బూటకపు ప్రకటనలతో మునిగిన టౌన్‌షిప్‌

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను జగన్‌ ప్రభుత్వం చిదిమేసింది. పైసా పైసా కూడబెట్టుకుని సొంత ప్లాట్‌ కొనుక్కొందాం అనుకున్న సామాన్యుల ఆశలను వమ్ముచేసింది.

Updated : 14 Apr 2024 08:52 IST

మధ్య తరగతికి జగనన్న స్మార్ట్‌ మోసం
స్టాంపు డ్యూటీలో 40% రాయితీకి  రిజిస్ట్రేషన్‌ శాఖ ససేమిరా
అమరావతిలో ప్లాట్ల కొనుగోలుదారుల కష్టాలు

ఈనాడు, అమరావతి: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను జగన్‌ ప్రభుత్వం చిదిమేసింది. పైసా పైసా కూడబెట్టుకుని సొంత ప్లాట్‌ కొనుక్కొందాం అనుకున్న సామాన్యుల ఆశలను వమ్ముచేసింది. ప్లాట్‌ ధరలో 60 శాతం మొత్తానికే రిజిస్ట్రేషన్‌ చేయించనున్నట్లు సీఆర్డీఏ చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఛార్జీల్లో ఎలాంటి రాయితీ లేదంటూ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఆపేయడంతో కొనుగోలుదారులకు జగనన్న స్మార్ట్‌ మోసం బోధపడుతోంది. సీఆర్డీఏ కమిషనర్‌ కానీ, ఎస్టేట్స్‌ జేడీ కానీ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ప్లాట్లు   కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

నిలిచిన రిజిస్ట్రేషన్లు

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పథకంలో భాగంగా 2022 జనవరిలో సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో లే ఔట్‌ వేశారు. మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) నుంచి నివాస ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం సమీపంలోని టౌన్‌షిప్‌లో 68.26 ఎకరాల్లో 386 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. వీటిలో 240 చదరపు గజం విస్తీర్ణం గలవి 264, 200 చదరపు గజాలవి 122 ఉన్నాయి.     చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించారు. స్పందన పెద్దగా రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పురపాలక శాఖ పలు రాయితీలు ప్రకటించింది. డబ్బు ఏకమొత్తంలో చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్‌, అమ్మకం ధర రిజిస్ట్రేషన్‌లో 40 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. ఈ ప్రకటన తర్వాత 258 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 133 ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ పూర్తికాగా, ఇంకా 125 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ దాదాపు నెలన్నరగా నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో స్టాంపు డ్యూటీ చెల్లించనిదే రిజిస్ట్రేషన్‌ చేయబోమంటూ ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

శ్రీలక్ష్మి ఉత్తర్వులకే విలువ లేదా?

ప్లాటు అమ్మకం ధరను ప్రభుత్వం రెండుగా విభజించింది. 60 శాతాన్ని ప్లాట్‌ ధరగా, మిగిలిన 40 శాతాన్ని అభివృద్ధి ఛార్జీలుగా పేర్కొంది. మొత్తం ధరలో 60 శాతానికే స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుందని, అందులోనూ 40 శాతం రాయితీ అని ప్రకటనలిచ్చింది. తీరా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ సమయం వచ్చేసరికి పూర్తిగా చెల్లించాలని మెలిక పెట్టడంపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. రాయితీపై 2022 సెప్టెంబరు 23న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఇచ్చిన ఉత్తర్వులకు విలువ లేకుండా పోయింది. మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేసిన రిజిస్ట్రేషన్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆ 40 శాతం స్టాంపు డ్యూటీ కూడా చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే, ఎవరు భరించాలని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడే ఈఎంఐల చెల్లింపులు

ప్లాటు కొనుగోలుకు దరఖాస్తు చేసినప్పుడే దాని విలువలో 10 శాతం చెల్లించాలి. ప్లాట్‌ కేటాయించిన నెలలోపు ఒప్పందం ఉంటుంది. తర్వాత నెలలోపు 30 శాతం, ఆరు నెలలకు మరో 30 శాతం, ఏడాదికల్లా లేదా రిజిస్ట్రేషన్‌ వేళ మిగిలిన 30 శాతం డబ్బు చెల్లించాలి. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి తీసుకొని అమరావతి నిర్మాణాన్ని   ఆపేసినప్పటికీ, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, అమరావతికి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు కొన్నారు. ప్లాట్‌ ధరను పూర్తిగా సీఆర్డీఏకు చెల్లించినా కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినా బ్యాంకులకు నెలవారీ పద్దులు కట్టాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని