ఓటర్ల జాబితాలో తప్పులు అన్నీ ఇన్నీ కావు

రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమాలు.. దేశంలో మరెక్కడా జరగలేదు. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలకు రాష్ట్రం ప్రయోగశాలగా కాదు విశ్వవిద్యాలయంగా మారింది’ అని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విమర్శించారు.

Updated : 03 Mar 2024 09:07 IST

ఎన్నికల అక్రమాలకు విశ్వవిద్యాలయంలా రాష్ట్రం
సీఎఫ్‌డీ కార్యదర్శి రమేశ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమాలు.. దేశంలో మరెక్కడా జరగలేదు. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలకు రాష్ట్రం ప్రయోగశాలగా కాదు విశ్వవిద్యాలయంగా మారింది’ అని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విమర్శించారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సీఎఫ్‌డీ ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం’ అనే అంశంపై రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమం నిర్వహించారు.

రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఇక్కడ జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గీత చెరిగిపోయింది. సొంతూరులో ఓటుహక్కు సంపాదించుకోవడానికి నాకు మూడేళ్లు పట్టింది. వాలంటీర్లు రానున్న ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోవాలని ఓ మంత్రి సలహా ఇవ్వడం దారుణం. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో చనిపోయినవారి ఓట్లు, పేర్లు, ఫొటోలు మార్చి 35 వేల దొంగ ఓట్లను సృష్టించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎన్నికలకు ముందు మన ఓట్లు కూడా జాబితాలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఓటర్లలో చైతన్యం రావాలి’ అని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే పోలీసులు 171 సెక్షన్‌ను వినియోగించడం దారుణమని రమేశ్‌ కుమార్‌ విమర్శించారు. కొందరు పోలీసు అధికారుల వల్ల వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ నియోజకవర్గంలోనైనా అధికారులు ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే వారిపై చర్యలకు డిమాండ్‌ చేయొచ్చని ఆయన వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం సులువు కాదని.. యువత తమ ఓటు హక్కుతో నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడమే కాకుండా ఆ హక్కుపై చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఓటుహక్కుపై చైతన్యం కల్పించేలా రూపొందించిన గేయాలు, లఘు నాటికలు యువతను ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని