ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ ఇవ్వాలి

ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులకు పింఛన్లు ఇవ్వాలని, పంపిణీ ప్రక్రియ ఈ నెల 5 నాటికి పూర్తి చేయాలని తెదేపా నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Updated : 02 Apr 2024 06:04 IST

ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి
పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలి
చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిన వైకాపా నేతలను అరెస్టు చేయాలి
సీఎస్‌ జవహర్‌రెడ్డికి తెదేపా నేతల విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులకు పింఛన్లు ఇవ్వాలని, పంపిణీ ప్రక్రియ ఈ నెల 5 నాటికి పూర్తి చేయాలని తెదేపా నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాలు, పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాల వద్దకే వెళ్లాలన్న సెర్ప్‌ సీఈవో ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలన్నారు. పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు.

పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన నేపథ్యంలో సచివాలయాలు, పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చేలా తక్షణం ఏర్పాట్లు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారని, కలెక్టర్లతో మాట్లాడి పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని అనంతరం నేతలు మీడియాతో చెప్పారు. సీఎస్‌ మాట తప్పితే పింఛన్ల పంపిణీలో జాప్యం వెనుక ప్రభుత్వ కుట్రను ప్రజల్లోకి తీసుకెళతామని హెచ్చరించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తెదేపాపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని పింఛనుదార్లకు విజ్ఞప్తి చేశారు.

అధికారం కోసం దొడ్డిదార్లు తొక్కుతున్న జగన్‌: వర్ల రామయ్య

‘ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే ముఖ్యమంత్రి జగన్‌ అడ్డదార్లు తొక్కుతున్నారు. తెదేపా, చంద్రబాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. వృద్ధులకు ఇచ్చే పింఛన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధం? ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆయన కింద పని చేస్తున్నారా? అవ్వా తాతలకు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లోనూ పెడుతున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారు? పింఛన్ల పంపిణీ ఆగిపోతే చంద్రబాబే బాధ్యుడని సీఎం జగన్‌ ఇప్పటికీ అంటున్నారు. ఏ ఒక్క అవ్వా తాతకు ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తెదేపా అధికారంలోకి రాగానే పింఛన్లు రూ.4 వేలకు పెంచి నేరుగా అవ్వాతాతల ఇంటికే వెళ్లి ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. కమీషన్ల కోసం సీఎం తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు, మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి బిల్లులు ఇవ్వడం కాదు.. అవ్వాతాతల డబ్బులు వారికే ఇవ్వాలి.

వైకాపా తీరు అత్యంత దుర్మార్గం

పింఛన్ల పంపిణీని కూడా జగన్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి నెట్టెం రఘురాం విమర్శించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని సెర్ప్‌ సీఈవో ఆదేశాలివ్వడం బుద్ధిలేనితనమన్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


రాజకీయ లబ్ధి కోసమే జగన్‌ కుట్రలు

నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి

గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఆ హత్యను చంద్రబాబుకు ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్‌మోహన్‌రెడ్డి ..ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పింఛన్లు తీసుకునే పేదవారి పింఛన్లు ఆపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. సోమవారం బ్యాంకులకు సెలవు.. 3 నుంచి పింఛన్లు ఇస్తున్నట్లు మీ ‘సాక్షి’ పేపర్లో రాయించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అలా చెప్పడానికి జగన్‌కేం అధికారం ఉంది? లక్షల మంది సచివాలయ ఉద్యోగులు 2-3 గంటల్లో మొత్తం పింఛన్లు పంపిణీ చేయగలరు. పది రోజుల సమయం పడుతుందనడం సరికాదు. బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేయిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. ఆయన మాట నిలబెట్టుకోకపోతే ప్రభుత్వ గిమ్మిక్కులు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని