ఆ మౌనం వెనక.. దోచిపెట్టే మర్మం!

మన చేనులో పశువులు మేస్తున్నాయంటేనే.. పరుగున వెళ్లి వాటిని వెళ్లగొడతాం! పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తే.. వెంటనే ఎలా తిరిగి రాబట్టుకోవాలో చూస్తాం! అదే.. 2,650 ఎకరాల భూమి అయితే..? ఆ ఆలోచనకే కాళ్ల కింద నేల కంపించిపోతోంది కదూ.. కానీ, ఏపీఐఐసీకి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు.

Published : 14 Apr 2024 05:45 IST

‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ భూముల కేసులో ఏపీఐఐసీ తొండాట
సంస్థ దివాలా విషయం తెలిసీ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేయని వైనం
ఫలితంగా 2,650 ఎకరాలు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం
ఆ భూముల విలువ రూ.1,600 కోట్లకు పైనే..
వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ప్రాజెక్టు జగన్‌ స్వార్థానికి బలి
‘ఈనాడు’  స.హ.చట్టం  దరఖాస్తుతో బహిర్గతం

మన చేనులో పశువులు మేస్తున్నాయంటేనే.. పరుగున వెళ్లి వాటిని వెళ్లగొడతాం! పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తే.. వెంటనే ఎలా తిరిగి రాబట్టుకోవాలో చూస్తాం! అదే.. 2,650 ఎకరాల భూమి అయితే..? ఆ ఆలోచనకే కాళ్ల కింద నేల కంపించిపోతోంది కదూ.. కానీ, ఏపీఐఐసీకి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. అదేమంటే.. ‘అవును.. మాకు తెలియదు.. మేం స్పందించలేదు’ అంటూ బాధ్యతారహిత సమాధానమిస్తోంది. ఇలా తెలియదని చెప్పడం వెనక.. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను.. ప్రభుత్వ పెద్దలు కావాలనుకున్న వాళ్లకు.. అప్పనంగా కట్టబెట్టే పన్నాగం అర్థమవుతూనే ఉంది. లేపాక్షి కుంభకోణంలో సీబీఐ ఏ1గా పేర్కొన్న జగనే.. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన సీఎం పదవి వెలగబెడుతున్నారు. అంటే.. ప్రధాన నిందితుడి చేతిలోనే పాలనా పగ్గాలు ఉన్నాయన్నమాట.

ఎన్‌.విశ్వప్రసాద్‌
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

అద్భుత వనరులు, అపార అవకాశాలున్న ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్‌ సర్కారు తన స్వప్రయోజనాల కోసం భ్రష్టు పట్టిస్తోంది. ప్రజలు, యువత ఏమైపోతే మాకేంటి.. తమ, తమవాళ్ల గల్లాపెట్టెలు కళకళలాడితే చాలనేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఒక అద్భుత పారిశ్రామిక క్లస్టర్‌గా ఎదగాల్సిన ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ను తన తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే జగన్‌ ఒక భారీ కుంభకోణంగా మార్చారు. యూనివర్సిటీ క్లస్టర్లు, సైన్స్‌, టెక్నాలజీ సంస్థలు, లాజిస్టిక్‌ పార్కులతో వేల మందికి ఉపాధిని అందించాల్సిన ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. వెనకబడ్డ రాయలసీమ ప్రాంత యువత ఆశలను కుప్పకూల్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుంభకోణం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది.

కొత్తగా ఏం జరుగుతున్నదంటే..

శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వం అనంతపురం జిల్లా) చిలమత్తూరు మండల పరిధిలో.. జాతీయ రహదారి పక్కన లేపాక్షి హబ్‌ కార్యాలయం ముందు చాలాకాలంగా ఒక బోర్డు పెట్టి ఉంది. ఎన్‌సీఎల్‌టీ, బెంగళూరు శాఖ ఇచ్చిన తీర్పు మేరకు, లేపాక్షి గ్రూపునకు రూ.5 కోట్లు ఇచ్చిన గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇండియా సంస్థ వేసిన కేసు ఫలితంగా రైతుల నుంచి తీసుకుని ప్రాజెక్టుకు ఇచ్చిన భూముల్లో 2,650 ఎకరాలు దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు దానిపై వివరించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ దివాలా మొదలవడం గమనార్హం. లేపాక్షికి జరిగిన కేటాయింపులను 2014లోనే అప్పటి సర్కారు రద్దు చేయడంతో.. వాటి హక్కుదారు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆఘమేఘాల మీద రంగంలోకి దిగి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆశ్చర్యకరంగా ఆ బోర్డుపై ఉన్న వివరాలేమీ తమ దృష్టికే రాలేదని ఏపీఐఐసీ చెబుతోంది. ఆ దారిన పోయేవారికీ సులభంగా అర్థమయ్యే ఈ విషయం.. తమకు తెలియదని పేర్కొంది. తమ వైపు నుంచి న్యాయపరంగా ఎలాంటి చర్యా తీసుకోకుండా.. రూ.1,600 కోట్ల విలువైన ప్రజా సంపద అన్యాక్రాంతమయ్యేలా పరోక్షంగా సహకరిస్తోంది. జగన్మాయకు ఒక ప్రభుత్వ సంస్థ బందీ అయి.. ప్రజలకు, తన విధికి చేస్తున్న ద్రోహాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధి సమాచార హక్కు ద్వారా సేకరించిన వివరాలు నిగ్గుతేల్చాయి.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో యువతకు ఉపాధి కల్పన కోసమంటూ చిలమత్తూరు ప్రాంతంలో లేపాక్షి నాలెడ్జి హబ్‌ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటైన లేపాక్షి నాలెడ్జి హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఏపీఐఐసీ ద్వారా 8,844 ఎకరాలను అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వైఎస్‌ హయాంలో అనేక ప్రయోజనాలు పొందిన, ఆయన కుటుంబానికి దగ్గరైన ఇందూ ప్రాజెక్ట్స్‌ కంపెనీ తెరవెనక ఉండి తన మనుషుల ద్వారా ఏర్పాటు చేయించిన అనుబంధ సంస్థే ఇది. ప్రాజెక్టును అభివృద్ధి చేసి, పరిశ్రమలను రప్పించాలనే ఆలోచన లేపాక్షి హబ్‌కు గానీ, దాని మాతృసంస్థ ఇందూ ప్రాజెక్ట్స్‌కు గానీ లేదనే విషయం కొద్దిరోజులకే స్పష్టమైంది. పేదల నుంచి లాగేసి.. ప్రభుత్వం తమకు కారుచౌకగా దోచిపెట్టిన భూముల్లో కొన్నింటిని అధిక ధరలకు అమ్ముకుని, మరి కొన్నింటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని.. ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకోవడంపైనే అవి దృష్టిసారించాయి. ఆ తర్వాత ఆ భూముల కేటాయింపు వ్యవహారం భారీ కుంభకోణమని 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో జగన్‌ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. తన తండ్రి వైఎస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని జగన్‌ ప్రభావితం చేయడంతోనే అనేక దశల్లో నిబంధనలకు పాతరేసి లేపాక్షి హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు భూముల కేటాయింపు జరిగిందనీ, దానికి ప్రతిఫలంగా ఇందూ సంస్థ నుంచి జగన్‌ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏషియాలలోకి రూ.70 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని.. ఇదంతా క్విడ్‌ప్రోకో అని తేల్చింది. దాంతో లేపాక్షి హబ్‌కు భూకేటాయింపులను, ఇతర రాయితీలను ఖరారు చేస్తూ 2009లో వైఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను.. 2014 ఫిబ్రవరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు రద్దు చేసింది.

జగన్‌ సీఎం అయ్యాక కొత్త కదలిక

దాదాపు దశాబ్దం తర్వాత.. ఈ కుంభకోణం కేసులో ఏ1 అయిన జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కాక.. మరో కదలిక చోటుచేసుకుంది. లేపాక్షి గ్రూపునకు తాము 2012లో ఇచ్చిన రూ.5కోట్ల అప్పు వడ్డీతో కలిపి రూ.25.84 కోట్లకు చేరిందనీ, తమకు ఇంతవరకు భూమిని అప్పగించకపోవడంతో లేపాక్షి సైన్స్‌, లేపాక్షి హెరిటేజ్‌ కంపెనీలపై దివాలా ప్రక్రియను చేపట్టాలనీ 2021లో గ్లోబల్‌ సంస్థ... బెంగళూరులోని ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. నిజానికి లేపాక్షికి చేసిన భూకేటాయింపులను 2014లోనే నాటి ప్రభుత్వం రద్దు చేసినందున, వాటిపై ప్రస్తుతం తమకే హక్కు ఉంటుందని ఏపీఐఐసీ ఈ కేసుల్లో జోక్యం చేసుకుంటూ పిటిషన్లు వేయాలి. కానీ, ప్రభుత్వ పెద్దల మనసులోని మర్మం తెలిసిన ఏపీఐఐసీ అధికారాలు మిన్నకుండిపోయారు. ఫలితంగా బెంగళూరులోని ఎన్‌సీఎల్‌టీలో గ్లోబల్‌ సంస్థకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వాటిపై చెన్నైలోని అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో లేపాక్షి పిటిషన్లు వేసింది. అక్కడా 2022లో గ్లోబల్‌కు అనుకూలంగానే తీర్పులు వెలువడ్డాయి. తర్వాత లేపాక్షి 2022లోనే సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ప్రస్తుతం కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఒకవేళ సుప్రీంలోనూ గ్లోబల్‌కు అనుకూలంగా తీర్పులు వస్తే 2,650 ఎకరాల ప్రభుత్వ భూములు పరులపరం అయిపోతాయి.

ఏపీఐఐసీ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

లేపాక్షి భూములకు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ, బెంగళూరు శాఖలో దాఖలైన కేసుల వివరాలను పేర్కొంటూ.. వాటిలో జోక్యం చేసుకునేందుకు పిటిషన్లు వేశారా? అని ‘ఈనాడు’ ప్రతినిధి సమాచార హక్కు కింద చేసిన దరఖాస్తుకు ఏపీఐఐసీ ఇటీవల స్పందించింది. ‘లేదు.. మాకా విషయం తెలియదు. అందుకే మేం స్పందించలేదు’ అంటూ నిర్లక్షపూరిత సమాధానం ఇచ్చింది. చెన్నైలోని ఎన్‌సీఎల్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లతోపాటు సుప్రీంకోర్టులోనూ ఈ కేసులపై తాము పిటిషన్లు వేయలేదని స్పష్టం చేయడం గమనార్హం. ‘ఈనాడు’కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎన్‌సీఎల్‌టీ, బెంగళూరు విభాగంలో కేసు నమోదైనప్పటి నుంచి దానిపై ప్రభుత్వంలోని ముఖ్యులందరికీ సమాచారముంది. అయినా భూములను కాపాడే ఉద్దేశం లేకపోవడంతో వారెవరూ ఏపీఐఐసీ ద్వారా పిటిషన్లు వేయించే కసరత్తు చేయలేదు. మరో దారుణమైన పరిణామం ఏంటంటే... రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిపై ఏ హక్కు లేని రెండు సంస్థల మధ్య కోర్టులో వివాదం నడుస్తుండటం. అలాంటి స్థితిలో తీర్పు ఎలా వచ్చినా ఆ భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదముంది. భవిష్యత్తులో ఈ అంశంపై ఏదైనా విచారణ జరిగితే... ఏపీఐఐసీలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న ముఖ్యులంతా జవాబుదారీ కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఏపీఐఐసీ న్యాయవిభాగం ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదని సచివాలయంలో ఓకీలక అధికారి వ్యాఖ్యానించారు.

మరో కేసులోనూ అదే బాధ్యతారాహిత్యం

హైదరాబాద్‌ విభాగానికి చేరిన మరో కేసులోనూ ఏపీఐఐసీ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ప్రభుత్వం అప్పగించిన భూముల నుంచి మరో 4,191 ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఇందూ ప్రాజెక్ట్స్‌ భారీగా రుణాలు తీసుకుంది. ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకుంది. ఆ తర్వాత దివాలా తీసింది. ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ విభాగంలో ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ 2019 ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. హబ్‌ కోసం ఏపీఐఐసీద్వారా జరిగిన భూకేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే రద్దు చేసిందని, అందువల్ల ఆ భూములపై సంస్థకు హక్కు లేదనీ, ఆ కంపెనీ దివాలా ప్రక్రియ నుంచి లేపాక్షి భూములను తప్పించాలని ఏపీఐఐసీ పిటిషన్‌ వేసి, కేసులో తానూ ప్రతివాదిగా చేరాలి. కానీ, అవేమీ పట్టించుకోకుండా మూడేళ్లకుపైగా కాలం గడిపింది.


అసాధారణంగా పెరిగిన భూముల విలువ

లేపాక్షి నాలెడ్జి హబ్‌కు అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసిన భూములు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే దారిలో ఏపీ సరిహద్దు ఆరంభం నుంచి రోడ్డుకు రెండువైపులా ఉంటాయి. వీటికి 65 కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో లేపాక్షి భూములకు దగ్గరలోనే జాతీయ రహదారిపై ‘కియా’ కార్ల కర్మాగారం వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర రూ.60 లక్షలకుపైగా పలుకుతోంది.


తక్కువకు కొట్టేసి.. ఎక్కువకు అమ్మాలని..

భూములు కేటాయించిన కొద్ది కాలానికే లేపాక్షి హబ్‌ నిబంధనలకు విరుద్ధంగా అందులో కొన్ని ఎకరాలను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు 2012లోనే సిద్ధమైంది. లేపాక్షికి సగటున ఎకరా రూ.1.35 లక్షలకే దక్కింది. అవే భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండానే ఎకరం రూ.9 లక్షల వంతున 2,650 ఎకరాలను దిల్లీకి చెందిన ‘గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇండియా లిమిటెడ్‌’కు రూ.238.5 కోట్లకు అమ్ముకునేందుకు లేపాక్షి ఏర్పాట్లు చేసుకుంది. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. లేపాక్షి నాలెడ్జి హబ్‌ సంస్థకు అనుబంధంగా రెండు కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలి. అది విక్రయించనున్న 2,650 ఎకరాలను ఆ 2 కంపెనీలకు బదిలీ చేయాలి. తర్వాత రూ.238.5 కోట్లకు ఆయా కంపెనీల వాటాలను గ్లోబల్‌ చేజిక్కించుకుంటుంది. ఈమేరకు లేపాక్షి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పార్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లేపాక్షి హెరిటేజ్‌ వెల్‌నెస్‌ విలేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే 2 అనుబంధ సంస్థలను లేపాక్షి హబ్‌ ఏర్పాటు చేసింది. వీటిల్లో మొదటి కంపెనీకి 2,000 ఎకరాలను, రెండోదానికి 650 ఎకరాలను బదిలీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తికి గ్లోబల్‌ సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకుంది. ఇదే సమయంలో లేపాక్షి హబ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ ప్రారంభమవడంతో భూముల విక్రయ ప్రక్రియ ఆగిపోయింది.


‘ఈనాడు’లో కథనం చూసి..

ఇందూ దివాలా వ్యవహారంలో ప్రభుత్వానికి చెందిన లేపాక్షి భూములు కారుచౌకగా సీఎం జగన్‌ మేనమామ కుమారుడు, అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న ఒక సంస్థ పరమయ్యే పరిస్థితి వచ్చిందని 2022 ఆగస్టు 23న ‘ఈనాడు’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఏపీఐఐసీ స్పందించి.. ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ విభాగంలో నెలరోజులకు పిటిషన్‌ దాఖలు చేసింది. లేపాక్షి భూములపై తమకు హక్కులు ఉన్న విషయాన్ని ఎన్‌సీఎల్‌టీ నియమించిన  రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు గతంలో తాము మెయిల్‌ ద్వారా వివరించామనీ, దాంతో ఆ భూములను దివాలా ప్రక్రియలో భాగం చేయరని భావించామనీ, అయితే పత్రికలో వచ్చిన కథనం చూసి పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని అందులో సవివరంగా పేర్కొంది. మరోవైపు లేపాక్షి కుంభకోణంపై విచారణ చేసిన ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) 2015 మార్చిలో ప్రాజెక్టుకు సంబంధించిన 8,648 ఎకరాలను జప్తు చేసింది. తమ జప్తులో ఉన్న భూములను ఇందూ దివాలా ప్రక్రియలో భాగంగా వేలం వేయకుండా చూడాలని ఈడీ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ విభాగం 2023 జులై 5న వేర్వేరు తీర్పులను ఇచ్చింది. కేసుల విచారణ సందర్భంగా... రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ తమ వైఖరిని తెలియజేస్తూ ఈడీ స్వాధీనంలోని భూములను వేలంలో ఉంచడం లేదని స్పష్టం చేసినందున ఏపీఐఐసీ, ఈడీ పిటిషన్లపై ఇక విచారణ అవసరం లేదని ఎన్‌సీఎల్‌టీ కొట్టివేసింది. అయితే ఏపీఐఐసీ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో ట్రైబ్యునల్‌ ఆ సంస్థ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘కేసులో జోక్యం చేసుకుంటూ ఏపీఐఐసీ వేసిన పిటిషన్‌లో అసలు విషయం లేదు. విచారణ సమయంలోనూ బలమైన వాదనలు వినిపించలేదు. అసలు ఆ పిటిషనే సరైన పద్ధతిలో లేదు’ అని ఆక్షేపించింది. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఏపీఐఐసీకి, దాన్ని నడిపిస్తున్న పాలకులకు ఉన్న నిబద్ధతను పైన వ్యాఖ్యలు బహిర్గతం చేస్తున్నాయి. భూముల అమ్మకం, దివాలా ప్రక్రియల ద్వారా లేపాక్షి భూములు చేతులు మారే ప్రమాదాలు చేటుచేసుకుంటున్నా.. ఏపీఐఐసీ ఎందుకు నోరు మూసుకుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏపీఐఐసీని ముందు పెట్టి.. దాని భుజాల మీదుగా కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు అధికారం వెలగబెడుతున్న పెద్దలు ఆడుతున్న నాటకాలేననీ స్పష్టమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని