ముఖ్యమంత్రిపై రాయితో దాడి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా, ఐజీ రవిప్రకాశ్‌లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు.

Published : 16 Apr 2024 04:57 IST

విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌, ఐజీలను ఆదేశించిన సీఈవో మీనా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా, ఐజీ రవిప్రకాశ్‌లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం వారిద్దరితో సీఈవో సమావేశమై ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను సమీక్షించారు. బస్సు యాత్రలో ఈ దుర్ఘటన ఎలా చోటుచేసుకుంది? దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం కలిగింది? పూర్తిస్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ ఏ విధంగా రాయితో దాడి చేయగలిగారు? అనే విషయాలపై పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది విషయంలో విచారణ ఏ విధంగా సాగుతోంది? ఆ విచారణలో బయటపడిన విషయాలపై ఆయన ఆరాతీశారు. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని