్నా.. వీరికి కనిపించడం లేదు.

రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో 13 చోట్ల 2021లో ఎన్నికలు జరిగాయి. వీటిలో అధికార వైకాపాకు చెందిన వారే మేయర్లుగా బాధ్యతలు చేపట్టారు. ‘మా నాయకుడి దారిలోనే మేమూ’, ‘నీకింత.. నాకింత’.. అన్నట్లుగా దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా వీరిలో కొందరు వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థల్లో కీలక విభాగాల నుంచి ప్రతి నెలా ముడుపులు స్వీకరిస్తున్నారు. గుత్తేదారులకు ఇచ్చే బిల్లుల్లోనూ గంపగుత్తగా వీళ్లకు కమీషన్లు సమర్పించుకోవాల్సిందే. కొందరు మహిళా మేయర్లైతే భర్త చాటు భార్యలుగా మిగిలిపోతున్నారు.


మేయర్‌కు 4%.. మంత్రికి 4%

రాయలసీమలో అత్యంత ప్రాధాన్యమున్న ఒక నగరపాలక సంస్థ మేయర్‌ కమీషన్‌ రాయుడిగా పాపులర్‌ అయ్యారు. గుత్తేదారులు ముందుగా మేయర్‌ను కలిసి కమీషన్‌ చెల్లించాకే పనులు ప్రారంభించాలి. లేదంటే అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఈ నగరాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి కేటాయించిన నిధులు మేయర్‌కు వరంలా మారాయి. కమీషన్ల దందా వెనుక జిల్లాకు చెందిన మంత్రి భాగస్వామ్యం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. మేయర్‌, మంత్రి కలిపి చెరో 4% చొప్పున కమీషన్లు పంచుకుంటున్నారని నగరంలో ఎవర్ని అడిగినా చెబుతారు. వీరి అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ(యూజీడీ), ఇతర కీలక పనుల నిర్వహణకు ముందుకురావడానికే గుత్తేదారులు భయపడుతున్నారు.


ఆయన రూటే.. సెప‘రేటు’!

ఉత్తరాంధ్రలోని మరో కీలక నగరపాలక సంస్థ మేయర్‌ తన పరిధిలోని పనుల ఆమోదం కోసం కమీషన్లు తీసుకోవడం రివాజుగా మారింది. స్థాయీ సంఘం  సమావేశం ఎజెండాలో చేర్చే కీలకాంశాలకు ముందుగా రేటు నిర్ణయించాకే ఆమోదిస్తున్నారు. ఇలా వచ్చిన ముడుపులు మేయర్‌తోపాటు స్థాయీ సంఘం సభ్యులు పంచుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ.


నెలవారీ టార్గెట్లు..!

దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన ఒక నగరపాలక సంస్థ మేయర్‌ ధనదాహానికి అంతే ఉండటం లేదు. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌, రెవెన్యూ, ప్రజారోగ్యం.. ఇలా అన్ని విభాగాల నుంచి నెల వారీగా టార్గెట్లు పెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. విలువైన భూములకు తప్పుడు దస్తావేజులు సృష్టించి భర్తతో కలిసి భూ దందాలు చేస్తున్నారు. నగర పరిపాలన   వ్యవహారాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి జోక్యం కూడా ఎక్కువే. కీలక విషయాల్లో ఆయనే చక్రం తిప్పుతున్నారు.


నెలనెలా ముడుపులు పంపాల్సిందే!

ఉత్తరాంధ్రలోని ఓ నగరపాలక సంస్థ మేయర్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ప్రతి నెలా భారీగా ముడుపులు తీసుకుంటున్నారు. ఇందుకు అంగీకరించని, చెప్పిన పని చేయని అధికారులపై బదిలీ మంత్రం ప్రయోగిస్తారు. పట్టణ ప్రణాళిక విభాగంలో కీలక అధికారి ఇటీవల బదిలీ అయ్యారు. దీని వెనుక మేయర్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.


‘ఆమే’యర్లు ఉత్తుత్తే..!

ఉత్తరాంధ్రలోని ఒక ప్రధాన నగరపాలక సంస్థలో మేయర్‌ కంటే ఆమె భర్త హవానే ఎక్కువ. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. మేయర్‌ ఛాంబర్‌లో కూర్చొని ఆయన వ్యవహారాలు చక్కదిద్దుతుంటారు. భవన నిర్మాణాల అనుమతుల నుంచి ఇంజినీరింగ్‌ పనులకు నిధుల కేటాయింపుల వరకు భర్త చెప్పినట్లే మేయర్‌ నిర్ణయాలు తీసుకుంటారనేది ఆరోపణ.

కోస్తాలోని మరో నగరపాలక సంస్థలో మేయర్‌ భర్తే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన కార్పొరేటర్‌ కూడా కావడంతో అధికారిక సమావేశాల్లోనూ జోక్యం ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రణాళిక విభాగాన్ని మేయర్‌ భర్త తన అక్రమ ఆదాయానికి ఆయువు  పట్టుగా మలుచుకున్నారు. క్షేత్రస్థాయిలో కొత్త నిర్మాణాలపై ప్రజల నుంచి అక్రమ వసూళ్లు చేయిస్తున్నారు. ఇంజినీరింగ్‌ పనులపై గుత్తేదారుల నుంచి 5% కమీషన్లు తీసుకుంటున్నారు.   

రాజధాని ప్రాంతంలోని ఒక నగరపాలక సంస్థ భర్త పరిపాలన వ్యవహారాల్లో జోక్యం ఎక్కువగా ఉంటోంది. నగరంలో అనేక అక్రమ కట్టడాల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. వాణిజ్య సముదాయాల్లో దుకాణాల లీజు కాలం పెంపు, కొత్త దుకాణాల కేటాయింపులోనూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థాయీ సంఘం ఎజెండాలోని అంశాలను మేయర్‌ ద్వారా వాయిదా వేయించి సంబంధిత వ్యక్తులు వచ్చి కలిశాక వాటిని ఆమోదించేలా వ్యవహారాలు నడుపుతున్నారు.


అదో రకం బెదిరింపు!

సీఆర్‌డీఏ పరిధిలోని ఓ నగరపాలక సంస్థ మేయర్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను తన అక్రమార్జనకు వీలుగా ఉపయోగించుకుంటున్నారు. అనుమతులు తీసుకోకుండా వెలసిన వెంచర్ల వద్దకు అధికారులను పంపి మళ్లీ వెనక్కి రమ్మంటారు. తనను కలిసిన సంబంధిత వ్యాపారులతో మాట్లాడి వ్యవహారం చక్కదిద్దుతున్నారు.


కమీషన్లకు కక్కుర్తి!

నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌లో 50 శాతానికిపైగా నిధులు కేటాయించి వెచ్చించే ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో భారీగా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. పనుల కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు మేయర్లు దండిగా ముడుపులు వసూలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని ఒక నగరపాలక సంస్థ మేయర్‌ ఈ- బస్‌బేల నిర్మాణం కాంట్రాక్టు ఇప్పించడానికి లక్షల్లో ముడుపులు తీసుకున్నారన్నది అభియోగం. తన సోదరుడితో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారు.


అక్కడ డిప్యూటీదే పరపతి!

రాయలసీమలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం నగరపాలక సంస్థలో మరో విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ మేయర్‌ కంటే డిప్యూటీ మేయరే పరిపాలన వ్యవహారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అధికార వైకాపా ఎమ్మెల్యే కుమారుడైన ఆయన నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలపైనా పట్టుసాధించడంతో మేయర్‌ డమ్మీగా మిగిలిపోయారు. పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో స్వాగతం, ధన్యవాదాలు అనే మాటలు తప్పితే ఆమె నోటి నుంచి మూడో మాట రాదు!

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని