అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!

అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్‌ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్‌కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్‌కో నుంచి అందుతోంది.

Updated : 28 Mar 2024 06:30 IST

ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ జెన్‌కో
ఆర్‌ఈసీ నుంచి రూ.500 కోట్ల రుణం
ప్రభుత్వం రాయితీ మొత్తం చెల్లించకపోవడమే కారణం

ఈనాడు-అమరావతి: అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్‌ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్‌కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్‌కో నుంచి అందుతోంది. ఆ సంస్థకు బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధుల్ని సర్దుబాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. దీంతో జెన్‌కో ప్రస్తుత వేసవిలో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొనుగోలు చేయడానికి రుణం కోసం గ్రామీణ విద్యుత్‌ సంస్థ (ఆర్‌ఈసీ) తలుపులు తట్టింది. ఆర్‌ఈసీ అప్పు మొత్తాన్ని జెన్‌కోకు జమ చేయకుండా, రూ.500 కోట్లను నేరుగా ఎంసీఎల్‌ ఖాతాకు చెల్లించింది. ఇదీ మన విద్యుత్‌ సంస్థలపై కేంద్రానికి ఉన్న నమ్మకం. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని చెల్లించకపోవడంతో జెన్‌కోకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో.. ఇప్పటికీ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి.

ఆర్‌ఈసీ అప్పు ఇచ్చి గట్టెక్కించింది

ఆర్‌ఈసీ ఈ నెల అప్పు ఇచ్చి ఆదుకుంది.. వచ్చే నెల పరిస్థితి ఏంటి..? ప్రతి నెలా జెన్‌కో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రస్తుత పరిస్థితి నిదర్శనం. ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ఏటా సుమారు 30 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం. అందులో ఎంసీఎల్‌ నుంచి 22 మిలియన్‌ టన్నులు, సింగరేణి నుంచి 8 మిలియన్‌ టన్నులను తీసుకుంటోంది. గత నెల ఎంసీఎల్‌ నుంచి తీసుకున్న బొగ్గుకు సుమారు రూ.500 కోట్లు బకాయి పడింది. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయకుంటే బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతుంది. ఎన్నికల ఏడాది కావడంతో అంతరాయం లేకుండా విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా, ఆ మేరకు నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించడం జెన్‌కోకు సాధ్యం కావడం లేదు. ప్రతినెలా రూ.500 కోట్లు బిల్‌ డిస్కౌంట్‌ కింద సింగరేణికి చెల్లించి, ఆ మొత్తాన్ని నిర్దేశిత వ్యవధిలో బ్యాంకులకు జెన్‌కో చెల్లిస్తోంది. ప్రభుత్వం నుంచి రాయితీ మొత్తం అందితే ఇబ్బంది ఉండదు. అలా కాకపోవడంతో ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపుల్ని విద్యుత్‌ బిల్లులు వసూలయ్యే వరకు సర్దుబాటు చేయలేని పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.


విదేశీ బొగ్గు వద్దు.. ఉన్న దాంతో సర్దుకుందాం

ఏపీ జెన్‌కో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలన్న తాజా ప్రతిపాదననూ పక్కన పెట్టింది. కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రానికి అవసరమైన దానిలో కనీసం 10 శాతం విదేశీ బొగ్గు కలిపి వినియోగించాలని జెన్‌కో భావించింది. అందులో వినియోగించిన సాంకేతికత దృష్ట్యా కనీసం 30 శాతం విదేశీ బొగ్గు అవసరం. కానీ, విదేశీ బొగ్గు ధర టన్ను సుమారు రూ.12 వేల వరకు ఉండటంతో.. దాన్ని కొనుగోలు చేయటం వల్ల ఆర్థికభారం మరింత పెరుగుతుందని జెన్‌కో భావిస్తోంది. దీంతో ఎంసీఎల్‌ నుంచి తీసుకున్న బొగ్గుతోనే ఎలాగోలా కృష్ణపట్నం యూనిట్లను నడుపుతోంది. గతంలో అదాని నుంచి 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇంకా 1.3 లక్షల టన్నులు తీసుకోవాలి. అధిక ధరల దృష్ట్యా ఇప్పట్లో తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటీపీఎస్‌లో 1.70 లక్షల టన్నులు, ఆర్‌టీపీపీలో 1.35 లక్షలు, కృష్ణపట్నంలో లక్ష టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. అవి 5 నుంచి 6 రోజుల ఉత్పత్తికి సరిపోనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని