అమరావతి విచ్ఛిన్నానికి మరో కుట్ర

రాజధాని అమరావతి విచ్ఛిన్నానికి జగన్‌ ప్రభుత్వం అన్ని మార్గాలూ వెతికి మరీ కుట్ర పన్నుతోంది.

Updated : 28 Feb 2024 06:47 IST

భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు ప్రతిపాదనలు
ఎన్నికల ప్రకటన వచ్చేవేళ జగన్‌ ప్రభుత్వం పన్నాగం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి విచ్ఛిన్నానికి జగన్‌ ప్రభుత్వం అన్ని మార్గాలూ వెతికి మరీ కుట్ర పన్నుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ప్రకటన వస్తుందనగా.. రాజధానిని దెబ్బతీసే పనిలో నిమగ్నమైంది. దీనికోసం సీఆర్డీఏ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. రైతులకు వార్షిక కౌలు జమ చేయాల్సి ఉన్నా.. దాన్ని పక్కన పెట్టేసి, అమరావతి బృహత్‌ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన భూసేకరణ నోటీసులను ఉపసంహరించడం, బృహత్‌ ప్రణాళిక నుంచి మంగళగిరి మండలంలోని గ్రామాలను తొలగించే ప్రతిపాదనలను గుట్టుగా రూపొందిస్తున్నారు. ఇవి రావడమే ఆలస్యం.. ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని బృహత్‌ ప్రణాళికను సవరించొద్దని హైకోర్టు చెప్పినా మొండిగా ముందుకే వెళ్తోంది.

దెబ్బతీసేందుకు ఎత్తులు

రాజధాని నిర్మాణానికి తెదేపా హయాంలో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను భూసమీకరణలో తీసుకున్నారు. బృహత్‌ ప్రణాళికకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భూములు ఇవ్వని గ్రామాల్లో సేకరణ ద్వారా తీసుకునేందుకు 4,300 ఎకరాలకు ప్రకటన ఇచ్చారు. కానీ 191.62 ఎకరాలనే అప్పట్లో సేకరించగలిగారు. అంతలో ప్రభుత్వం మారిపోయింది. రైతులు అప్పట్లో కోర్టును ఆశ్రయించడంతో సేకరణ ప్రక్రియ నిలిచింది. ఇప్పుడు ఈ ప్రక్రియను నిలిపివేసి, ప్రకటనను వెనక్కి తీసుకునేందుకు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

మంగళగిరి నియోజకవర్గాన్ని తప్పించాలని..

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలను కలిపి రాజధాని గ్రామాలుగా తెదేపా హయాంలో నిర్ణయించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాలను తప్పించేందుకు కుట్రలకు పాల్పడింది. తాజాగా నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను ఆ పరిధి నుంచి తప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు చివరిదశకు వచ్చాయి. మంగళగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో లోకేశ్‌ పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నుంచి తెదేపాకు బదిలీ అయిన ఓట్లకు గండికొట్టే వ్యూహం ఉందని తెలుస్తోంది.

అభివృద్ధికి శరాఘాతం

అమరావతిని ప్రపంచనగరంగా తీర్చిదిద్దేందుకు తెదేపా ప్రభుత్వం బృహత్‌ ప్రణాళికను రూపొందించింది. నివాస, ఉపాధి, విద్య, వైద్య, తదితర అవసరాలకు తగ్గట్లు తయారుచేసింది. ఈ మేరకు రైతులకు హామీ ఇవ్వడంతో భూములు ఇచ్చారు. రాజధాని 29 గ్రామాల్లో గతంలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకుంటే ఈ ప్రణాళికలకు భంగం కలుగుతుంది. ఇప్పటివరకు సేకరణలో ఉన్న భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉంది. సేకరణ నుంచి వెనక్కి వెళ్తే ఆ నిషేధం తొలగిపోతుంది. రోడ్లకే భూమిని ఉంచుకుంటారు. మిగిలింది రైతుల స్వాధీనంలోకి వెళ్తుంది. దీనివల్ల మాస్టర్‌ప్లాన్‌ మొత్తం దెబ్బతింటుంది. ఇది అమరావతి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

కర్త, కర్మ, క్రియ.. కమిషనర్‌

ప్రభుత్వ చర్యలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నా.. సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఖాతరు చేయడం లేదు. కొందరు కీలక అధికారులు ప్రభుత్వ కోర్కెలను మించి అత్యుత్సాహం చూపుతూ పనులు చక్కబెడుతున్నారు. గత ప్రభుత్వహయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణలో నిర్వాసితులకు రాజధానిలో ప్లాట్లు ఇచ్చారు. ఇంకా కొందరికి నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియ నిలిచింది. రాజధాని ప్రాంతంలోని పెద్ద ప్లాట్లను ఎంచుకుని, వాటిని చీల్చి వేలానికి ఉంచుతున్నారు. దీనివల్ల బృహత్‌ ప్రణాళికకు భంగం వాటిల్లుతుందని తెలిసినా విస్మరిస్తున్నారు. భూముల వేలం ద్వారా వచ్చిన రాబడిని రాజధానిలో వసతుల కల్పన కోసం కాకుండా గుత్తేదారులకు బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని