జగనన్న ‘గూడు’పుఠాణీ

జగనన్న కాలనీలన్నారు... వాటిల్లో పేదలకు స్థలాలన్నారు... కట్టుకునేందుకు సాయమూ చేస్తామన్నారు... దీనికోసం బడుగులు, రైతుల భూములను సేకరించారు.. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడిచింది.. భూములిచ్చిన వైకాపా నేతలకేమో సొమ్ము చెల్లించేశారు..

Updated : 02 Apr 2024 06:12 IST

ప్రభుత్వ ఆస్తులు అమ్మి మరీ అస్మదీయులకు చెల్లింపులు
ఇళ్ల స్థలాలకు భూములిచ్చిన రైతులకు మాత్రం మొండిచేయి
రూ.1,150 కోట్లు బకాయి పడిన జగన్‌ సర్కారు
నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిప్పించుకుంటున్న వైనం  
ఈనాడు, అమరావతి


జగనన్న కాలనీలన్నారు... వాటిల్లో పేదలకు స్థలాలన్నారు... కట్టుకునేందుకు సాయమూ చేస్తామన్నారు... దీనికోసం బడుగులు, రైతుల భూములను సేకరించారు.. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడిచింది.. భూములిచ్చిన వైకాపా నేతలకేమో సొమ్ము చెల్లించేశారు.. కానీ, పేదలకు మాత్రం బకాయి పెట్టారు.. సాగు చేసే భూములను పోగొట్టుకొని.. పరిహారమూ రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కలెక్టర్లకు, స్థానిక అధికారులకు విన్నవిస్తున్నా.. గోడు వినేవాళ్లే లేరంటూ ఘొల్లుమంటున్నారు!


పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన ఓ మహిళ పేరిట 29 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని నాలుగేళ్ల క్రితం బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్‌ కోసం అధికారులు సేకరించారు. ఆమెకు సుమారు రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉన్నా... ఇప్పటికీ మంజూరు చేయలేదు. ‘స్పందన’ కార్యక్రమంలో పలు దఫాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బిల్లు అప్‌లోడ్‌ చేసినట్లు చూపుతున్నారే తప్ప.. డబ్బులు మాత్రం జమ కావడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.


కాకినాడ గ్రామీణ మండలం పండూరులో 0.57 ఎకరాలకు సంబంధించి ముగ్గురు రైతులకు సుమారు  రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే మండలం తిమ్మాపురంలో మరో ముగ్గురు రైతులకు సంబంధించి 1.40 ఎకరాలకు దాదాపు రూ.76 లక్షలు చెల్లించాల్సి ఉంది. నేమాంలోనూ ముగ్గురు రైతులకు సంబంధించి 1.38 ఎకరాలకు రూ.48 లక్షల బకాయి ఉంది.


రాష్ట్రంలో ‘జగనన్న ఇళ్ల కాలనీ’ల పథకం ప్రహసనంగా మారింది. స్థలాల సేకరణ నుంచి లబ్ధిదారులకు అందజేత.. ఆ తర్వాత నిర్మాణం, బిల్లుల చెల్లింపు వరకూ పేద ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆయా కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరుపేద రైతులు, దళితుల నుంచి సేకరించిన భూములకు జగన్‌ సర్కారు సొమ్ములు చెల్లించడం లేదు. అలాగని ఎవరికీ ఇవ్వడం లేదా అంటే.. కాదు. వైకాపా నేతలు, అనుచరవర్గానికి, బడా గుత్తేదారులకు మాత్రం పక్కాగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ మరో 10 రోజుల్లో అమల్లోకి వస్తుందనగా.. ప్రభుత్వ ఆస్తులను అమ్మి మరీ తమకు కావాల్సిన వారికి చెల్లించడం గమనార్హం. అదే నిరుపేదల నుంచి సేకరించిన భూములకు రూ.1,150 కోట్ల మేర బకాయి పెట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.

ఆ జిల్లాలో రూ.430 కోట్లు పెండింగ్‌..

బిల్లుల చెల్లింపు పరంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా రూ.430 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ వైకాపా ఎంపీ భరత్‌ ప్రోద్బలంతో ఆయన అనుచరులకు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేందుకు వారం రోజుల ముందు కూడా అధికారులు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, రాజానగరం పరిధిలో ఎక్కువగా బడా నేతలకు బిల్లులు చెల్లించారు. ప్రకాశం జిల్లాలో ఏకంగా రూ.170 కోట్ల మేర బిల్లుల్ని వైకాపా నేతలు, అనుచరులకు ఇచ్చేశారు. ఇంకా ఈ జిల్లా పరిధిలో రూ.50 కోట్ల మేర చెల్లించాలి. చిత్తూరు జిల్లాలోనూ రూ.100 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైయస్సార్‌లో మాత్రం దాదాపు బకాయిలు లేకుండా చూసుకున్నారు. ఇక్కడ కేవలం రూ.6 కోట్ల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వీరందరూ పేదలే కావడంతో జగన్‌ సర్కారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది.

స్వగృహ భూములమ్మి మరీ.. 

వైకాపా నేతలకు బిల్లులు చెల్లించేందుకు జగన్‌ ఏకంగా ప్రభుత్వ ఆస్తుల్నే అమ్మేశారు. విశాఖలోని ఎండాడ పరిధిలో ఉన్న స్వగృహ భూముల్ని విక్రయించి రూ.35 కోట్ల బకాయిలు సర్దుబాటు చేశారు. ఈ మొత్తాన్ని వైకాపా ఎంపీ భరత్‌ సూచించిన వారితోపాటు ప్రకాశం జిల్లాలో కొంతమంది వైకాపా నేతలకు సంబంధించిన చెల్లింపులకు వినియోగించారు.

పరిహారం అడిగిన రైతులపై దాడి

జగన్‌ ఏలుబడిలో వైకాపా నేతలు చెప్పిందే వేదం. ఎదురు  తిరిగితే దాడి చేయడమే వారి నైజం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోనూ ఇదే జరిగింది. బొడ్డపాడు రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 76లోని డీ-పట్టా భూమిని సుమారు 40 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అక్కడ బొడ్డపాడు, మామిడిపల్లి గ్రామాలకు చెందిన 36 మందికి 2020లో జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు కేటాయించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నెలల తరబడి పోరాడిన అన్నదాతలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. న్యాయస్థానాలంటే వైకాపా నేతలకు లెక్కే ఉండదు కదా? అందుకే స్థానిక వైకాపా నేతలు కొందరు అనుచరుల సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడికి తెగబడ్డారు. చివరకు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.

దళితుల భూమి అయితే.. లాక్కోవడమే..

దళితుల భూమి కనిపిస్తే చాలు.. జగన్‌కు పండగే. ఏళ్లుగా వారు సాగు చేసుకుంటున్నా సరే.. ఏదో ఒక సాకు చూపించి బలవంతంగా లాగేసుకోవడం ఆయనకో సరదా. జగనన్న కాలనీల్లో భూ సేకరణలో ఎక్కువగా నష్టపోయింది దళితులే. తోట్లవల్లూరులో 21 మంది రైతులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 9.47    ఎకరాల భూమిపై వైకాపా నేతల కన్నుపడింది. ఇంకేముంది.. ఇళ్ల స్థలాల పంపిణీ కోసమంటూ అధికారులు వారి వద్ద నుంచి బలవంతంగా భూములను సేకరించారు. అప్పటికే సాగులో ఉన్న పంటను దున్నించి మరీ స్వాధీనం చేసుకున్నారు. స్థలాన్ని చదును చేసి 430 ప్లాట్లుగా మార్చారు. దాంతో మరో మార్గం లేక దళితులు కోర్టును ఆశ్రయించగా.. స్టే వచ్చింది. ఆ తర్వాత అప్పటికే అక్కడ గుర్తించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మరో దగ్గర 10 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించినా.. జగన్‌ దాన్ని అటకెక్కించారు.


భారీగా వెనకేసుకున్నారు..

రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించినట్టు వైకాపా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో జగనన్న కాలనీల కోసం రూ.11 వేల కోట్లు వెచ్చించి ప్రైవేటు స్థలాలను సర్కారు కొనుగోలు చేసింది. ఇందులోనూ వైకాపా నేతల చేతివాటం చూపించారు. కాలనీల ఏర్పాటుపై సమాచారమున్న కొందరు అధికార పార్టీ నేతలు.. వారి భూములకు సమీపంలోనే అవి వచ్చేలా మంత్రాంగం నడిపారు. మరికొందరు మాత్రం కాలనీలు రాబోయే చోట భూములున్న పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వానికి ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎకరం రూ.10 లక్షలు కూడా చేయని భూముల్ని.. రూ.40 లక్షలకు సర్కారుకు కట్టబెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మొత్తంగా భూముల సేకరణలో రూ.వందల కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు.. ఇళ్ల స్థలాల చదును పేరుతోనూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.


రైతుల్ని రెచ్చగొట్టి.. నిలువునా ముంచి..

వైకాపా నేతలు ఓట్ల కోసం ఎన్ని కుయుక్తులైనా పన్నుతారనేందుకు ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో ఇళ్ల స్థలాల కేటాయింపే నిదర్శనం. ఇక్కడ తెదేపా హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసమని 90 మంది నుంచి 210 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.5 లక్షల పరిహారం, ప్రతి పాసుపుస్తకానికి రూ.5 లక్షలతోపాటు   లేఅవుట్‌లో ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వైకాపా నేత ఒకరు.. రూ.20 లక్షల పరిహారమివ్వాలని అప్పట్లో రైతులను రెచ్చగొట్టారు. దీంతో 52 మంది తెదేపా ప్రభుత్వమిచ్చిన పరిహారం తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చింది. మరి ఆ నేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులతో డిమాండ్‌ చేయించిన విధంగా రూ.20 లక్షలు ఇవ్వాలి కదా? కానీ, అదే నోటితో ఎకరాకు రూ.5 లక్షలకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. పైగా లేఅవుట్‌లో స్థలాలు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? ఇటీవల న్యాయస్థానం స్టే ఎత్తేయడంతో ఆ భూముల్లోనే జగనన్న కాలనీ ఏర్పాటుకు నిర్ణయించి, తెదేపా ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తవారికి కేటాయించారు. రైతులకు పైసా పరిహారం చెల్లించకుండానే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని