కంప్యూటర్‌ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు

‘కంప్యూటర్‌ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్‌ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్‌ ఎకౌంటెంట్‌ హరినాథ్‌ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది.

Updated : 28 Mar 2024 07:29 IST

మెదడులో నరాలు చిట్లడంతో బెంగళూరులో చికిత్స

అనంతపురం జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘కంప్యూటర్‌ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్‌ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్‌ ఎకౌంటెంట్‌ హరినాథ్‌ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. బాధిత ఉద్యోగి దుస్థితిని చూసి చలించిపోయిన ఓ ఎస్టీఓ తమ శాఖ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపులో ఆ వీడియోను పోస్టు చేశారు. అది వైరల్‌గా మారింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎస్టీఓ కార్యాలయానికి అయిదు మండలాలకు చెందిన బిల్లులు, దస్త్రాలు వస్తాయి. ఈ కార్యాలయంలో ఒక ఎస్టీఓ, ముగ్గురు సీనియర్‌ ఎకౌంటెంట్లు, ఒక జూనియర్‌ ఎకౌంటెంట్‌ ఉండాలి. కానీ, ఎస్టీఓతో పాటు సీనియర్‌ ఎకౌంటెంట్‌ హరినాథ్‌ మాత్రమే ఉన్నారు. నలుగురు చేయాల్సిన పనిని ఒకరే చేస్తుండటంతో హరినాథ్‌ వారం కిందట తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెదడులో నరాలు చిట్లినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పని ఒత్తిడి కారణంగానే అలా జరిగిందని చెప్పినట్లు సమాచారం. తరచూ ఇలా కలవరిస్తున్నట్లు హరినాథ్‌ భార్య ఉద్యోగులకు చెప్పి కంటతడి పెట్టారు. గతేడాది జూన్‌ నుంచి హరినాథ్‌ ఒక్కరే అక్కడ పనిచేస్తున్నారు. మరొకరిని నియమించాలని విన్నవించినా, అనంత ఖజానా డీడీ స్పందించలేదంటూ ఆ శాఖ ఉద్యోగుల గ్రూపులో పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. డీడీ వైఖరి కారణంగా ఒక ఉద్యోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. చాలాసార్లు వినతులిచ్చినా ఎవరినీ నియమించలేదని తెలిపారు. హరినాథ్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత డీడీదేనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని