సివిల్స్‌లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్‌

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

Updated : 17 Apr 2024 06:41 IST

నాయనమ్మ అండతో ఉన్నత శిఖరాలకు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. తొలిసారి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి ఇప్పుడు ఏకంగా సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రస్థానమిది. భర్తతోపాటు కుమారుడు, కోడలు మృతి చెందినప్పటికీ రమణమ్మ తన మనవళ్ల చదువు కోసం చెమటోడ్చారు. మనవడు ఉదయ్‌కృష్ణారెడ్డిని స్వగ్రామంలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించారు. సెలవుల్లో నాయనమ్మకు చేదోడుగా ఉంటూనే నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తిచేశారు. 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2019 వరకు విధులు నిర్వహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. ఆయన సోదరుడు కూడా సివిల్స్‌ ప్రయత్నాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని