గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి

ఏపీపీఎస్సీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జులై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది.

Published : 11 Apr 2024 06:14 IST

1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం

ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జులై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్‌లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్‌ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. నోటిఫికేషన్‌ జారీ అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్‌ అయ్యేందుకు వీలుకాలేదు. ముఖ్యంగా ‘భారత సమాజం’ కింద ఇచ్చిన సిలబస్‌ కఠినంగా ఉంది. పాఠ్య పుస్తకాలూ అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం అనంతరం గ్రూపు-2 నోటిఫికేషన్‌ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువమందికి అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మరోవైపు.. గ్రూపు-1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని