అదానీకి అర్పితం.. ఉక్కు ఫ్యాక్టరీకి కష్టకాలం

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కారుచౌకగా అదానీ సంస్థకు కట్టబెట్టి స్టీలుప్లాంటు గొంతునొక్కారు. ప్రైవేటీకరణపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించక పోగా, సీఎం జగనే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఊపిరి తీశారు.

Published : 15 Apr 2024 05:36 IST

గంగవరం పోర్టులో రాష్ట్రవాటా 11% అప్పనంగా కట్టబెట్టిన జగన్‌
అప్పటి నుంచి స్టీలుప్లాంట్‌కు చుక్కలు చూపిస్తున్న పోర్టు యాజమాన్యం

ఈనాడు-విశాఖపట్నం: గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కారుచౌకగా అదానీ సంస్థకు కట్టబెట్టి స్టీలుప్లాంటు గొంతునొక్కారు. ప్రైవేటీకరణపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించక పోగా, సీఎం జగనే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఊపిరి తీశారు. అదానీకి అనుకూలంగా వ్యవహరించి స్టీలుప్లాంటును కష్టాల్లోకి నెట్టేశారు. జగన్‌ అధికారంలోకి రాగానే గంగవరం పోర్టులోని రాష్ట్ర వాటా 11శాతాన్ని అదానీకి అప్పగించేశారు. రూ.3 వేల కోట్ల విలువైన వాటాను కేవలం రూ.600 కోట్లకు కట్టబెట్టడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సీఎం జగన్‌ లెక్క చేయలేదు. అప్పటి నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి స్టీల్‌ప్లాంటుకు వచ్చే ముడిసరకును విశాఖ పోర్టు నుంచి 60శాతం, గంగవరం పోర్టు నుంచి 40శాతం దిగుమతి చేసుకోవాలనే ఒప్పందం ఉండేది. అదానీ వచ్చాక వంద శాతం గంగవరం పోర్టు నుంచే దిగుమతి చేసుకోవాలన్న నిబంధన పెట్టినట్లు సమాచారం. అంతకుముందు ప్లాంటుకు గంగవరం పోర్టులో ఒక ప్రత్యేక బెర్తు ఉండేది. ముడిసరకుతో నౌకలు ఎప్పుడు వచ్చినా వెంటనే దిగుమతి చేసేలా ఒప్పందాలు ఉండేవి. పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బెర్త్‌ను ప్రత్యేకంగా కేటాయించడం లేదు. పోర్టుకు ఎప్పుడు ఓడ వచ్చినా డంపింగ్‌ యార్డు ఉండేది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పెరిగి స్టాకు యార్డులకు స్థలం లేక, స్టీలు ప్లాంటుకు కేటాయించిన యార్డులో వేరే ముడిసరకులు నిల్వ చేస్తున్నారు.

ధరలు పెంచి ముక్కుపిండి వసూళ్లు చేస్తూ: స్టీలు ప్లాంటుకు అవసరమైన కోకింగ్‌ కోల్‌ ఆస్ట్రేలియా నుంచి, ఎస్‌ఎంఎస్‌ గ్రేడ్‌ లైమ్‌ స్టోన్‌ దుబాయి నుంచి గంగవరం పోర్టుకు వస్తుంది. ఇలా గంగవరం పోర్టు నుంచి ప్రతిరోజూ 10-15వేల టన్నుల ముడిసరకు చేరుతుంది. ఓడలో వచ్చిన సరకును కన్వేయర్‌ ద్వారా పంపడానికి టన్నుకు రేటు గతంలో రూ.250 ఉండగా, అదానీ సంస్థ దానిని రూ.325కు పెంచింది. ఫలితంగా ప్రతి నెలా హ్యాండ్లింగ్‌ ఛార్జీల భారం రూ.1.65 కోట్ల నుంచి రూ.2.47 కోట్ల వరకు అదనంగా పడుతోంది. గంగవరం పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లకముందు స్టీలు ప్లాంటుకు సంబంధించి ఎప్పుడూ రూ.50 కోట్ల మార్జిన్‌ (డ్యూ) ఉంచి, మిగిలిన సొమ్ము చెల్లిస్తూ నౌకల్లో వచ్చిన ముడిసరకు దిగుమతి చేసుకునేవారు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఓడల్లోని సరకు దింపుతామంటూ అదానీ సంస్థ పేచీ పెట్టడంతో డెమరేజ్‌ ఛార్జీలను సైతం ప్లాంటుపైనే పడుతున్నాయి. గతేడాది జులైలో మూడు నౌకల్లో సరకు రాగా... బకాయిల సాకు చూపి అన్‌లోడ్‌ చేయకపోవడంతో చిన్న ఓడలకు రోజుకు రూ.12 లక్షలు, పెద్ద ఓడలకు రూ.36 లక్షల చొప్పున చెల్లించిన డెమరేజ్‌ ఛార్జీలను స్టీల్‌ప్లాంటు భరించాల్సి వచ్చింది.

రెండు రోజులకే నిల్వలు: ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టీలు ప్లాంటుపై గంగవరం పోర్టులో కార్మికుల చేస్తున్న సమ్మె ప్రభావం పడింది. జీతాలు పెంచాలని అయిదు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్లాంటు కోసం ఆస్ట్రేలియా నుంచి కోల్‌తో నౌకల వచ్చినా సరకు దిగుమతి కాలేదు. 15-20వేల టన్నుల బొగ్గు నిల్వలు పోర్టు యార్డులో ఉన్నాయి. కన్వేయర్లను నిలిపి వేయడంతో ప్లాంటుకు ఈ నిల్వలు చేరలేదు. ప్రస్తుతం కర్మాగారంలో ఉన్న నిల్వలు రెండు రోజులకు సరిపోతాయి. కార్మికులు సమ్మె విరమించకపోతే...ప్లాంటులోని కోక్‌ ఓవెన్లు ఒక్కొక్కటిగా మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆదివారం రాత్రికి బొగ్గు నిల్వలను రోడ్డుమార్గం ద్వారానైనా స్టీల్‌ప్లాంటుకు చేర్చే  ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఒకవేళ ముడిసరకు ప్లాంటుకు చేరక ఉత్పత్తికి నష్టం వాటిల్లితే అది పోర్టు యాజమాన్యమే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని