సీనియార్టీ ఉందని నర్సును సర్జన్‌ చేస్తారా?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి (లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు-పీడీ) ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే జీవో 76 విషయంలో వివరణ ఇచ్చేందుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.

Updated : 02 Apr 2024 06:52 IST

సానుభూతి, సమన్యాయం పేరుతో విద్యాసంస్థల్లో పదోన్నతులు సరికాదు
ప్రభుత్వ నిర్ణయంతో ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు
బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాళ్లుగా నియమించడంపై లోతుగా పరిశీలించాలి
ప్రవీణ్‌ప్రకాశ్‌ సమాధానాలపై హైకోర్టు అసంతృప్తి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి (లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు-పీడీ) ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే జీవో 76 విషయంలో వివరణ ఇచ్చేందుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. సానుభూతి, సమన్యాయం పేరుచెప్పి విద్యా సంస్థల్లో పదోన్నతులు ఇవ్వడం సరికాదని తేల్చిచెప్పింది. లైబ్రేరియన్లకు పుస్తకం కవర్‌ పేజీపై ఏముందో తెలుస్తుందికాని.. లోపల ఉన్న విషయంపై ఏమి అవగాహన ఉంటుందని ప్రశ్నించింది.

పాఠ్యాంశాలపై లైబ్రేరియన్లు, పీడీలకు అవగాహన ఉండదని, వారు ప్రిన్సిపాళ్లుగా నియమితులయితే.. విద్యార్థులకు అర్థమయ్యేలా అధ్యాపకులు చెబుతున్నారా? లేదా? అనే విషయాన్ని ఏవిధంగా అంచనా వేయగలరని ప్రశ్నించింది. సీనియార్టీ ఉందన్న కారణంతో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌కు సర్జన్‌గా పదోన్నతి కల్పించలేరు కదా? అని వ్యాఖ్యానించింది. ఐఐటీలు, ఐఏఎంలు, వైద్య కళాశాలలకు లైబ్రేరియన్లు, పీడీలు నేతృత్వం వహించిన సందర్భాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. జీవో 76 విషయంలో లోతుగా పరిశీలన చేయాలని ప్రవీణ్‌ప్రకాశ్‌కు సూచించింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు.. ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ ఏడాది మార్చి 15న ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం జూనియర్‌ లెక్చరర్స్‌(లైబ్రరీ సైన్స్‌) అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరికొందరు సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ప్రిన్సిపల్‌ పోస్టుల పదోన్నతిలో జూనియర్‌ లెక్చరర్లు(లైబ్రరీ సైన్స్‌) చేసిన వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం జారీచేసిన జీవో 76కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేశారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్యామ్‌కుమార్‌ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. జీవో 76 విషయంలో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు.

పరిపాలన వ్యవహారాల కోసం అయితే ఎంబీఏ వాళ్లు చాలు కదా

ప్రిన్సిపల్‌ ఆయా విద్యా సంస్థ పరిపాలన వ్యవహారాలు చూస్తారని, జీవో 76 సరైనదేనని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ కోర్టుకు తెలిపారు. గతంలో జరిపిన నియామకాల గురించి వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. కేవలం పరిపాలన వ్యవహారాల కోసమే అయితే ఎంబీఏ డిగ్రీ పొందిన వారిని ప్రిన్సిపాళ్లుగా నియమించొచ్చని వ్యాఖ్యానించింది. ముఖ్యకార్యదర్శి బదులిస్తూ 21వ శతాబ్దంలో ఉన్నామని, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని అన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. అలా అయితే టీచర్లందరిని డిస్‌మిస్‌ చేసి ఏఐ(కృత్రిమ మేథ)ను వినియోగించొచ్చుకదా అని వ్యాఖ్యానించింది. మన విద్యా బోధన సంప్రదాయ పద్ధతిలో జరుగుతోందని గుర్తుచేసింది. అనంతరం ప్రవీణ్‌ప్రకాశ్‌ తన వాదనలు కొనసాగిస్తూ.. ‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లను వర్సిటీలలో ఉపకులపతులు(వీసీ)గా నియమిస్తున్నారు. వారికి ఆయా బోధనాంశాలపై అవగాహన ఉండదు.

ఏదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులైన వారిని జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్‌గా నియమిస్తున్నారు. ఈ విధానం డిగ్రీ కళాశాలల్లో కొనసాగుతోంది. దానిని జూనియర్‌ కళాశాలలకు వర్తింపచేస్తున్నాం. ప్రిన్సిపాళ్లుగా నియమితులైన పీడీ, లైబ్రేరియన్లకు శిక్షణ ఇస్తున్నాం’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒక వ్యక్తికి సమన్యాయం చేస్తున్నామన్న పేరుతో వేలమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఈ వ్యవహారంపైనే తమ ఆందోళన అంతా అని వ్యాఖ్యానించింది. బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాళ్లుగా నియమిస్తే విద్యా ప్రమాణాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. దీంతో  లైబ్రేరియన్లు, పీడీలకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే విషయంలో లోతుగా పరిశీలిస్తామని ప్రవీణ్‌ ప్రకాశ్‌ కోర్టుకు నివేదించారు. సంబంధిత అధికారులతో చర్చించేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు