అస్సాం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి

అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

Updated : 02 Apr 2024 22:09 IST

ఈనాడు, దిల్లీ- సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ పదవీ విరమణ చేయడంతో రవి ఆ బాధ్యతలు చేపట్టారు. అస్సాం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్‌ ఈయనే. రవి సీఎస్‌ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. 1966 ఏప్రిల్‌ 12న జన్మించిన రవి.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ఆగ్రాణమిలో పీహెచ్‌డీ చేసి బంగారు పతకం అందుకున్నారు. 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగాధిపతిగా పనిచేసి భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు, వాతావరణ భాగస్వామ్యంపై విస్తృతంగా దృష్టి సారించారు. పబ్లిక్‌ఫైనాన్స్‌, మాక్రో ఎకనామిక్స్‌ విధానాల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. 15వ ఆర్థిక సంఘానికి సంయుక్త కార్యదర్శిగా పనిచేసినప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి కమిషన్‌కు ఆయన లోతైన సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని