పేద తల్లిదండ్రులపై ఫీజుల భారం

ప్రభుత్వం ఇచ్చిన ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్‌ మొదటి ఏడాది తరగతులు గతేడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి.

Updated : 01 Mar 2024 05:52 IST

ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న యాజమాన్యాలు
త్వరలో ముగియనున్న 2023-24 విద్యా సంవత్సరం
ఒక త్రైమాసికం ఫీజులను నేడు విడుదల చేయనున్న సీఎం జగన్‌


గొప్పలు..

కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం.

వాస్తవం..

ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం బీటెక్‌ నాలుగో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్‌ 29తో చదువు పూర్తవుతుంది. కానీ.. ఈ విద్యాసంవత్సరంలో ఒక త్రైమాసికం ఫీజునే ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే సీఎం జగన్‌ మాత్రం ఎప్పటి ఫీజులను అప్పుడే చెల్లిస్తున్నామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.


అప్పులు చేసి కడుతున్నాం

విద్యాదీవెన కింద రాష్ట్రప్రభుత్వం 2023-24 విద్యాసంవత్సరానికి సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. అయినా కళాశాలలు కట్టాలని చెప్పడంతో అప్పులు చేసి చెల్లిస్తున్నాం. ఇప్పటికే కళాశాలలకు సగానికిపైగా ఫీజులు చెల్లించాం.

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన


ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్‌ మొదటి ఏడాది తరగతులు గతేడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి. బీటెక్‌ మూడు, నాలుగో సంవత్సరం వారికి డిసెంబరు, జనవరి నెలల్లోనే మొదటి సెమిస్టర్‌ పరీక్షలూ ముగిశాయి. అంటే వారి సగం విద్యాసంవత్సరం ముగిసినట్లే. మరో రెండు, మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కళాశాలైనా ఫీజు అడగకుండా ఉంటుందా? కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి ఫీజులు కడుతున్నారు. కానీ, జగన్‌ సర్కారుకు ఇవేమీ కనిపించవు. ఏ త్రైమాసికం ఫీజులను ఆ త్రైమాసికంలోనే ఇచ్చేస్తున్నామంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్‌.. అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. వసతిదీవెనను 2022-23 సంవత్సరంలో ఒక్కవిడతే ఇచ్చారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రూ.10వేలే వచ్చాయి. మిగతా రూ.10వేలపై ఇంతవరకు స్పష్టత లేదు.

ఇప్పటికి ఒక్క విడతా?

విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్న సమయంలో సీఎం జగన్‌ ఒకవిడత విద్యాదీవెన విడుదలకు శుక్రవారం బటన్‌ నొక్కబోతున్నారు. నిజానికి ఏడాదికి నాలుగు విడతల్లో మొత్తం ఫీజు డబ్బులను ప్రభుత్వం చెల్లించాలి. త్వరలో ఎన్నికల షెడ్యూలు వస్తుంది. అలాంటప్పుడు ఈ ఏడాది పూర్తిఫీజులు పేద పిల్లలకు అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో త్రైమాసికానికి రూ.708 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.2124 కోట్లు జమకావాలి.

పూర్తిగా భరిస్తానంటూ..

పేదపిల్లల చదువుకయ్యే ఖర్చును భరిస్తామని, ప్రతి పేద విద్యార్థినీ చదివిస్తానంటూ ఎన్నికల ముందు హామీనిచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక పీజీ కోర్సులకు ప్రైవేటులో బోధన రుసుము చెల్లింపును నిలిపేశారు. ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల్లో చదివేవారికే బోధన రుసుములను అందిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కొత్త కోర్సులు, ఉపాధి లభించేవి ఉండడంతో ఎక్కువమంది వాటిల్లో చేరతారు. అలా చేరే బడుగులూ సొంతంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. పీజీ కోర్సులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.450 కోట్లు ఇంతవరకూ ఇవ్వలేదు. ఫీజుల డబ్బులు రానందున విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు