వడ్డీ లేదని బాకా.. గెలిచాక ధోకా!

ముస్లిం సోదరుల్లారా మీకేం కావాలో చెప్పండి... ఎంత మొత్తంలో కావాలో చెప్పండి... మీ కోసం ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు పెడతా... మీరడిగిన దానికంటే ఎక్కువే ఇస్తా... వడ్డీ లేకుండానే అప్పులిప్పిస్తా... అయితే, ఒకే ఒక్క షరతు... నన్ను ఒక్కసారి ఎన్నుకోండి...

Updated : 02 Apr 2024 06:13 IST

మాయమాటలతో మైనారిటీలకు జగన్‌ దగా
ఇస్లాం బ్యాంకుపై దారుణంగా మోసం
మసీదులన్నింటికీ గౌరవ వేతనంపై కల్లబొల్లి కబుర్లు
ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నాలుక మడత
తెదేపా ప్రభుత్వమిచ్చిన రాయితీ రుణాలకూ పాతర
ఈనాడు, అమరావతి

ముస్లిం సోదరుల్లారా మీకేం కావాలో చెప్పండి... ఎంత మొత్తంలో కావాలో చెప్పండి... మీ కోసం ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు పెడతా... మీరడిగిన దానికంటే ఎక్కువే ఇస్తా... వడ్డీ లేకుండానే అప్పులిప్పిస్తా... అయితే, ఒకే ఒక్క షరతు... నన్ను ఒక్కసారి ఎన్నుకోండి... ఇలా... అన్నదెవరో తెలుస్తోంది కదా?  అవును... ఆయనే జగనన్న..!!  పీఠమెక్కాక అన్నీ మరచిపోయారు!

‘‘ఏదైతే చేయగలుగుతానో... అది వేరే వాళ్లెవరూ చేయని విధంగా నాలుగు అడుగులు ముందుకేసి మరీ చేస్తా. కానీ మోసం చేయడం, అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు. చేయగలిగిందే చెబుతా. చెప్పింది మాత్రం కచ్చితంగా చేసి చూపిస్తా...’’ ఇలాంటి మాటలు చెప్పడంలో జగన్‌ తర్వాతే ఎవరైనా. ప్రజల్ని ఆయన సులభంగా నమ్మించగలరు. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా    ఎంతకైనా దిగజారుతారు. ఇదే కోవలో 2019 ఎన్నికల ముందు ముస్లింలపై అన్ని అస్త్రాలనూ ప్రయోగించారు. అధికారంలోకి రాగానే చాకచక్యంగా నాలుక మడతేశారు. ప్రతిపక్ష నేతగా ఇస్లాం బ్యాంకుపై ఆయన చెప్పిన మాటలు విని... తమని పేదరికం నుంచి బయటపడేసేందుకు జగన్‌ తోడ్పాటు అందిస్తారని ముస్లింలు కలలుగన్నారు. అదే ఆశతో ఐదేళ్లపాటు ఎదురుచూశారు. ఏటా వచ్చిన బడ్జెట్‌లు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఒక్కరికంటే ఒక్కరికీ వడ్డీ లేకుండా రుణాలిచ్చిన పాపాన పోలేదు. ఒక్క కుటుంబాన్నీ ఆదుకోలేదు. ఈ మోసం కళ్లదుటే కనిపిస్తున్నా... మళ్లీ నాలుగు సినిమా డైలాగులు రాసుకుని ఎన్నికల వేళ ప్రజల ముందుకు వస్తున్నారు. చేసిన నమ్మకద్రోహం చిట్టా చాంతాడంత ఉన్నా ‘చెప్పాడంటే... చేస్తాడంతే’ అంటూ అదే పాత పాటను మళ్లీ వాయించేందుకు ‘సిద్ధ’మవుతున్నారు.

ఇదీ వైకాపా ఘనకార్యం... 

అధికారం చేపట్టిన తొలి ఏడాది(2019-20) జగన్‌ మైనారిటీల స్వయం ఉపాధి రుణాల కోసమని రాష్ట్ర బడ్జెట్‌లో రూ.84.84 కోట్లను కేటాయించారు. ఎలా అమలు చేయాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత వీరికి రుణాలు ఎందుకివ్వాలని అనుకున్నారో... ఏమోగానీ మొత్తం పక్కన పెట్టారు. ఆ ఏడాది కేటాయించిన రూ.84.84 కోట్లను ఇతర పథకాలకు మళ్లించేశారు. ముస్లిం మైనారిటీలపై జగన్‌ ఎంత కర్కశంగా వ్యవహరించారో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా?

రాయితీ రుణాలకూ పాతర

వైకాపా ఆవిర్భావం నుంచి ముస్లింలలో మెజారిటీ ఓటర్లు జగన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కానీ, వారిపై  కృతజ్ఞత అనేదే లేకుండా జగన్‌ వ్యవహరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజిత రాష్ట్రంలో 43.46 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు. వారిలో ముస్లింలు 36.18 లక్షలు. వీరిలో అత్యధికులకు చిరు వ్యాపారాలు, చిన్నచిన్న పనులే జీవనాధారం. ఇలాంటి వారికి స్వయం ఉపాధి రాయితీ రుణాలు పెట్టనికోట వంటివి. జీవితంలో నిలదొక్కుకోడానికి, కుటుంబాన్ని పోషించుకోడానికి అవి దన్నుగా నిలుస్తాయి. కొన్ని దశాబ్దాల నుంచి వడ్డీలేని ఈ రుణాలను పొంది పేదరికం నుంచి బయట పడిన ముస్లిం కుటుంబాలెన్నో ఉన్నాయి. బహుశా ముస్లింలు అభివృద్ధి చెందితే తన మాయమాటలు నమ్మబోరనే భయం జగన్‌కు ఉండొచ్చు.అందుకే వడ్డీలేని రుణాలిస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన వ్యక్తే... చివరికి రాయితీ రుణాలకూ పాతరేశారు.

తెదేపా హయాంలో 45,244 మందికి రూ.248 కోట్ల రుణాలు

ముస్లింల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇతర వర్గాలకు అందే బోధనా రుసుంలు, పింఛన్లు, ఉపకార వేతనాలు, విదేశీవిద్య, పెళ్లికానుక పథకాలతోపాటు వారి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంది. 2014-19 మధ్య స్వయం ఉపాధికి 50% రాయితీతో రుణాలిచ్చింది. సాధారణ వృత్తులు చేసుకునేందుకు రూ.2.50 లక్షలు, ఆటో, ట్యాక్సీ కారు తదితర రవాణా వాహనాల కొనుగోలుకు రూ.3 లక్షలను రుణంగా అందించింది. ఈ పథకానికి 2014-15 నుంచి 2018-19 వరకు ఏటా బడ్జెట్‌ కేటాయింపులు పెంచింది. 2014-15లో రూ.20 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ 2018-19 నాటికి రూ.126 కోట్లకు చేరింది. ఐదేళ్లలో ఏకంగా 45,244 మందికి రాయితీ రుణాలిచ్చింది. ఇందుకోసం రూ.248 కోట్లు ఖర్చు చేసింది. ఈ సాయం ఇతర పథకాల ద్వారా అందే లబ్ధికి అదనం. అదే తెదేపా ప్రభుత్వం 2019-24 మధ్య కొనసాగి ఉంటే ఎక్కువ మంది ముస్లింలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు అందేవి. అంటే వారంతా పేదరికం నుంచి బయటపడేవారు. పోనీ, తెదేపా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ఏమైనా అమలు చేశారా? అంటే అదీ లేదు. రాయితీ రుణాలకు మించి వడ్డీ లేని రుణాలిస్తామని మాయమాటలు చెప్పారు. గెలిచాక ఆ హామీని అమలు చేయకుండా దగా చేశారు. రాష్ట్రంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వేల మంది ముస్లింలు ప్రైవేటుగా వ్యాపారుల నుంచి రూ.5 వడ్డీతో రుణాలు తెచ్చుకుని అప్పులపాలై అల్లాడుతున్నారు.

ఇమామ్‌లు, మౌజమ్‌లకు వెన్నుపోటే...

మసీదుల్లో ఉండే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయాన్ని అందించాలని మొదట నిర్ణయించింది తెదేపా ప్రభుత్వమే. రాష్ట్ర విభజన తర్వాత అప్పట్లో ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా రాష్ట్రవ్యాప్తంగా 5,000 మసీదుల్లోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు సాయం అందించే పథకాన్ని వర్తింపచేసింది. ప్రతినెలా ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.3 వేల చొప్పున అందించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో 2017 డిసెంబరు 11న నిర్వహించిన పాదయాత్రలో జగన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మసీదులకు పథకాన్ని విస్తరిస్తామని, గౌరవ వేతనాన్ని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల మసీదులుంటే తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఐదు వేల మసీదులకే వర్తింపజేశారు. ఆదాయంలేని మరో రెండు వేల మసీదుల్లోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవవేతనాన్ని అమలు చేయాలని అధికారులు ఏడాదిన్నర క్రితమే నివేదించినా పట్టించుకోలేదు. కనీసం, గౌరవ వేతనాన్ని సక్రమంగా అందిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ మూడు, నాలుగు నెలలు పెండింగే. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 6 నెలల వేతనాలను వారికి ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని