ఇదీ జగన్‌ క్రమ‘బద్ధకీ’కరణ

మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం.

Published : 22 Mar 2024 05:24 IST

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తానని వంచన
నాలుగేళ్లు నిద్రపోయి.. ఇప్పుడు కోడ్‌ పేరిట తప్పించుకుంటున్న వైనం
దాదాపు 50 వేలల్లో 3,350 మందికే మోక్షం..
ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలల్లో ఒక్కరికీ అర్హత లేదట..  
ఒప్పంద ఉద్యోగులను ఒగ్గేసిన వైకాపా సర్కారు

మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందిని  రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇస్తున్నా.

గత ఎన్నికలకు ముందు జగన్‌ వ్యాఖ్యలివి.


ఐదేళ్ల కిందట ఊరించారు.. ఓట్లు వేయించుకొని గెలిచారు.. పీఠమెక్కాక రేపోమాపంటూ సాగదీశారు.. ఎన్నికలకు ముందు నిబంధనల కత్తి బయటకు తీశారు.. అర్హులను వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు.. ఇప్పుడు కోడ్‌ పేరిట హామీని అటకెక్కించారు.. ఆఖరికి.. అన్ని వర్గాల మాదిరే.. ఒప్పంద ఉద్యోగులనూ ఉసూరుమనిపించారు. కొలువు క్రమబద్ధీకరణ అవుతుందేమోనని ఆశపడిన వారంతా.. ఇక నిన్ను నమ్మం జగన్‌ అంటున్నారు!

మాటలతో మాయ చేయడంలో తనను మించిన ఘనులు లేరని సీఎం జగన్‌ పదేపదే నిరూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. 2019 ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా    అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో    సాగదీసి, కొంతమందికి మాత్రమే చేసి చేతులెత్తేశారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీ సంగతి.. మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు ఆయనకు గుర్తుకు రాలేదు. కోడ్‌ వస్తుందని తెలిసి.. కాంట్రాక్టు  ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ హడావుడి చేశారు. అలాగైనా మాట నిలబెట్టుకున్నారా అంటే.. అదీ లేదు. అన్ని శాఖల్లో కలిపి 50వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే.. వారిలో కేవలం 10,117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని వైకాపా సర్కారు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేసింది.


ఒకటీ రెండూ కాదు..

అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తానని గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ప్రతి సభలోనూ జగన్‌ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మొదటి నాలుగేళ్లు దీని గురించే పట్టించుకోలేదు. గతేడాది తీరిగ్గా ఈ అంశంపై కసరత్తు చేపట్టిన ప్రభుత్వం.. అర్హుల సంఖ్యను భారీగా కుదించాలనే ఉద్దేశంతో 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై ఒప్పంద ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఐదేళ్ల నిబంధనను తొలగించింది.

  • ఒప్పంద ఉద్యోగి పని చేస్తున్న పోస్టు ప్రభుత్వం మంజూరు చేసిందై ఉండాలనీ.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటికీ మంజూరు పోస్టులోనే పని చేస్తూ ఉండాలనే నిబంధన విధించింది.
  • ఉద్యోగ నియామకానికి ప్రకటన ఇచ్చి ఉండాలనీ.. ఆ పోస్టుకు రిజర్వేషన్‌ రోస్టర్‌ అమలు చేసి ఉండాలని ఇంకో నియమం పెట్టింది.
  • సబ్జెక్టు సైతం క్లియర్‌ వెకెన్సీ ఉండాలని, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని పేర్కొంది.
  • ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోలేదు. ఇలా అనేక వడపోతలతో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసింది. చివరికి 10,117 మందిని చేస్తామని చెప్పి, వారినీ చేయకుండానే జాప్యం చేసింది. ఎన్నికల కోడ్‌ వచ్చేవరకు వారిలో దాదాపు మూడోవంతు మందిని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదు.  

ఇంటర్మీడియట్‌లో చేతులెత్తేశారు..

ఇంటర్మీడియట్‌ విద్యలో 2014 ముందు నుంచి ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారు 3,593 మంది ఉన్నారు. వీరిలో ఒక్కర్ని కూడా క్రమబద్ధీకరించలేదు. ఏవేవో కారణాలు చూపుతూ ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు సాగదీశారు. తీరా ఇప్పుడు ఎన్నికల కోడ్‌ కారణంగా కుదరడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకుంది. 2000 నుంచి 2007 మధ్యలో   నియమితులైన వారు 1,514 మంది ఉన్నారు. వీరి నియామకాలను ప్రభుత్వమే చేసినా.. రిజర్వేషన్‌ రోస్టర్‌ పాటించలేదు. లెక్చరర్‌ పోస్టు జోనల్‌ స్థాయి కాగా.. స్థానికంగా ప్రిన్సిపాళ్లే ప్రకటనలు ఇచ్చి  నియామకాలు పూర్తి చేశారు. ఇలాంటి వాటిని పరిశీలిస్తున్నామంటూ ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు సాగదీసిన ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.

  • రాష్ట్రంలో 82 జూనియర్‌ కళాశాలలకు అసలు మంజూరు పోస్టులే లేవు. ఇక్కడ ఒప్పంద లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వీరిని క్రమబద్ధీకరించాలనుకుంటే పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.  
  • 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది నియామకమైతే.. వారి కోసం అప్పటికే మంజూరు పోస్టుల్లో పని చేస్తున్న 175 మంది ఒప్పంద ఉద్యోగులను నాన్‌-సాంక్షన్డ్‌ పోస్టులోకి మార్చేశారు. ఇది ప్రభుత్వం చేసిన మార్పే అయినా.. దాని ఫలితం మాత్రం ఒప్పంద ఉద్యోగులు అనుభవించాల్సి వస్తోంది.

సాంకేతిక విద్యలో అన్యాయం

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఒప్పంద ఉద్యోగులు 309 మంది ఉండగా..  ఇద్దర్ని మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు. వర్క్‌షాపు అటెండర్లలో అర్హులైన వారు 140 మంది ఉండగా.. 22 మందినే చేశారు. 24 పాలిటెక్నిక్‌లకు అసలు పోస్టుల మంజూరే లేదు. వీటికి మొత్తం 235 మంది  అవసరం. ఈ పోస్టులను మంజూరు చేస్తే.. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని క్రమబద్ధీకరించవచ్చు. డిగ్రీ కళాశాలల్లో అర్హులైన వారు 650మంది ఉండగా.. వీరిలో ఒక్కర్నీ చేయలేదు.


వైద్య ఆరోగ్యశాఖదో దారి..  

2014 జూన్‌ 2కు ముందు విధుల్లో చేరిన వారిలో సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను కోర్టు కేసులు సాకుగా చూపుతూ వైద్య ఆరోగ్య శాఖ పక్కన పెట్టింది. ఈ శాఖలో ఒప్పంద విధానంలో పని చేస్తున్న వారిలో 3,821 మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు. వీరిలో మల్టీపర్సస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (పురుషులు) వెయ్యి మంది వరకు ఉన్నారు. 2002లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష రాసి, రోస్టర్‌ పాయింట్ల ప్రకారం 2003లో పోస్టింగులు పొందారు. అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కొందర్ని విధుల నుంచి తప్పించారు. తుది తీర్పు వచ్చాక వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నా.. క్రమబద్ధీకరణకు మాత్రం నోచుకోలేదు.


ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు