ఎంతైనా తీసుకోండి.. ఓట్లు వేయించండి

పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్ల(ఆర్పీ)ను వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు.

Published : 11 Apr 2024 04:39 IST

రిసోర్స్‌ పర్సన్లకు వైకాపా ఎర
ప్యాకేజీలకు తలొగ్గిన కొందరు ఆర్పీలు
మహిళా సంఘాలతో రహస్య భేటీలు
విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరుల్లో ఇప్పటికే తాయిలాల పంపిణీ
ఈనాడు - అమరావతి

పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్ల(ఆర్పీ)ను వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు. అనేకచోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్స్‌ పర్సన్లను నియంత్రించాల్సిన పుర, నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్‌ కూడా చోద్యం చూస్తోంది. ఎన్నికల్లో గెలుపునకు వైకాపా నేతలు ఇప్పటికే అనేక అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కల్పిస్తూ, బ్యాంకు రుణాల సద్వినియోగాన్ని పర్యవేక్షించే ఆర్పీల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. ఆర్పీలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.7 వేల గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో పది మంది సభ్యుల చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల మంది సభ్యులు ఉంటారని అంచనా.

ఏ నగరం చూసినా.. అదే తీరు

  • విశాఖ నగరంలోని రెండు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఒక్కో ఆర్పీకి ఇప్పటికే రూ.25 వేల చొప్పున నజరానాలు అందించారు. వీరు తమ పరిధిలోని మహిళా సభ్యులకు తాయిలాలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు సంఘాలను సమన్వయం చేసే కొందరు కో-ఆర్డినేటర్లు అభ్యర్థులకు బాహాటంగానే సహకరిస్తున్నారు.
  •  కాకినాడ నగర పరిధిలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై మహిళల మద్దతు తనకే లభించేలా చూడాలని కోరారు. ఇటీవలే కొందరు  ఆర్పీలకు రూ.20 వేల చొప్పున నగదు పంచారు. వీరి ద్వారా కానుకలు సభ్యులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  •  విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆర్పీలతో పాటు పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉండే మహిళా సభ్యులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. ‘ఏం కావాలో, ఎంత కావాలో తీసుకెళ్లండి. సభ్యుల ఓట్లు నాకే పడాలి’ అని ఆఫర్‌ ఇచ్చారు. దీనికి అంగీకరించిన కొందరు ఇప్పటికే రంగంలో దిగారు.
  •  గుంటూరు జిల్లాలో ఓ అభ్యర్థిని ఆర్పీల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో డివిజన్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుచరులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. సభ్యులకు చీరలు, ఇతర బహుమతులు అందిస్తూ ఎర వేస్తున్నారు.
  •  తిరుపతి జిల్లాలోని వైకాపా అభ్యర్థి ఒకరు నాలుగు రోజుల క్రితం నగరానికి దూరంగా ఆర్పీలతో రహస్యంగా సమావేశమయ్యారు. మహిళలకు తాయిలాలు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఆర్పీకి రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
  • ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోడ్‌ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో భేటీ అయ్యి, ప్యాకేజీలు నిర్ణయించారు. పొదుపు సంఘాల సభ్యుల ఓట్లు తనకే పడాలని, ఇందుకు ఏం చేయడానికైనాసిద్ధమేనని ప్రకటించారు. ఆయన తరఫున మహిళలతో ఆర్పీలుమంత్రాంగం నడుపుతున్నారు.

‘మహా’ అధికారి అరాచకం

పొదుపు సంఘాల మహిళల మద్దతు వైకాపాకే లభించేలా కొన్నిచోట్ల నగరపాలక సంస్థల అధికారులు బాహాటంగానే పని చేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పర్యవేక్షణకు విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా పట్టణ సామాజికాభివృద్ధి విభాగాలు (యూసీడీ) ఉన్నాయి. మిగతా నగరపాలక సంస్థల్లో ప్రాజెక్టు అధికారులు పని చేస్తున్నారు. విశాఖలో ఓ అధికారి వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పని చేస్తున్నట్లు తీవ్ర విమర్శలున్నాయి. మహిళలు వైకాపాకు అండగా నిలిచేలా ఆర్పీలు, కో-ఆర్డినేటర్ల ద్వారా తెర వెనుక వ్యవహారాలు నడుపుతున్నారు. కాకినాడలో ఓ అధికారిపై ఇలాంటి ఫిర్యాదులు రాగా, ఇటీవల ఉన్నతాధికారులు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మరోపక్క, వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలోని యూసీడీ అధికారి ఒకరు బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం వైదొలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని