ఎవరో అభివృద్ధి చేసిన పాఠశాలకు మీ తండ్రి పేరా?

ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఆయన స్వగ్రామంలోనే దళితుల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Feb 2024 05:24 IST

ప్రభుత్వ విప్‌ జగ్గిరెడ్డికి స్వగ్రామంలోనే దళితుల నుంచి నిరసన
అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శుద్ధి
విప్‌ వేసిన పూలమాలలు తొలగించి ఆందోళన

రావులపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఆయన స్వగ్రామంలోనే దళితుల నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి సిద్ధార్థనగర్‌లో మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాలను అదే గ్రామంలో ఉన్న అవంతీ సీఫుడ్స్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.60 లక్షలతో అభివృద్ధి చేసింది. ఈ బడికి ఎమ్మెల్యే తండ్రిపేరుతో ‘డాక్టర్‌ చిర్ల సోమసుందర్‌రెడ్డి మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాల’గా నామకరణం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, కంపెనీ యాజమాన్యం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లారు. అయితే పాఠశాలకు సోమసుందర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతానికి చెందిన దళితులు ఆందోళన చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే వేసిన పూలమాలను తీసివేసి క్షీరాభిషేకం చేశారు. పాఠశాలకు పూర్వపు పేరు ఉంచాలని లేదా నిధులు ఇచ్చిన కంపెనీ పేరు గాని, అంబేడ్కర్‌ పేరుగానీ పెట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రారంభోత్సవ సమయంలో అక్కడికి ఆందోళనకారులు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించి అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దౌర్జన్యం నశించాలి.. పాఠశాలకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరో అభివృద్ధి చేసిన పాఠశాలకు ఎమ్మెల్యే తన తండ్రి పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులతో తమను అణచివేస్తున్నారన్నారు. గతంలో ఓ హోటల్‌లో ప్లేట్లపై అంబేడ్కర్‌ చిత్రాలున్న ఘటనలోనూ తమ పిల్లలపై కేసులు పెట్టి జైలుకు పంపించారని.. ఇది అందరికీ తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని