ఆ విద్యుత్‌ మొత్తం అదానీదే!

భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) ముసుగు తొలగింది. జగన్‌ ప్రభుత్వం తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ మొత్తం అదానీదేనని తేలింది.

Published : 15 Apr 2024 05:38 IST

ఆర్‌పీపీఓకు మించి పునరుత్పాదక విద్యుత్‌ తీసుకునేలా అనుమతి
అజూర్‌ పవర్‌నూ పక్కకు నెట్టేసిన జగన్‌ ప్రభుత్వం
భవిష్యత్తులో ప్రజలపై ఛార్జీల భారం!
ఈ పరిణామాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించని ఏపీఈఆర్‌సీ

ఈనాడు-అమరావతి: భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) ముసుగు తొలగింది. జగన్‌ ప్రభుత్వం తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ మొత్తం అదానీదేనని తేలింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిబంధనల మేరకు రెన్యువబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీపీఓ) అవసరం లేకున్నా సంప్రదింపుల ద్వారా సెకి నుంచి విద్యుత్‌ను తీసుకుంటోంది. ఆర్‌పీపీఓకు మించి విద్యుత్‌ కొనాలంటే కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా మాత్రమే విద్యుత్‌ సంస్థలు తీసుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ తీసుకోవడానికి అనుమతిస్తూ.. ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపకుండానే ఏపీఈఆర్‌సీ తైప్రాక్షిక ఒప్పందం అమలుకు ఎన్నికల ముందు హడావుడిగా ఉత్తర్వులిచ్చింది. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌ వల్ల డిస్కంలపై ఏదైనా రూపేణా ఆర్థిక భారం పడితే దాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేయాలనే విషయాన్ని ఉత్తర్వుల్లో కనీసం ప్రస్తావించలేదు.

ఆర్‌పీపీఓ కంటే 50 శాతం అదనపు విద్యుత్‌?

ఆర్‌పీపీఓ అవసరం లేకుండా సంప్రదింపుల ద్వారా డిస్కంలు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను సెకి  నుంచి తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 17 శాతం ఆర్‌పీపీఓ కింద ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిమితికి మించి పునరుత్పాదక విద్యుత్‌ సుమారు 25 శాతం వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో సంప్రదింపుల ద్వారా డిస్కంలు ఎందుకు విద్యుత్‌ తీసుకుంటున్నాయి? ఏపీఈఆర్‌సీ అంచనాల ప్రకారం 2026-27లో ఆర్‌పీపీఓకు మించి సుమారు 50 శాతం అదనంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉండబోతోంది.

ప్రజలపై భారం పడితే.. ఎలా సర్దుబాటు చేస్తుంది?

  • సెకి నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థిక భారం పడితే.. ఎలా సర్దుబాటు చేయాలనే విషయాన్ని ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. సెకి విద్యుత్‌ వల్ల తలెత్తే పరిణామాలు, కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం వల్ల తలెత్తే పరిణామాలతో డిస్కంలపై పడే ఆర్థిక భారం గురించీ ప్రస్తావన లేదు.  
  • వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌ కోసం డిస్కంలు ఇప్పటికే వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సెకి విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తే.. తద్వారా ఏటా మిగిలే సుమారు 8 వేల మిలియన్‌ యూనిట్‌ (ఎంయూ)లను ఏం చేయాలి?
  • ఏపీ జెన్‌కో 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు, 1,350 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టు, ఎగువ సీలేరులో 230 మెగావాట్ల అదనపు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. అవి పూర్తయిన తర్వాత వాటితో పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉంది. ఇప్పటికే వేసవిలో తప్ప.. మిగిలిన సమయంలో డిమాండ్‌ తక్కువగా ఉండటంతో జెన్‌కో థర్మల్‌ యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేసే పరిస్థితి ఉంది.
  • ఏపీ జెన్‌కో, నేషనల్‌ హైడ్రో వపర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీఎల్‌) భాగస్వామ్యంతో 6 వేల మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. వాటి నుంచి వచ్చే విద్యుత్‌ను ఏం చేయాలి?
  • రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఎగుమతి విధానం, పీఎస్పీ పాలసీ కింద సుమారు 57 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులు వస్తాయని.. అందులో కొన్నింటితో ఇప్పటికే ఎంవోయూలు కుదుర్చుకుంది. ఆ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే ఓపెన్‌ యాక్సెస్‌ కింద పరిశ్రమలకు నేరుగా విద్యుత్‌ సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ మేరకు డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్‌ తగ్గిపోతుంది. అలాగే ఆర్‌పీపీఓ కూడా తగ్గుతుంది.
  • ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు అనుమతించడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఆ భారం వినియోగదారులపై పడబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవేవీ లేక ముందే జగన్‌ ప్రభుత్వం  అయిదేళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై రూ.18,817 కోట్ల అదనపు విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మోపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూఅప్‌ ఛార్జీలు రూ.7,200 కోట్లు, ఏపీ జెన్‌కో ట్రూఅప్‌ రూ.1,148 కోట్లు కలిపి రూ.8,348 కోట్ల భారాన్ని ప్రజలపై వేయడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు విద్యుత్‌ ఛార్జీల బాదుడు తప్పదు.

అదానీకి మేలు కోసమే జగన్‌ తపన?

2021 డిసెంబరు 1న సెకితో ప్రభుత్వం, డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్‌ విక్రయ ఒప్పందం (పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌- పీఎస్‌ఏ) ప్రకారం అదానీ రెన్యువబుల్‌ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, మిగిలిన 2,333 మెగావాట్లు అజూర్‌ పవర్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి సరఫరా కావాల్సి ఉంది. ఒప్పందం అమలు సమయానికి అజూర్‌ పవర్‌ను పూర్తిగా పక్కకు తప్పించి, ఆ సంస్థ సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను కూడా అదానీ ప్రాజెక్టుల నుంచే తీసుకునేలా పీఎస్‌ఏ ఒప్పందాన్ని గత ఏడాది డిసెంబరు 29న సెకి సవరించింది. దానిపై మరోసారి డిస్కంలు, ప్రభుత్వం సంతకాలు చేసి సమాచారాన్ని గుట్టుగా ఉంచాల్సిన అవసరమేంటి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని