ఓటు హక్కుపై వేటు.. అదే జగన్‌ రూటు!

అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్‌.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు.

Updated : 18 Apr 2024 16:43 IST

అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్‌.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు.

పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో పదో తరగతి, ఇంటర్‌ పిల్లల పేర్లూ ఓటరు జాబితాలోకి వచ్చిచేరాయి. ఒంగోలులో 16 ఇంటి నంబర్లతో ఏకంగా 500 ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా తిమ్మాపురం జనాభా 207 అయితే, ఆ ఊళ్లో ఓటర్లు 535 మంది! తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త ఓట్ల నమోదుకు తొమ్మిది నెలల్లో దాదాపు 50వేల అర్జీలొచ్చాయి. తమిళనాడుకు చెందినవారు ఇక్కడ ఓటర్లయ్యారు. పిఠాపురంలో 12,500 ఓట్ల తీసివేతకు దరఖాస్తులు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు మాయమయ్యాయి. వైకాపా వర్గీయులకేమో ఒకటికి రెండు ఓట్లు వచ్చాయి. ఇదే మరి జగనన్న రాజ్యం.. ప్రజాస్వామ్యం పీకకొరికిన పిశాచాల సామ్రాజ్యం! గిట్టని ఓటర్లను జాబితాల్లోంచి తీసిపారేయించిన జగన్‌ పార్టీ- దొంగ ఓట్లను గంపగుత్తగా చేర్పించింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాలరాసేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు అది కాచుక్కూర్చుంది. దాష్టీకాలే ఊపిరిగా రాష్ట్రాన్ని ఏలిన జగన్‌- గెలుపుకోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు.

కుట్రదారుల ముఠానాయకుడు జగన్‌

దొంగోడి దృష్టి ఎప్పుడూ మూట మీదే ఉన్నట్లు జగన్‌ చూపెప్పుడూ పదవిపైనే ఉంటుంది. దానికోసం ఎంతటి దారుణాలకైనా ఆయన సదా ‘సిద్ధం’గా ఉంటారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలోనైతే జగన్‌ ఎప్పుడో పండిపోయారు. ఓట్లను గల్లంతు చేసే నేరాలకు 2019 ఎలెక్షన్లలోనే తెగబడింది వైకాపా. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్యకాలంలో 12.50 లక్షల ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫాం-7 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఏకంగా 9.50 లక్షల అర్జీలు పోటెత్తాయి. చంద్రగిరి, రాప్తాడు, గురజాల, భీమిలి, అనపర్తి.. ఇలా పలు నియోజకవర్గాల్లో వేలాది ఓట్ల తొలగింపునకు కుట్రలు సాగాయి. అప్పట్లో అలా ఫాం-7 దరఖాస్తులు చేసినవారిలో 80శాతానికి పైగా జగన్‌ పార్టీ నేతలు, సానుభూతిపరులేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పరిశోధనలో తేలింది. దానికి అనుగుణంగా సంబంధితులపై కేసులూ నమోదయ్యాయి. అంతలోనే ఎన్నికలు పూర్తయ్యి జగన్‌ అధికారంలోకి వచ్చారు. దొంగ చేతికే తాళాలు రావడంతో ‘సిట్‌’ నివేదికకు చెద పట్టింది. జగన్‌ పాదదాసులైన పోలీసులు- ఓట్ల తొలగింపు కుట్రదారులపై నమోదైన కేసులను మూసేశారు. ఐపీ అడ్రెస్‌లు దొరకలేదంటూ అత్యధిక కేసులను కంచికి పంపేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులను పెట్టిన వారిని వెంటాడి పట్టుకున్న వైకాపా ఖాకీలకు ఐపీ చిరునామాలను ఆరా తీయడం అసాధ్యమా? అదేంకాదు- కుట్రదారుల్లో అత్యధికులు జగన్‌ మనుషులు కాబట్టే కేసులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వస్త్రాపహరణం చేసిన వైకాపా- జగన్‌ సీఎం అయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఓటర్ల జాబితాలతో బంతాట ఆడుకుంది.

పాతకాలన్నీ జగన్‌ పార్టీవి..

రాత్రిపూట ఊరంతా కన్నాలేసే మనిషి- తెల్లారి ‘దొంగతనం మహాపాపం’ అని జనానికి లెక్చర్లు ఇస్తే ఎలా ఉంటుంది? జగన్‌మోహన్‌రెడ్డి మాటలు కూడా అటువంటివే. ‘‘అర్హుడైన ఒక్క ఓటరునైనా జాబితా నుంచి తొలగిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం’’ అని అవినీతి జాతిరత్నమైన జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా సెలవిచ్చారు. అలాంటి పనులకు అప్పట్లోనే ఆయన పార్టీ పెట్టిందిపేరు. ఇక అధికారం తన వశమయ్యాక మొత్తం యంత్రాంగాన్ని తోలుబొమ్మను చేసి ఆడించింది వైకాపా. తిరుపతి ఉపఎన్నిక వేళ నగరపాలక సంస్థ ఉపకమిషనర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వర్‌రెడ్డి- ఎన్నికల సంఘం ఆదేశాలేమీ లేకుండానే ఈఆర్‌వోగా దొంగ అవతారమెత్తారు. ప్రభుత్వ పెద్దల దన్ను లేకపోతే ఒక అధికారి ఇంతటి పెద్ద నేరానికి పాల్పడతారా? మూడేళ్ల తరవాత నిద్రలేచిన ఎన్నికల సంఘం ఇటీవలే చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేయించింది. జగన్‌ పార్టీ పాడుపనులకు పక్కతాళం వేసిన నాటి ఐఏఎస్‌ అధికారి గిరీషాపైనా సస్పెన్షన్‌ వేటుపడింది. ఉరవకొండలో తెదేపా మద్దతుదారుల ఓట్ల భారీ గల్లంతుకు బాధ్యులుగా 2020, 2021ల్లో అక్కడ ఈఆర్‌వోలుగా ఉన్న కె.భాస్కర్‌రెడ్డి, శోభ స్వరూపారాణిలపై ఈసీ కత్తిదూసింది. నకిలీ ఓటర్ల కేసులను చాపచుట్టేసిన తిరుపతి ఖాకీలు, ఓట్ల తొలగింపు పాపంలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు పోలీసులకూ సస్పెన్షన్‌ తప్పలేదు. హత్య చేసినవాడి కన్నా చేయించినవాడికి ఎక్కువ శిక్ష పడాలి కదా. ఆ సహజ న్యాయసూత్రానికి జగన్‌ రాజ్యం అతీతం. కాబట్టే అధికారులను ముందుపెట్టి కథ నడిపించిన వైకాపా చోర నేతాగ్రేసురులు అందరూ ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నారు. ఎన్నికల బరిలో దిగి మళ్లీ జనం నెత్తిన చెయ్యిపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

జగన్‌ పుట్టలో తాచుపాములు

సీఎంగా ప్రజల జీవన ప్రమాణాలను జగన్‌ మెరుగుపరచలేదు. రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేసే అభివృద్ధి పనులేవీ చేపట్టలేదు. మౌలిక సదుపాయాలను విస్తృతం చేయలేదు. అవేమీ చేయకపోగా- ఉన్నవాటిని కూడా జగన్‌ నాశనం చేసిపెట్టారు. అదేం పాలన అన్నవారిపై లాఠీలను విరగ్గొట్టించారు. అందుకే గరుత్ముంతుణ్ని చూసిన పాములా ఇప్పుడు జనాన్ని చూసి జగన్‌ వణికిపోతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న భయంతోనే ఆయన అంతేవాసులు ఓటర్ల జాబితాలను తమకు ఇష్టమొచ్చినట్లు మార్పించేశారు. ‘‘మన పార్టీకి చెందనివారి ఓట్లు తీసేసేలా చేయాలి. మన ఓట్లా, వేరేవాళ్లవా గుర్తించి మనవనుకున్నవి ఉంచాలి. కాదంటే తీసేయించాలి’’ అని వైకాపా నాయకులకు పురమాయించారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ‘‘మన ఓట్లయితే సరే. మనవి కాదనుకుంటే వాటిపై అభ్యంతరం చెప్పండి. ఫారం-7 దాఖలు చేయండి’’ అని వైకాపా కార్యకర్తల సమావేశంలో దగుల్బాజీ రాజకీయ పాఠాలు చెప్పారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి కొద్దినెలల కిందటి వరకు ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. అప్పట్లో ఆమె వ్యక్తిగత కార్యదర్శి, ఇంకో ముగ్గురు వైకాపా నాయకులు కలిసి అర్హుల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టారు. టెక్కలిలో మొత్తం ఏడువేలకు పైగా ఓట్లు జాబితాలోంచి ఎగిరిపోయాయి. వాటిలో జగన్‌ పార్టీ ప్రబుద్ధుల కారణంగా ఎన్ని పోయాయో తెలియదు. అక్కడా ఇక్కడా అని కాదు- రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి! జగన్‌ అనుచరుల నైచ్యానికి ఓటర్ల జాబితాలన్నీ తప్పులతడకలయ్యాయి.

వైకాపా కుతంత్రాలు పారితే..

పోటీదారు కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు- అతన్నే విజేతగా ప్రకటించే ఎన్నికల విధానం మనది. కాబట్టి అర్హులైన ఓటర్లలో ఒక్కరిని తీసేసినా, ఒక్క బోగస్‌ ఓటును చేర్పించినా ఫలితాలే తారుమారవుతాయి. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో జగన్‌ పార్టీ కేవలం 169 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. తిరుపతి, నగరి, నెల్లూరు నగరం, తణుకుల్లో 700 నుంచి మూడువేల లోపు మెజార్టీలతోనే వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల్లో తెదేపా కన్నా నాలుగైదు వేల ఓట్లు మాత్రమే వైకాపా ఎక్కువగా సాధించగలిగింది. ఇలాంటప్పుడు వేలాది ఓట్లను తీసేసి, నకిలీ ఓటర్లను విచ్చలవిడిగా జాబితాలోకి ఎక్కించిన పర్యావసనాలు ఎలా ఉంటాయి? ప్రజాభీష్టంతో పనిలేకుండా ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంకోసమే వాలంటీర్లు, బూత్‌ స్థాయి అధికారులుగా ఉన్న చిరుద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాల్లో అక్రమ మార్పుచేర్పులకు ఒడిగట్టాయి జగన్‌ అసురగణాలు. ఉన్నతాధికార వర్గాలూ వైకాపా మోచేతి నీళ్లకు అర్రులుజాసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశాయి. ఎన్నికల సంఘం ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలించుకుని జగన్‌ పార్టీ కుతంత్రాలను సమర్థంగా అడ్డుకోవాలి. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటుహక్కును కబళించేందుకు కుట్రపన్నిన వైకాపా నేతలను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలి. జగన్‌ అనే అధికార దురాశాపరుడి గొడ్డలివేటుకు ప్రజాస్వామ్యం మరోసారి బలిపశువుగా కాకూడదంటే- ఈసీ క్రియాశీలతే కీలకం!


వెంకన్న సాక్షిగా వేలాది అక్రమాలు

జనానికి మంచి చేసి ఓట్లు అడగడటం- సాధారణ రాజకీయ నాయకుల ఆనవాయితీ. జనాన్ని ముంచేసి, బోగస్‌ ఓట్లను జాబితాలకు ఎక్కించి ఎలాగైనా గెలవాలనుకోవడం- జగన్‌ పార్టీ నికృష్ట పద్ధతి. శాసనమండలి ఎన్నికల్లో వైకాపా అలాగే అంతులేని అక్రమాలకు ఒడిగట్టింది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో నిరక్షరాస్యులను, పదో తరగతితో చదువు ఆపేసినవారిని ఓటర్లుగా చేర్చారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రైవేటు టీచర్ల పేరిట అనర్హులకు ఓటర్ల జాబితాల్లో చోటిచ్చారు. వాలంటీర్లే  పాత్రధారులుగా సాగిన ఈ నీతిబాహ్య బాగోతాలపై  గగ్గోలు రేగినా ఎన్నికల సంఘం అప్పుడు కళ్లూచెవులూ మూసుకుంది. అంతకు ముందుకు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో జగన్‌ పార్టీ అక్రమాలకైతే ఆకాశమే హద్దు అయ్యింది. అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ఉపఎన్నిక ఈఆర్‌వో(ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌)గా పనిచేశారు. ఆయన లాగిన్‌ వివరాలతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లిన జగన్‌ పార్టీ నేతలు- 35వేల గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వాటిపై ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, బయటి ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఎన్నికల రోజు ఆ బోగస్‌ ఓటర్లను ప్రతిపక్షాలు పట్టుకుని పోలీసులకు అప్పగించినా- అక్రమార్కులకు రాజపూజ్యాలే దక్కాయి. ఆధారాలతో సహా పట్టుబడిన కేటుగాళ్లపై పేరుకు కేసులు పెట్టిన జగన్‌ బంట్రోతు ఖాకీలు- ఆ తరవాత చిల్లరమల్లర సాకులతో వాటిని నీరుగార్చేశారు. తిరుపతి ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఓడించింది భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఊరంతా కోడైకూసింది. జగన్‌ రాక్షస రాజ్య రక్షకులైన పోలీసులకు, ఎన్నికల సంఘానికి మాత్రం అది వినపడలేదు... జగన్‌ పార్టీ పెద్దల నేరాలేవీ వారికి అసలు కనపడనేలేదు!  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని