ముఖ్యమంత్రీ మౌనమేలనోయి..

పరదాల మాటున పర్యటనలు చేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్‌.. అయిదేళ్ల తర్వాత ఓట్ల కోసం బస్సుయాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారు.

Updated : 02 Apr 2024 06:42 IST

ఉమ్మడి అనంతపురంలో రెండ్రోజులపాటు జగన్‌ బస్సుయాత్ర
ఒక్క మాటా మాట్లాడలేదని వైకాపాలోనూ అసంతృప్తి
అయిదేళ్లలో కరవు జిల్లాకు చేసిందేమీ లేకపోవడంతోనేనా?

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: పరదాల మాటున పర్యటనలు చేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్‌.. అయిదేళ్ల తర్వాత ఓట్ల కోసం బస్సుయాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారు. బస్సుయాత్రలోనూ ఐప్యాక్‌ ఏర్పాటు చేసిన మనుషులతో తప్ప ఇంకెవరితోనూ ఆయన మాట్లాడటం లేదు. ఏసీ బస్సులో కూర్చుని కనబడిన జనాలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎక్కడైనా వైకాపా శ్రేణులు మరీ బలవంత పెడితే తప్ప బస్సు దిగలేదు.  కరవు జిల్లా అనంతపురానికి అయిదేళ్లలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని దుస్థితిలో తమ అధినేత ఉన్నారంటూ పెదవి విరుస్తున్నారు. కనీసం మళ్లీ గెలిపిస్తే జిల్లాకు ఏం చేస్తారనేదైనా చెప్పాలి కదా అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అభివాదాలతోనే సరి..

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర మార్చి 30వ తేదీ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఆరోజు సాయంత్రం జిల్లాలో ప్రధాన పట్టణమైన గుత్తి మీదుగా సాగింది. ఆయన ఏం మాట్లాడకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశతో వెనుదిరిగాయి. పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా రాత్రి 10 గంటలకు అనంతపురం చేరుకున్నారు.కేవలం అభివాదాలతో సరిపెడుతూ ముందుకుసాగారు. రాత్రి 11.30కు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకున్నారు. 31వ తేదీ ఈస్టర్‌ సందర్భంగా యాత్రకు విరామం ఇచ్చారు. ఆ రోజంతా జగన్‌ విడిది కేంద్రంలోనే ఉన్నా ఏ ఒక్కరినీ కలవలేదు. భద్రతా సిబ్బంది సామాన్యులను అటువైపునకు కూడా రానివ్వలేదు. సోమవారం ఉదయం బస్సుయాత్ర మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో 180 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర కొనసాగినా.. సీˆఎం జగన్‌ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

గత హామీలపై నోరెత్తలేకనే..?

2019 ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లాకు వందల హామీలు గుప్పించారు. అయిదేళ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అధికారంలోకి వస్తే రెండేళ్లలో హంద్రీనీవా పూర్తిచేస్తామని.. జీడిపల్లి-పేరూరు, జీడిపల్లి-బైరవానితిప్ప ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తానంటూ హామీ ఇచ్చారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని ప్రగల్భాలు పలికారు. పట్టు రైతులకు ప్రోత్సాహకాలు పెంచుతామని, వేరుశనగకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని రైతుల్ని నమ్మించారు. జగన్‌ను నమ్మిన అనంతవాసులు 12 స్థానాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించారు. అధికారంలోకి వచ్చాక హామీల అమలుకు ఏనాడూ కృషి చేయలేదు. దీంతోపాటు సీˆఎం హోదాలో అనంతపురం జిల్లాలో 7 సార్లు పర్యటించిన జగన్‌ ఆయా నియోజకవర్గాలకు పలు హామీలు గుప్పించారు. అవి కూడా అమలుకు నోచుకోలేదు. వీటిపై జిల్లావాసులు నిలదీస్తారనే భయంతోనే సీˆఎం జగన్‌ బస్సుయాత్రలో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని