పింఛనుదారులపై పగ! వైకాపాకు వంతపాడే కుట్ర

కుట్ర.. కుట్ర.. అదే కుట్ర.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా చేసిన కుట్ర.

Updated : 03 Apr 2024 10:33 IST

సీఎస్‌ జవహర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డిల సహకారం
శశిభూషణ్‌ కుమార్‌కూ భాగస్వామ్యం
86.33 శాతం మందికి గ్రామ/వార్డు సచివాలయాల వద్దనే పంపిణీకి నిర్ణయం
దీన్ని సమర్థించుకునేందుకు వింత సాకులు

ఈనాడు, అమరావతి: కుట్ర.. కుట్ర.. అదే కుట్ర.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా చేసిన కుట్ర. ఈ పరిస్థితికి కారణం తెదేపానే అని విషం చిమ్మే కుట్ర. ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్‌ 1గా వెలిగే ధనుంజయరెడ్డి కనుసన్నల్లో సాగుతున్న కుట్ర. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు కట్టకట్టుకుని చెప్పినా జగన్‌ కేసులో సహనిందితుడైన సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా వంతపాడారు. వైకాపాకు ఆయన అంటకాగుతున్నారనే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది.

సచివాలయాల వద్ద పంపిణీ చేస్తే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛనుదారులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావని తెలిసీ.. ప్రభుత్వ పాలనాధిపతిగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించాల్సిన ఆయన వైకాపా కుట్రకు వత్తాసు పలికారు. అంతా కలిసి పింఛనుదారులను ఇక్కట్లపాలు చేసే నిర్ణయానికే మొగ్గుచూపారు. వైకాపా పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ దివ్యాంగులు,  అనారోగ్యంతో ఉన్నవారు, వీల్‌ఛైర్‌లో ఉన్న వారు మినహా మిగతా పింఛనుదారులందరూ సచివాలయాల వద్దకే వచ్చి పింఛను తీసుకోవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర 86.33 శాతం మంది పింఛనుదారులను ఇళ్ల నుంచి బయటికి రప్పించి సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని నిర్ణయించారు. వాలంటీర్లు లేనప్పుడు గత ప్రభుత్వాలు పింఛన్లు పంపిణీ చేయలేదా? సంక్షేమ పథకాల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నప్పుడు పింఛన్లను ఎందుకు అలా చేయలేరన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కోసం పాపం పింఛనుదారులపై పగబట్టడమేంటి?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శేనా?

సీఎస్‌ జవహర్‌రెడ్డి పాలనా విభాగాధిపతి. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నా.. కీలక నిర్ణయాలు ఆయనే తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందుల ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు.. వారికి సానుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చేటప్పుడు అదే నేర్పిస్తారు. ఆనాడు నేర్చిన పాఠాలు మరిచిపోయి.. వైకాపా పాఠాలే ఒంటబట్టినట్లు జవహర్‌రెడ్డి వాటినే అమలు చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయం చేయకుండా వింత వాదనలను తెరమీదకు తెచ్చారు. ఇవి చూస్తే పింఛనుదారుల ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేయాలనే ఆలోచన కంటే.. వారిని సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలనే విధంగానే కసరత్తు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆదేశాలను చూస్తే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. జవహర్‌రెడ్డి మాత్రం వైకాపా కోడ్‌లోనే తరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

24 గంటలు కసరత్తు చేసి ఇచ్చే ఆదేశాలివా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి, 24 గంటలు కసరత్తు చేసి ఇచ్చే ఆదేశాలివా? మొత్తం పింఛనుదారులు 65.92 లక్షల మంది ఉంటే.. వారిలో ఇంటి వద్దకే పంపిణీ చేసే పింఛనుదారుల సంఖ్య 8.60 లక్షలే. అంటే మొత్తం పింఛనుదారుల్లో ఇది 13.05 శాతమే. ఇక సచివాలయాల దగ్గరకే రప్పించే పింఛనుదారుల సంఖ్య చూస్తే నివ్వెరపోవాల్సిందే. 56.91 లక్షలమందిని ఇళ్ల నుంచి పింఛను తీసుకునేందుకు బయటికి రప్పిస్తున్నారు. వీరి సంఖ్య మొత్తం పింఛన్లలో 86.33 శాతం. ఇంతమందిని సచివాలయాల దగ్గరకు రప్పించడమంటే.. దీనికి తెదేపానే కారణమని చూపించేందుకు వైకాపా అమలు చేస్తున్న కుట్రకు సహకరించడం కాక మరేంటి?

కలెక్టర్లు సరేనన్నా వీరెందుకు కాదన్నారు?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై తీవ్ర చర్చే నడిచింది. పింఛనుదారులను సచివాలయాలకు రప్పించడమంటే వారిని ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు కలెక్టర్లు చెప్పారు. వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మే నెలలో కూడా ఇస్తున్నందున.. పంపిణీకి వీలుగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లను సచివాలయ ఉద్యోగులకు చూపించేందుకు మాత్రమే పరిమితం చేసి వారి సేవలను వినియోగించుకోవచ్చనే సూచనను పలువురు చేశారు. ఇలా కలెక్టర్లు చెప్పిన అంశాలన్నింటినీ కాదనేలా...అదే సమావేశంలో గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్ద పంపిణీ సాధ్యపడదని మురళీధరరెడ్డి తేల్చిచెప్పారు. అక్కడ ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతోనే మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయంటే ఆయన ఎంతగా వైకాపాకు వంతపాడుతున్నారో.. ఇట్టే తెలిసిపోతుంది.

వృద్ధులను ప్రమాదంలో నెట్టేందుకే ఈ నిర్ణయం

రాష్ట్రంలో 65.92 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో అత్యధికంగా 34.18 లక్షలమంది వృద్ధులున్నారు. పింఛనుదారుల్లో దాదాపుగా సగం వారే. ఎండలు ఎంతగా మండిపోతున్నాయో. ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి, ఆదేశాలిచ్చిన శశిభూషణ్‌కుమార్‌కు, దీని వెనుక కుతంత్రాన్ని నడిపిన మురళీధరరెడ్డికి తెలియదా? 42 డిగ్రీలకు చేరి ఎండలు ఠారెత్తిస్తుంటే వృద్ధులు ఇళ్లు దాటి బయటకు రాగలరా? సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండగలరా? అయినా అలా రప్పించేందుకే నిర్ణయం తీసుకున్నారంటే వారిని ప్రమాదంలోకి నెట్టడమే. అన్ని తెలిసీ ఇలాంటి ఆదేశాలిచ్చారంటే.. వైకాపాకు, జగన్‌కు ఎంతగా భజన చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.

ఇది కదా అసలు సిసలు కుట్ర అంటే...

తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని అధికారుల చూపించిన వారి సంఖ్య నామమాత్రమే. ఎలా ఆదేశాలిస్తే వైకాపాకు మేలు జరుగుతుందో అన్ని లెక్కలు వేసుకునే పక్కాగా జారీ చేశారు. మొత్తంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వీల్‌చైర్‌లో ఉన్న వారు, సైనిక పింఛన్లు పొందుతున్న వారు.... అంతా కలిపినా 8.61 లక్షల మంది పింఛనుదారులే.. అయినా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి ఇళ్ల దగ్గరే ఇస్తామని చెప్పడం అదేమన్నా ప్రత్యేక వెసులుబాటా?. ఇలాంటి వారికి ఏళ్లుగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సైనిక పింఛన్లు తీసుకున్నంటున్నదీ 421 మందే. ఈ కేటగిరీలోనూ వృద్ధులకే ఇళ్ల వద్ద ఇస్తారట. వీటిని చూస్తే ఎంత దుర్మార్గంగా ఆదేశాలిచ్చారో....దీని వెనుక ఎన్ని కుయుక్తులు పన్నారో అవగతమవుతుంది. ఇక గిరిజనుల పట్ల మరింత కర్కశంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి గ్రామ,వార్డు సచివాలయాలకు రావాలంటే కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాలి. వీరికి కూడా ఇళ్ల వద్ద పంపిణీ చేసేందుకు అనుమతివ్వలేదు. వారికి సమీపంలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసి అక్కడికి రప్పించి అందించాలని ఆదేశాలిచ్చారు. ఎంపిక బాధ్యతను కలెక్టర్లపై నెట్టేశారు.


తయారైన ఆదేశాలనూ మార్పించారు!

పింఛన్ల పంపిణీపై సోమవారం సీఎస్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది. అందులో అత్యధిక శాతం కలెక్టర్లు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయొచ్చని స్పష్టంగా చెప్పారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కూడా తెలిపారు. పట్టణాల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తె అవకాశమున్నా అధిగమించవచ్చని సూచించారు. ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు మాత్రమే కొన్ని సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలోనూ మురళీధరరెడ్డి.....వైకాపా అమలు చేయాలనుకున్న కుట్రకు అనుకూల వాదనే వినిపించారు. మొత్తానికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే నిర్ణయాన్ని కలెక్టర్లకే వదిలిపెడుతూ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని సెర్ప్‌, గ్రామ/వార్డు సచివాలయశాఖలను సీఎస్‌ ఆదేశించారు.. ఆ మేరకు సోమవారం సాయంత్రానికే ఆదేశాలు సిద్ధం చేశారు కూడా. కానీ అవి విడుదల కాకుండా తొక్కిపెట్టారు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో మురళీధరరెడ్డి చక్రం తిప్పినట్టు తెలిసింది.


వైకాపాకు అనుకూలంగా ఆదేశాలకు కసరత్తు

పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందించాలనే విధంగా సోమవారం తయారు చేసిన ఆదేశాలను తిరిగి సవరించి వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర కసరత్తు జరిగింది. ఇందులో మురళీధరరెడ్డితోపాటు.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కూడా భాగస్వాములయ్యారు. ఆయనే సెర్ప్‌ కార్యాలయానికి వచ్చి మురళీధరరెడ్డితో భేటీ అయ్యారు. మురళీధరరెడ్డి రాజసం ఎలా ఉందో, ఆయన ఎంత ప్రభావితం చేస్తున్నారో ఇక్కడే తెలిసిపోతుంది. చివరకు తీవ్ర మధనం చేసి కలెక్టర్లు ఇచ్చిన సూచనలన్నీ పక్కనపెట్టి.. వైకాపాకు మేలు జరిగేలా ఉత్తర్వులిచ్చారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని