‘జే’ బ్రాండ్‌ మద్యంలో విష రసాయనాలు

‘రాష్ట్రంలో వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్ల నమూనాలు చెన్నైలోని ఓ ల్యాబ్‌లో పరీక్షిస్తే అందులో విష రసాయనాలు ఉన్నట్లు తేలింది.

Updated : 03 Apr 2024 05:18 IST

రాష్ట్రంలో ‘దిల్లీ మద్యం విధానం’ కంటే పెద్ద కుంభకోణం
ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు అక్కినేని వనజ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రాష్ట్రంలో వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్ల నమూనాలు చెన్నైలోని ఓ ల్యాబ్‌లో పరీక్షిస్తే అందులో విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇంత ప్రమాదకర ‘జే’ బ్రాండ్లను సీఎం జగన్‌ ప్రజల మీదకు వదిలారు’ అని ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు అక్కినేని వనజ ఆరోపించారు. ఈ మద్యం వల్ల ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘దిల్లీ మద్యం విధానం’ కంటే భారీ స్థాయి కుంభకోణం రాష్ట్రంలో జరుగుతున్నా కేంద్రం ఎందుకు రుజువు చేయలేకపోతోందని ప్రశ్నించారు. విజయవాడలో మంగళవారం సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ‘స్వేచ్ఛాయుత ఎన్నికలు-మద్యం ప్రభావం, నియంత్రణ- మన ముందున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆమె ప్రసంగించారు. యువత మద్యానికి బానిసవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనజ తెలిపారు. సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మద్యానికే సుమారు నాలుగో వంతు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మద్యం నియంత్రణకు సీఎం జగన్‌ ఒక్క సమీక్షా నిర్వహించలేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ‘మద్యం నియంత్రణ’ అంశాన్ని ప్రాధాన్యంగా చేర్చాలి’ అని కోరారు. కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ.. ‘జగన్‌ అధికారంలోకి వచ్చాక ధరలు పెంచితే మద్యం తాగరని చెప్పి ప్రభుత్వ ఖజానాను నింపుకొన్నారు. కల్తీ మద్యంతో యువత, కార్మికుల జీవితాలతో ఆడుకున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘మద్య నిషేధం కన్నా నియంత్రణ ఆచరణ సాధ్యం. కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలి’ అని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని