ఈసీలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా?

రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వాకంతో రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ఈసీల జారీ నిలిచిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు.

Published : 28 Mar 2024 05:03 IST

సాంకేతిక కారణాలతో 10 రోజుల  నుంచి ఆన్‌లైన్లో నిలిచిన జారీ
ప్రైమ్‌-2.0 అమల్లోకి వచ్చినప్పటి నుంచి సమస్యలే
రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వాకంపై  ప్రజల మండిపాటు

ఈనాడు, అమరావతి: రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వాకంతో రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ఈసీల జారీ నిలిచిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు. కేంద్రం ఉచితంగా అందజేసే సాఫ్ట్‌వేర్‌ వద్దని రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కొని, వినియోగంలోకి తెచ్చిన ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ (ప్రైమ్‌-2.0) వల్ల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ సర్వర్‌లో సమస్య తలెత్తడంతో పది రోజుల నుంచి ఆన్‌లైన్లో ఈసీలు పొందలేకపోతున్నారు. నిర్దేశిత ఆస్తి వివరాలు సమర్పించి, ఫీజులు చెల్లిస్తే మీసేవ ద్వారా సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. అక్కడ ‘అప్రూవ్‌’ కాగానే తిరిగి మీసేవ ద్వారా కాపీ అందుకోవచ్చు. సాంకేతిక సమస్యలతో ఈ విధానానికి ప్రస్తుతం గండిపడింది. ఎనీవేర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆస్తుల వివరాలకు సంబంధించిన ఈసీలు పొందడంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేస్తే ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా ఈసీలు ఇస్తున్నారు. ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు కొనుక్కునేవారు ఈసీ తప్పనిసరిగా తీసుకుంటారు. కొనుగోలు చేయదలచుకున్న ఆస్తులకు సంబంధించి గతంలో జరిగిన క్రయవిక్రయాల వివరాలు, ఆస్తి తనఖాలో ఉందా? రుణాలు తీసుకున్నారా? వంటి సమాచారం ఈసీ ద్వారానే తెలుస్తుంది. ఇలాంటి ప్రాధాన్యమున్న ఈసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం లేకపోవడంతో ఆస్తుల కొనుగోళ్లపై కొనుగోలుదారులు వెంటనే నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి సర్టిఫైడ్‌ కాపీలు కూడా డౌన్‌లోడ్‌ కావడం లేదు. అపార్టుమెంట్లు, వెంచర్లకు సంబంధించి ప్లాట్లు, ఫ్లాట్ల వారీగా వివరాలు (లిస్ట్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్స్‌), నిషిద్ధ భూముల వివరాలు కూడా ఒక్కోసారి వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఈ వివరాలు తెలుసుకోవడానికి క్రయవిక్రయదారులు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని