ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది.

Updated : 29 Mar 2024 06:13 IST

బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులా?
మోటార్‌సైకిల్‌ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా?
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు
జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి
ఏప్రిల్‌ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం
పదోన్నతులపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్‌
ఈనాడు - అమరావతి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్య ఆత్మహత్యా సదృశమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆగ్రహం ప్రకటించింది. లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు లాంటి బోధనేతర సిబ్బందిని కశాశాల ప్రిన్సిపల్స్‌గా నియమిస్తే.. సిలబస్‌ గురించి వారికేం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్‌ ఏ సబ్జెక్టు చెబుతున్నారో వారికెలా తెలుస్తుందని నిలదీసింది. 2021 డిసెంబరు 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

విద్యా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న ఈ జీవో మరే ఇతర కారణాలతోనో ఇచ్చినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఏప్రిల్‌ 1న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు.. ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ నెల 15న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌ హరినాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చారు.

ప్రిన్సిపల్‌ పోస్టుల పదోన్నతిలో జూనియర్‌ లెక్చరర్ల (లైబ్రరీ సైన్స్‌)ను పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 76కి విరుద్ధమంటూ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ (లైబ్రరీ సైన్స్‌) అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ప్రిన్సిపల్స్‌ పదోన్నతిపై కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్యామ్‌కుమార్‌ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. బోధనేతర సిబ్బంది తరఫు న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రిన్సిపల్‌ విద్యాసంస్థ పరిపాలన వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. అందువల్ల బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా నియమించొచ్చన్నారు.

గురువారం జరిగిన విచారణలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే వ్యవహారం, అందుకు సంబంధించిన జీవో 76పై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఏ రకంగా చూసినా ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల వంటి బోధనేతర సిబ్బందిని టీచర్లుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఇలాంటి జీవోను ఇప్పటి వరకు ఎందుకు సవాలు చేయలేదని అప్పీలుదారు తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిని ప్రశ్నించింది. ఎవరిని పడితే వారిని కళాశాల ప్రిన్సిపల్‌గా నియమిస్తే విద్యావ్యవస్థకు నష్టం జరగదా, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను పట్టించుకోరా అని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు