కాళ్లరిగిపోయాయ్‌.. కనికరించడయ్యా!

‘మనోళ్లయితే వదిలెయ్‌.. అటోళ్లయితే లోపలెయ్‌..’ ఈ సిద్ధాంతంతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంటే.. అధికార పార్టీ నేతల అరాచకాలకు ఇక  అడ్డెవరు? ప్రజల ఆస్తులకు రక్షణ ఎవరు? ప్రకృతి సంపదను కాపాడేదెవరు?

Published : 14 Apr 2024 05:40 IST

వైకాపా నేతల భూ ఆక్రమణలపై అటకెక్కిన అధికారుల విచారణ
లబోదిబో మంటున్న బాధితులు
పెద్ద తలకాయలను వెనకేసుకొస్తున్న జగన్‌ సర్కారు
ప్రైవేటు స్థలాలనూ వదలని పైశాచికత్వం

‘మనోళ్లయితే వదిలెయ్‌.. అటోళ్లయితే లోపలెయ్‌..’
ఈ సిద్ధాంతంతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంటే.. అధికార పార్టీ నేతల అరాచకాలకు ఇక అడ్డెవరు?  
ప్రజల ఆస్తులకు రక్షణ ఎవరు?
ప్రకృతి సంపదను కాపాడేదెవరు?
వీటిన్నింటికీ బాధ్యత వహించాల్సిన పాలకులే.. అక్రమార్కులకు అండగా నిలుస్తుంటే..
విచారణలు జరగకుండా చేస్తుంటే..  
దర్యాప్తు నివేదికలను తొక్కి పెడుతుంటే.. ఇక బాధితులకు న్యాయం జరిగేదెన్నడు?

తమ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే, సామాన్య కార్యకర్త కూడా ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించే రోజులివి. అటువంటిది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓ మోస్తరు నాయకులకు పట్టపగ్గాలు ఉంటాయా? అదీ వైకాపా హయాంలో ఊహించగలమా? గత ఐదేళ్లలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన అరాచకాలను పట్టించుకోని అధినాయకత్వం.. కలలో కూడా వారిపై కేసులు పెట్టే అవకాశాన్ని పోలీసులకు ఇవ్వదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటీ అరా అక్రమాలు ఠాణాల వరకు చేరి, కేసులు నమోదై, ఒకవేళ విచారణ వరకూ వెళ్లినా.. ఆ తర్వాత అడుగు ముందుకు పడనిస్తారా? వైకాపా హయాంలో ఒంగోలు, నెల్లూరు, అనకాపల్లి తదితర చోట్ల జరిగిన భూ ఆక్రమణల విచారణ దాదాపు అటకెక్కింది. రూ.వందల కోట్ల విలువ చేసే భూములు కొట్టేసిన వైకాపా ప్రజాప్రతినిధులు దర్జాగా తిరుగుతుంటే.. బాధితులు మాత్రం కలెక్టర్‌, రెవెన్యూ కార్యాలయాలు, పోలీసుస్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్రమార్కులకు జగన్‌ కొమ్ముకాస్తుండటంతోనే తమకు న్యాయం జరగడం లేదని వారంతా వాపోతున్నారు.


మంత్రి అనుచరుల దందాపై మౌనం

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మంత్రి అమర్‌నాథ్‌ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు వేయడానికి ప్రభుత్వ భూములు, దళితులకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములు, గెడ్డలు కలిపి సుమారు 10 ఎకరాలను ఆక్రమించారు. వీటివిలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. వీటిని ప్లాట్లుగా చేసి, విక్రయించేందుకు పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణల గురించి కొద్దికాలం కిందట పత్రికలు, టీవీల్లో కథనాలు వచ్చాయి. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు స్పందించి.. ఆక్రమణకు గురైన భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆక్రమణదారులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారంతా మంత్రి అనుచరులు కావడంతోనే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులకే ఆ హెచ్చరిక బోర్డులను సైతం అక్రమార్కులు తొలగించడం గమనార్హం.


నెల్లూరులోనూ రూ.45 కోట్ల విలువైన భూమి

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం కాల్వలుగా పేర్కొన్న సుమారు 6.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి భారీ లేఅవుట్‌ వేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమి సుమారు రూ.45 కోట్ల విలువ పలుకుతుంది. దీన్ని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నా అధికారులు అటుగా కన్నెత్తి చూడలేదు. అది నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడి దందా కావడమే అందుకు కారణం. ఆ తర్వాత నియమించిన విచారణ కమిటీ ఆక్రమణకు గురైనదాంట్లో 3.91 ఎకరాలు పోరంబోకు భూమి,  2.39 ఎకరాలు కాల్వ భూమి అని తేల్చింది. నిందితులపై చర్యలు లేవు సరికదా.. లేఅవుట్‌ పనులు యథావిధిగా కొనసాగుతున్నా యంత్రాంగం చేష్టలుడిగింది.


సున్నిపెంటలో 208 ఎకరాలు......

శ్రీశైలానికి సమీపంలో ఉన్న సున్నిపెంటలోని ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం ఎంతకీ కొలిక్కి రావడం లేదు. వైకాపా నేతల జోక్యం ఎక్కువగా ఉండటంతో అధికారులు మిన్నకున్నారు. ఈ విషయమై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్టేట్‌ అధికారిని నియమించకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. 3నెలల్లోగా ఆ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన 208 ఎకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్‌ నివేదికల్లో పేర్కొన్నా యంత్రాంగం చేపట్టిన చర్యలు శూన్యం.


సిట్‌.. కోరలు పీకేశారు!

గతేడాది ఆగస్టులో ఒంగోలు కేంద్రంగా సాగిన భూ కుంభకోణాలపై విచారణ ప్రారంభించిన ‘సిట్‌’ (ప్రత్యేక దర్యాప్తు బృందం).. ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ దర్యాప్తు క్రమంలో కొందరు పోలీసులు భారీగా లబ్ధిపొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల అండదండలు నిందితులకు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలు, దొంగ జీపీఏలతో రూ.వందల కోట్ల విలువైన ప్రైవేట్‌ భూముల ఆక్రమణకు పాల్పడ్డారు. కొందరేమో ఆయా భూముల యజమానులను బెదిరించి అందినకాడికి దండుకున్నారు. ఎటువంటి సమస్యలు లేని భూములను వివాదంలోకి లాగి.. యాజమానులను వీధినపడేశారు. బాధితులంతా పోలీస్‌స్టేషన్లకు పోటెత్తడంతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తలో హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత విచారణను అటకెక్కించారు. ఈ క్రమంలో ఎస్పీ బదిలీ అయ్యారు. ఆ బృంద సభ్యుల్లోనూ కొందరికి స్థానచలనం కలిగింది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో అసలా విషయాన్నే పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ భూముల కుంభకోణంలో అసలైన బడా వ్యక్తుల జోలికి విచారణ అధికారులు ఇప్పటివరకు వెళ్లలేదు. బాధితుల నుంచి 150 వరకు ఫిర్యాదులు అందడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా 200 మంది వరకు నిందితులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చగా.. వారిలో 68 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితులు బెయిళ్లపై బయటకు వచ్చేస్తున్నా.. తమకు మాత్రం న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నేతల ప్రమేయం ఉండటంతో వివరాలను జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ ఎప్పటికప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించసాగారు.

  • ఒంగోలు మేయర్‌ సుజాత భర్త, మరొకరితో కలిసి మండువవారిపాలెంలో రైతుల భూములను అక్రమ పద్ధతుల్లో జీపీఏ పొందారని బహిర్గతమైంది. అయినా జిల్లా ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకోవడంలో నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారు.
  • తన ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న వ్యక్తి.. ఇప్పటివరకు ఖాళీ చేయలేదని ఒంగోలుకు చెందిన ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్తే.. కోర్టును ఆశ్రయించాలని చెబుతున్నారని వాపోయారు.
  • తన ఖాళీ స్థలం ఇప్పటికీ అక్రమార్కుల చేతుల్లోనే ఉందని, ఎలాగైనా విడిపించాలని నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని
  • మరొకరు విలపించారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని