మున్సిపల్‌ కార్మికుల 16 డిమాండ్లలో.. 9 పరిష్కారం

మున్సిపల్‌ కార్మికుల 16 డిమాండ్లలో తొమ్మిదింటిని పరిష్కరించేలా ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 05:19 IST

ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: మున్సిపల్‌ కార్మికుల 16 డిమాండ్లలో తొమ్మిదింటిని పరిష్కరించేలా ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మిగిలిన వాటిని పరిష్కరించడంతో పాటు సమ్మె సమయంలో వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సచివాలయంలో మంత్రి అధ్యక్షతన మున్సిపల్‌ కార్మికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కేటగిరి-1 వర్కర్లకు ప్రస్తుతం నెలకు చెల్లిస్తున్న రూ.18,500 వేతనాన్ని రూ.24 వేలకు పెంచాం. 748 మంది అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి వర్కర్లు, 147 మంది శానిటేషన్‌ వెహికల్‌ డ్రైవర్లకు ప్రయోజనం కలుగుతుంది. కేటగిరి-2 వర్కర్లకు వేతనం, అలవెన్సులు కలిపి నెలకు రూ.21 వేలు ఇస్తాం. 31,600 మందికి ఇది వర్తిస్తుంది. మురుగు శుద్ధి చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయే కార్మికులకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాం. శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.20 లక్షలు, అంగవైకల్యానికి రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించనున్నాం’’ అని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.


పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది
- మున్సిపల్‌ కార్మిక సంఘాల ఐకాస

కార్మికుల పోరాటం కారణంగానే ప్రభుత్వం దిగొచ్చి ఉత్తర్వులు ఇచ్చిందని మున్సిపల్‌ కార్మిక సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ పోరుమామిళ్ల సుబ్బరాయుడు అన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే కార్మికులు చేసే పని ఆధారంగా కేటగిరీలు నమోదు చేసి.. ఆ మేరకు వారికి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం.. త్వరగా ఉత్తర్వులను ఇవ్వాలని పేర్కొన్నారు. శాశ్వత కార్మికులకు సరెండర్‌ లీవ్‌ల ఎన్‌క్యాష్‌మెంట్‌ విడుదల చేసి, జీపీఎఫ్‌ ఖాతాలు తెరిచేలా ఇచ్చిన హామీలను ఎన్నికల ప్రకటన రావడానికి ముందే అమలు చేయాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని