ఎలక్టోరల్‌ బాండ్లు కుంభకోణమే

కేంద్ర ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ అభివర్ణించారు.

Updated : 30 Mar 2024 05:32 IST

దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం: పరకాల ప్రభాకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ అభివర్ణించారు. మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డి ‘ఎన్నికల బాండ్ల కొనుగోలు’ కిటుకు ఉపయోగించి బయట ఉన్నారని, అది తెలియక దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకు 400 పైబడి స్థానాలు వస్తే భవిష్యత్తులో ఎన్నికలే లేకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని నిరోధించడానికి ఈ ఎన్నికల్లోనే మార్పు రావాలని పిలుపునిచ్చారు. అఖిలభారత న్యాయవాదుల సంఘం (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సంక్షోభంలో నవభారతం: ఆర్థిక, రాజకీయ మూలాలు’ అంశంపై జరిగిన సెమినార్‌లో ముఖ్యవక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు.

‘దేశవ్యాప్తంగా ధనవంతులు ఎలా పెరుగుతున్నారో.. పేదలూ అలాగే పెరుగుతున్నారు. దేశంలో నిరుద్యోగం ఎంతలా ఉందంటే.. 2019లో రైల్వేలో 35వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. దీనికి దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగానికి ఇదే ప్రధాన ఉదాహరణ. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని సైతం లెక్కచేయకండా మన దేశం నుంచి యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో దాదాపు 24% యువతకు ఉపాధే లేదు. అసలు ఉద్యోగాలే దొరకడం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని