‘అంతమందిలో ఒక్కరిని పట్టుకోవడం తేలిక కాదు’

‘సీఎంపై రాయితో దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు 5 వేల మంది ప్రజలు ఉన్నారు. పైగా అంతా చీకటి. అంత మందిలో నుంచి ఒక్క వ్యక్తిని పట్టుకోవడం అంత తేలిక కాదు.

Updated : 16 Apr 2024 06:36 IST

సీఎం రోడ్‌షోలో భద్రతాలోపం తలెత్తకుండా 1,480 మంది పోలీసులను మోహరించాం
విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘సీఎంపై రాయితో దాడి జరిగిన ప్రాంతంలో దాదాపు 5 వేల మంది ప్రజలు ఉన్నారు. పైగా అంతా చీకటి. అంత మందిలో నుంచి ఒక్క వ్యక్తిని పట్టుకోవడం అంత తేలిక కాదు. కానీ వంద శాతం పట్టుకుంటాం’ అని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా చెప్పారు. సోమవారం రాత్రి తన కార్యాలయంలో సీపీ మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రోడ్‌షో సాగిన మార్గం మొత్తం భద్రతా లోపం తలెత్తకుండా 1,480 మంది పోలీసులను మోహరించాం. పర్యటన సాగిన దారంతా అత్యంత రద్దీ ప్రాంతాలే. సీసీ కెమెరా దృశ్యాలు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివేకానంద పాఠశాల, రామాలయం మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి బలంగా విసిరినట్లు గుర్తించాం.

సీఎంపై పడిన రాయి కోసం క్లూస్‌ టీం వెతికింది. ఘటనా స్థలంలో కొన్ని రాళ్లు దొరికాయి. ఏ రాయితో దాడి చేశారన్నది నిందితుడు దొరికితేనే తెలుస్తుంది’ అని చెప్పారు. ఈ ఘటనపై ఐపీసీ 307 సెక్షన్‌ కింద ఎందుకు కేసు కట్టారని ప్రశ్నించగా.. మాజీ మంత్రి వెలంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఘటన తీవ్రత ఆధారంగా వ్యవహరించామన్నారు. నందిగామలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయి విసిరిన ఘటన విషయంలో చిన్న సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు కదా అని విలేకర్లు ప్రశ్నించగా ‘అప్పుడు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సీసీ కెమెరా దృశ్యాలు లేవు. టీడీపీ నేతలకు నోటీసులిచ్చి రమ్మన్నా రాలేదు. చివరకు మా సిబ్బంది వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు’ అని సీపీ కాంతిరాణా వివరించారు.

నిందితుడి సమాచారం ఇస్తే.. రూ.2 లక్షలు

సీఎంపై రాయి దాడి కేసులో నిందితుణ్ని పట్టుకునేందుకు దోహదపడే సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు సీపీ కాంతిరాణా ప్రకటించారు. సమాచారం చెప్పడం, వీడియో దృశ్యాలు పంపడం లేదా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా వచ్చి వివరాలు అందించవచ్చని తెలిపారు. గ్రామీణ డీసీపీ కె.శ్రీనివాసరావు (94406 19342), టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరిబాబు (94406 27089)లకు ఫోన్‌ చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని