మా సమస్యలు పరిష్కరించాకే.. ఓట్లు బదిలీ చేయండి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రెండు గ్రామాలకు చెందిన 2,400 ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి బదలాయించడాన్ని ‘ఈ అరాచకం.. అనంతం’ శీర్షికన బుధవారం ‘ఈనాడు-ఈటీవీ’ వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించారు.

Published : 01 Mar 2024 04:44 IST

పోలవరం నిర్వాసితుల ఆందోళన
తొయ్యేరు, దేవీపట్నం గ్రామసభల్లో నిరసన

‘పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించి సమస్యలన్నీ పరిష్కరించాకే ఓట్లను రంపచోడవరం నుంచి బదిలీ చేయాలి. పోలింగ్‌ కేంద్రం కృష్ణునిపాలెంలో ఉన్నా, ఓటు మాత్రం రంపచోడవరం పరిధిలోనే ఉండాలి. ఓటరు కార్డుల్లో తప్పులున్నాయంటూ ఇప్పటికే పలువురిని ప్యాకేజీకి అనర్హులను చేశారు. ఇప్పుడు నియోజకవర్గమే మార్చితే మాకు న్యాయమెలా జరుగుతుంది?

గ్రామసభలో దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులు


ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీపట్నం, గోకవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రెండు గ్రామాలకు చెందిన 2,400 ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి బదలాయించడాన్ని ‘ఈ అరాచకం.. అనంతం’ శీర్షికన బుధవారం ‘ఈనాడు-ఈటీవీ’ వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించారు. కృష్ణునిపాలెం, దేవీపట్నం నిర్వాసితులకు గోకవరం మండలంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో రంపచోడవరం ఈఆర్‌వో, సబ్‌కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, సిబ్బంది గురువారం గ్రామసభలు నిర్వహించారు. నిర్వాసితుల ప్రశ్నలకు అసహనం చెందిన అధికారులు.. ‘మీలో రాజకీయం చేయడానికి వచ్చినవారు, సమస్యలున్నవారు వేర్వేరుగా నిలబడాల’ని ఆదేశించారు. తాము రాజకీయాలు చేయడానికి రాలేదని, ఓటు మార్చితే భవిష్యత్తులో న్యాయం జరగదనే భయంతోనే గోడు చెబుతున్నామని వాపోయారు. రంపచోడవరంలో ఓట్లు ఉన్నప్పుడే న్యాయం జరగలేదని, జగ్గంపేటకు మారిస్తే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఈఆర్‌వో ప్రశాంత్‌కుమార్‌ బదులిస్తూ.. 2021లో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో దేవిపట్నం, తొయ్యేరు గ్రామాల పోలింగ్‌ కేంద్రాలు ముంపులో ఉన్నందున ఓట్ల బదలాయింపునకు తీర్మానించారు అంటూ నాటి సమావేశంలో పాల్గొన్న ఏడుగురు నాయకుల పేర్లు చదివారు. తమ గ్రామాలతో సంబంధంలేని ఆ వ్యక్తులు చెబితే.. ఓట్లు ఎలా మారుస్తారని నిర్వాసితులు ప్రశ్నించారు. ఆరు నెలల పాటు ఒక వ్యక్తి ఎక్కడుంటే అక్కడికి ఓటు మారుస్తారని, ఇందులో భాగంగానే బదిలీ జరిగిందని సబ్‌కలెక్టర్‌ సమాధానమిచ్చారు. తమకంటే ఏడేళ్ల ముందే కృష్ణునిపాలెం వచ్చిన 17 గ్రామాల ప్రజల ఓట్లు ఎందుకు బదిలీ చేయలేదని బాధితులు నిలదీయగా సబ్‌కలెక్టర్‌ దాటవేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి సమస్యలు విన్నవిస్తామని వారంతా స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని