మూడు రాజధానులు ఏర్పాటు చేశాం

‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు.

Updated : 29 Mar 2024 10:07 IST

99 శాతం హామీలు అమలు చేశాం
యువతకు ఉద్యోగాలిచ్చాం
నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం

ఈనాడు- కర్నూలు, న్యూస్‌టుడే- నంద్యాల బృందం: ‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో కానీ జగన్‌ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లె వేశారు. ‘ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశాం.. గొప్ప మార్పు తీసుకువచ్చాం.. ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది’ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం.. ఆత్మస్తుతి, పరనింద తరహాలో సాగింది. ‘99 శాతం హామీలను అమలు చేశాం. ఉద్యోగాలిచ్చాం, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేశాం’ అని కూడా ప్రకటించారు.వివిధ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారు అని లెక్కలు చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జగన్‌ సభ జరుగుతున్న అదే నంద్యాలకు గతంలో ఏం హామీలిచ్చారు? వాటిలో ఎన్ని పూర్తి చేశారనేది చెప్పకపోవడం గమనార్హం. తనను ఓడించేందుకు నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని..వారికి కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ‘వీరంతా కలిసి ప్రజల రాజ్యాన్ని, రైతుల రాజ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూటమిని ప్రజలు ఓడించాలి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి డబుల్‌ సెంచరీ స్థానాల్లో వైకాపాను గెలిపించేందుకు మీరు సిద్ధమేనా’ అని సభకు హాజరైనవారిని అడిగారు. ‘ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ప్రజలు తమ తలరాతను మార్చుకునేందుకు కూడా’ అని వ్యాఖ్యానించారు. సొంత మీడియా సంస్థతోపాటు సామాజిక మాధ్యమాల్లో అన్ని వేదికలనూ విపరీతంగా వాడుకుంటూనే.. తనకు మీడియా మద్దతు లేదంటూ జనాన్ని నమ్మించేందుకు సీఎం మరోమారు ప్రయత్నించారు.

సీఎం ప్రసంగం ప్రారంభవక ముందే జనం తిరుగు ముఖం

వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఉమ్మడి జిల్లా నుంచి ఈ సభకు భారీగా జన సమీకరణ చేశారు. జిల్లాలోని నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనాన్ని వందల బస్సుల్లో తరలించారు. ఇంత చేసినా సభాప్రాంగణం వెలవెలబోయింది. నంద్యాలలోని 30 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని సభ కోసం తీర్చిదిద్దారు. వేదికముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారానికి, మధ్యలో సీఎం ర్యాంప్‌ వాక్‌కు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నా జనం మాత్రం సభపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సాయంత్రం 5.22 గంటలకు జగన్‌ బస్సు సభా ప్రాంగణంలోకి వచ్చింది. అప్పటికీ మైదానం నిండలేదు. ఇదే సమయంలో వందల మంది తిరుగుప్రయాణం కావడం గమనార్హం. ‘మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వస్తారని చెప్పి రూ.400 కూలి ఇచ్చి తీసుకొచ్చారు. ఎండ తగ్గుముఖం పట్టాక సీఎం వచ్చారు. రాత్రి మమ్మల్ని ఇళ్లకు ఎవరు చేరుస్తారు. భోజనం మాటేంటి’ అని పలువురు కార్యకర్తలు నాయకులను నిలదీస్తూ కనిపించారు.

మద్యం ప్రవాహం

మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసి జనాన్ని బస్సుల్లో సభకు తరలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో మద్యాన్ని భారీగా తీసుకొచ్చారు. ఒక్కో కార్యకర్తకు మద్యంతో పాటు రూ.300 నుంచి రూ.500 ఇచ్చినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో వైకాపా నాయకులు పథకాలు అందిన వాళ్లందరూ సభకు రావాలని, లేదంటే పథకాలు రద్దు చేయిస్తామని బెదిరించి బలవంతంగా తీసుకొచ్చారు. పట్టణంలోని చామకాల్వ మద్యం దుకాణం వద్ద వైకాపా జెండాలు, కండువాలతో కార్యకర్తలు రహదారిపైనే మద్యం తాగారు. బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా మద్యం తాగుతున్నా పోలీసులు చూస్తుండిపోవడం విమర్శలకు దారి తీసింది.

అలిపిరి బస్సులనూ వదల్లేదు

తిరుమలకు వెళ్లే అలిపిరి బస్సులను కూడా వైకాపా నాయకులు వదల్లేదు. వైకాపా సభలకు వెళ్లొచ్చిన అలిపిరి డిపో బస్సుల్లో మాంసం ముక్కలు కనిపించడం కొద్దిరోజుల కిందట వివాదాస్పదంగా మారింది. గురువారం కూడా అలిపిరి డిపో బస్సుల్లో యథేచ్ఛగా మద్యం తాగి, మాంసం తింటున్న దృశ్యాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు