బాధితులపైనే.. ఎస్సీ, ఎస్టీ కేసులు

సామాన్య పౌరుల ఇంటి మీద దాడి చేసి, రక్తమోడేలా కొట్టినా.. ఒంగోలు పోలీసులకు పెద్ద నేరంగా కనిపించలేదు. ఎందుకంటే దాడి చేసింది వైకాపా వాళ్లు కాబట్టి! పైగా బాధితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎంతైనా తాము అధికార పార్టీ విధేయులమే అని నిరూపించుకున్నారు.

Published : 12 Apr 2024 04:25 IST

వైకాపా వర్గీయులపై తేలికపాటి సెక్షన్లే
వందలమందిని వెంటేసుకు వచ్చిన బాలినేనికి వత్తాసు
వైకాపా కార్యకర్తల వీరంగం... చోద్యం చూసిన పోలీసులు
మౌనమునిలా జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌

ఒంగోలు, న్యూస్‌టుడే: సామాన్య పౌరుల ఇంటి మీద దాడి చేసి, రక్తమోడేలా కొట్టినా.. ఒంగోలు పోలీసులకు పెద్ద నేరంగా కనిపించలేదు. ఎందుకంటే దాడి చేసింది వైకాపా వాళ్లు కాబట్టి! పైగా బాధితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎంతైనా తాము అధికార పార్టీ విధేయులమే అని నిరూపించుకున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి వందలమంది అనుచరులతో వీరంగం చేస్తూ.. తెదేపా నేతలపై కవ్వింపు చర్యలకు పాల్పడినా కళ్లప్పగించి చూశారు. ఆసుపత్రిలో రోగులు భయాందోళనతో వణికిపోతున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాజకీయ ఘర్షణల్ని నివారించడంలో విఫలమైన పూర్వ ఎస్పీ పరమేశ్వరరెడ్డిపై ఈసీ వేటు వేసినా.. ఇప్పటికీ కొందరు పోలీసులు వైకాపా తొత్తులుగానే వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటనలే నిదర్శనం. తన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత రాద్ధాంతం నడుస్తున్నా జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ మౌనమునిలా ఉండిపోయారు.

జెండా కర్రలతో దాడి చేసి..

ఒంగోలు సమతానగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో చప్పిడి ప్రభావతి కుటుంబం నివసిస్తోంది. మాజీమంత్రి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున ఆయన కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, వాలంటీరు కె.సుజన ప్రియ, మరికొందరు కార్యకర్తలతో కలిసి ప్రభావతి ఇంటికి వెళ్లారు. రాజకీయ ప్రచారంలో వాలంటీరు ఎందుకు ఉన్నారని ప్రభావతి ప్రశ్నిస్తూ ఫొటో తీసే యత్నం చేయడంతో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. జెండా కర్రలతో ప్రభావతి, ఆమె కుమారులపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి తెదేపా నాయకుడు మేడికొండ మోహన్‌ అక్కడికి చేరుకున్నారు. వైకాపా నాయకులు గోలి తిరుపతిరావు, గంటా రామానాయుడు, బాంబుల సాయి ఆధ్వర్యంలో సుమారు 40 మంది కార్యకర్తలు ఆయన్ను కూడా చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు.

బాధితులపై ఎస్సీ, ఎస్టీ కేసులా?

వైకాపా నేతల చేతిలో దాడికి గురైన ప్రభావతి ఫిర్యాదులో బాలినేని కోడలు శ్రీకావ్య, గోలి తిరుపతిరావు, అట్ల కల్యాణ్‌రెడ్డి గంటా రామానాయుడు, బాంబుల సాయి సహా 31 మంది వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజీనామా చేసినట్లు పేర్కొంటున్న వాలంటీర్‌ సుజన ప్రియ ఫిర్యాదు మేరకు ప్రభావతితో పాటు తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు, ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి సహా 36 మంది పేర్లు ప్రస్తావిస్తూ, మరికొందరికీ ప్రమేయం ఉన్నట్లు పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో దాడికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్‌ సహా ఒక్కో వర్గం నుంచి ఎనిమిదేసి మంది చొప్పున ఇరువర్గాల పైనా కేసులు పెట్టారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు గురువారం ఎన్నికల కమిషనర్‌ ముకేష్‌కుమార్‌ మీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సమతానగర్‌ కేసుల దర్యాప్తును దిశ డీఎస్పీ శ్రీనివాసరావుకు, ఒంగోలు జీజీహెచ్‌ సంఘటనకు సంబంధించిన కేసును సింగరాయకొండ సీఐ రంగనాథ్‌కు అప్పగించారు.


మాజీ మంత్రిని నిలువరించలేరా?

విషయం తెలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకోగా, తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ గాయపడిన తమ కార్యకర్తల పరామర్శకు వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇరువర్గాలనూ నిలువరించి, ఘర్షణ నివారించే యత్నం చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. బాలినేని రాత్రి 11.15 గంటల సమయంలో వందలమంది వైకాపా కార్యకర్తలతో జీజీహెచ్‌కు బయలుదేరారు. అప్పటికే అక్కడ తెదేపా నాయకులు ఉన్నారనే విషయం పోలీసులకు తెలుసు. అయినా ఆయనను నిలువరించే ప్రయత్నం చేయలేదు. సీనియర్‌ పోలీసు అధికారులు పట్టనట్లే వ్యవహరించారు. లోపల ఎంతోమంది రోగులున్నా వారి భద్రతను కూడా పట్టించుకోలేదు. తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌తో పాటు 40 మంది వరకు కార్యకర్తలు ఆసుపత్రిలో ఉన్నా అదే సమయంలో బాలినేనిని పెద్దఎత్తున అనుచరగణంతో సహా లోపలికి వెళ్తున్నా అడ్డుకోలేదు. ఫలితంగా ఇరుపక్షాల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. పోలీసు అధికారుల సమక్షంలోనే దాడులు చోటుచేసుకున్నాయి. క్యాజువాలిటీ వార్డు అద్దాలు బద్దలయ్యాయి. రోగులు, వారి బంధువులు భయంతో వణికిపోయారు. అదే సమయంలో బయట శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో నానా హంగామా సృష్టించారు. రెండు గంటలకు పైగా వైకాపా నేతల కవ్వింపు చర్యలకు పాల్పడ్డా పోలీసులు పట్టించుకోలేదు.


ఆ ఇద్దరూ అధికారపక్షంతో అంటకాగే సీఐలే

ఈ ఘటనలో చోద్యం చూస్తూ నిల్చున్న ఇద్దరు సీఐలూ వైకాపాతో అంటకాగుతున్న వారే. సంఘటన జరిగిన సమతానగర్‌ ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉంది. అక్కడి సీఐ భక్తవత్సలరెడ్డి వైకాపా వాళ్లను వదిలేసి తెదేపా వర్గీయులను లాఠీలతో చెదరగొట్టారు. జీజీహెచ్‌ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు నానా బీభత్సం సృష్టించినా అక్కడి సీఐ ఎం.లక్ష్మణ్‌ కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఈయన ఎస్సై, సీఐ హోదాల్లో ఒంగోలు వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలూకా స్టేషన్లలోనే పనిచేశారు. అడపాదడపా బయట పోస్టింగులు చేసినా ఒంగోలును పెద్దగా వీడిన దాఖలాలు లేవు. అటు కాంగ్రెస్‌, ఇటు వైకాపా హయాంలోనూ మాజీమంత్రి బాలినేనికి వీరవిధేయుడిగా ముద్రపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని