YS Jagan: తాలిబన్‌ పాలనను తలదన్నేవారు జగన్‌కు సౌమ్యులట

వినేవాడు ఉంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయన్నారంట’ వెనుకటి ఒకరు.. అలా ఉంది సీఎం జగన్‌ పరిస్థితి. వినే జనాలు ఉంటే అబద్ధాన్ని సైతం నిజమనుకునేలా అలవోకగా చెప్పేస్తారు.

Updated : 04 Apr 2024 08:51 IST

దాడులు, భయాందోళనలు  సృష్టించేవారు మంచివారట
అన్నమయ్య జిల్లా అభ్యర్థుల పరిచయంలో అలవోకగా జగన్‌ అబద్ధాలు  

ఈనాడు, అమరావతి, కడప: వినేవాడు ఉంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయన్నారంట’ వెనుకటి ఒకరు.. అలా ఉంది సీఎం జగన్‌ పరిస్థితి. వినే జనాలు ఉంటే అబద్ధాన్ని సైతం నిజమనుకునేలా అలవోకగా చెప్పేస్తారు. సభకు వచ్చిన జనాలు.. టీవీల్లో చూసే వారికి ఏమి తెలియదనుకుంటారో ఏమో.. లేదంటే అక్రమ సంపాదన, అరాచకాల్లో ఆయన కంటే తన అభ్యర్థులు తక్కువ చేస్తున్నారని భావిస్తున్నారో ఏమోగాని వారిని మంచివారు, సౌమ్యులంటూ చెబుతున్నారు. ఇది విన్న, చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అరాచకం.. ప్రకృతి సంపద దోపిడీ.. భయాన వాతావరణం.. వాక్‌ స్వాతంత్య్రాన్ని కాలరాసేవారు జగన్‌ దృష్టిలో సౌమ్యులేనేమో.! ఇప్పటికే కర్నూలు జిల్లాలో వైకాపా తరపున పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులందరూ పేదవారంటూ చెప్పిన జగన్‌.. మదనపల్లెలో మంగళవారం జరిగిన బస్సు యాత్ర సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి, కుమారుడు మిథున్‌రెడ్డిలు మంచివాళ్లు, సౌమ్యులంటూ చెప్పడాన్ని చూపి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మానవహక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు సౌమ్యులంట.

సౌమ్యుడు 1

పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి అన్న నిలబడుతున్నాడు. నాకు పితృ సమానుడు. మీ అందరికి పరిచయస్తుడు. మంచివాడు. సౌమ్యుడు - జగన్‌

  • పుంగనూరు నియోజకవర్గం తాలిబన్ల పాలనను తలదన్నేలా ఉందనే విమర్శలున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష నేతలపై ఆయన అనుచరులు దాడులు చేస్తారు. వారే పోలీసులతో కేసులు పెట్టిస్తారు. విద్యుత్తు ప్రాజెక్టులైనా.. గనుల తవ్వకాలైనా.. పోటీ లేకుండా ఆయన కాళ్ల దగ్గరకు వస్తాయనే ఆరోపణలున్నాయి.  
  • సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన దళిత యువకుడు ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శించిన రెండు రోజులకే ఓం ప్రతాప్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు.  
  • మార్లపల్లెకు చెందిన వృద్ధుడు అంజిరెడ్డి తెదేపా తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా ఆయనపై దాడికి యత్నించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
  • పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్‌ ఇసుక దోపిడీపై గళమెత్తడంతో 2022 జులైలో వైకాపా నాయకులు దాడి చేశారు. చేతులు విరగొట్టి రోడ్డు పక్కన పడేశారు.
  • పచ్చార్లమాకులపల్లెకు చెందిన రాజారెడ్డి తెదేపాలో క్రియాశీలకంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక 2022 ఏప్రిల్‌లో కొందరు కిడ్నాప్‌ చేసి కాళ్లు విరిచేశారు.
  • భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి కార్లు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.
  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు చేపట్టిన సైకిల్‌ యాత్రను పుంగనూరులో అడ్డుకున్నారు. పసుపు రంగు దుస్తుల్ని బలవంతంగా విప్పించేశారు.

సౌమ్యుడు-2

తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకానాథ్‌ నిలబడుతున్నారు. ద్వారకా అన్న కూడా సౌమ్యుడు, మంచివాడు - జగన్‌

తంబళ్లపల్లెలోనూ గత ఐదేళ్లుగా తాలిబన్‌ తరహా రాజ్యం నడుస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కొందరు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. భూమి యజమానులు లేకుండానే బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. తన ఇంటికి, పొలాలకు అవసరమైన రహదారుల నిర్మాణానికి ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకున్నారనే విమర్శలున్నాయి.

  • ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత ఖరీదైన ఒ గ్రానైట్‌ క్వారీని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట, అంగళ్లు, హార్సిలీ హిల్స్‌ కింద భూముల్ని బినామీల పేరిట కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.
  • ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు, ఆయన అనుచరులు పలువురిపై దాడులకు పాల్పడి ఆస్తుల్ని స్వాహా చేసినట్లు ప్రచారం ఉంది.

సౌమ్యుడు-3

రాజంపేట నుంచి అమరన్న నిలబడుతున్నారు. అమరన్నను ఎవ్వరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట వాళ్ల పెదాలపై ఉంటుంది. - జగన్‌

రాజంపేట మండలం మందపల్లె రెవెన్యూ గ్రామం నారమరాజుపల్లె గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూముల్లో ఎస్టేట్‌ను నిర్మించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్టేట్‌లోకి జిల్లా పరిషత్‌ నిధులతో రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు విమర్శలున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన తరుణంలో నిర్మించిన రహదారులకు ఆయన అనుచరులు రూ. 3 కోట్ల జడ్పీ నిధులతో అక్రమంగా బిల్లులు చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి.

మంచివాడు-5

ఎంపీ అభ్యర్థిగా మిథున్‌ నిలబడుతున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు. పరిచయస్తుడు. మంచివాడు -జగన్‌

తిరుపతి, కడప మార్గాల్లోని జాతీయ రహదారుల వెంబడి రూ. 400 కోట్ల విలువైన భూముల్ని ఆయన అనుచరులు, అనుయాయులు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. 282 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఇద్దరు తహసీల్దార్లు, 8 మంది వీఆర్‌వోలు, 4 ఆర్‌ఐలపై ప్రభుత్వం వేటు వేసింది. భూములు మాత్రం ఆక్రమణదారుల చెర నుంచి వెనక్కిరాలేదు.

మంచి స్నేహితుడు-4

రాయచోటి నుంచి శ్రీకాంత్‌ నిలబడుతున్నారు. ఎమ్మెల్యే కంటే కూడా నాకు మంచి స్నేహితుడని చెప్పవచ్చు -జగన్‌

రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి కేటాయించిన రూ. 120 కోట్ల విలువైన భూమిని ఆయన అనుచరులు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడుగురు వైకాపా నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని