వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!

తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే.

Published : 18 Apr 2024 05:32 IST

తెలంగాణలో సత్ఫలితాలిస్తున్న ‘డయాగ్నొస్టిక్‌’ కేంద్రాలు
ఆంధ్రాలో ప్రహసనంగా నిర్ధారణ పరీక్షలు
నిధుల కేటాయింపునకు చేతులు రాని జగన్‌

తెలంగాణ...

ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు..
సత్వర, మెరుగైన వైద్య సేవలతో ఉరకలు...

ఏపీ...

అందుబాటులో లేని వ్యాధి నిర్ధారణ కేంద్రాలు
అరకొర, అధ్వాన వైద్య చికిత్సలతో గుటకలు...
ఇదీ వైద్యంలో ఆంధ్రావని దైన్యస్థితి!
కొత్త ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల ఏర్పాటు మాట దేవుడెరుగు...
ఉన్నవాటి నిర్వహణకే ఎసరు పెట్టి కొత్తవాటి నిర్మాణాలకు నిధుల కోతపెట్టి రోగుల ఊపిరి తీస్తోంది వైకాపా సర్కారు!
పడకేసిన, పేలవ సేవలనే ఏపీ వైద్యరంగానికి బ్రాండ్‌ ఇమేజ్‌గా మార్చేశారు జగన్‌!!

తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. సాధారణంగా అయిదు, ఆరు పరీక్షలు చేయించుకోవాలనుకుంటేనే రూ.వేలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసి వాటి ఫలితాలను సత్వరం అందిస్తే పేద, సామాన్య రోగులకు ఎంతో ఊరట కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది. పేద, సామాన్య రోగుల ప్రయోజనార్థం అక్కడి ప్రభుత్వం రోగులకు పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తూ వాటి ఫలితాలను కూడా గంటల    వ్యవధిలో రోగులకు అందజేస్తోంది. ఏపీలోని ప్రభుత్వాసుత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది.


ఏపీలో సాధారణ పరీక్షలే!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆసుపత్రుల్లో సాధారణ వ్యాధుల నిర్ధారణ పరీక్షలే కొనసాగుతున్నాయి. అవీ అరకొరగానే. గత ప్రభుత్వ హయాంలో ‘మెడాల్‌’ సంస్థ ద్వారా ఆసుపత్రుల్లో పరీక్షలు జరిగేవి. ఈ విధానాన్ని వైకాపా సర్కారు రద్దు చేసింది. వైద్యులకు చూపించుకోవడానికి వచ్చే రోగులకు(ఓపీ) పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో పరీక్షలు జరుగుతున్నాయి.


ఏ ఆస్పత్రిలో... ఏ పరీక్షనో..?

వైద్యం, వైద్య పరీక్షలకు అవసరమైన నిధుల కేటాయింపు, నిర్వహణలో వైకాపా సర్కారు ఘోరంగా విఫలమైంది. చాలా కేంద్రాల్లోని ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ యూనిట్లు, ఇతర పరికరాలు, యంత్రాలు చెడిపోయాయి. వీటికి మరమ్మతులు చేయించడానికి నిధుల కొరత సమస్యగా మారింది. పలు కేంద్రాలను రసాయనాలు, కిట్స్‌ కొరత వేధిస్తోంది. కొన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికీ థైరాయిడ్‌ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కేంద్రాల్లో సకాలంలో పరీక్షలు చేయక, ఫలితాలు రాక రోగులు ప్రైవేట్‌ కేంద్రాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏయే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏయే పరీక్షలు జరుగుతాయి? ఎన్ని జరుగుతున్నాయి? అనే వివరాలు ఎవరికీ తెలియని పరిస్థితి. వైద్యుల సిఫార్సుతో పరీక్ష చేసుకున్న తర్వాత ఫలితాలు ఎప్పుడొస్తాయో తెలియక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటికోసం రోజుల తరబడి ఆసుపత్రులు, కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్‌ వ్యక్తులు రోగుల నుంచి నమూనాలు సేకరించి బయట ఉన్న ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం డబ్బులు తీసుకుని ఫలితాలు అందిస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.


వినియోగంలోకి తెచ్చేదెప్పుడు?

ఏ ప్రభుత్వమైనా పెరుగుతున్న రోగుల సంఖ్యకు సరిపడా ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వైకాపా సర్కారు అంటేనే రివర్సు కదా... అవేవీ పట్టడంలేదు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో సీటీ డయాగ్నొస్టిక్‌ సెంటర్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. పనులు నెలల తరబడిగా కొనసాగుతున్నాయి. రక్త, ఇతర పరీక్షలతోపాటు ఎమ్మారై, సీటీ స్కాన్‌ తదితరాలను చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని చూస్తున్నారు. ఈ మేరకు గతేడాది టెండర్లు పిలిచారు. మంగళగిరి ఎయిమ్స్‌లో పరీక్షలు చేస్తున్న ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇదే సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హైదరాబాద్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆ తర్వాత పరీక్షల విషయాన్ని పక్కనపెట్టారు. ఈ మూడు నగరాల్లో సీటీ డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు? వాటి ద్వారా ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు? అని పేద, సామాన్య ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్నారు.


అరకొర పరీక్షలు

  • చిత్తూరు నగరంలోని జిల్లా ఆసుపత్రిలో 130 వరకు వైద్య పరీక్షలు చేయాలి. వాటిలో 80% మాత్రమే చేస్తున్నారు. ఆయా పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. థైరాయిడ్‌ పరీక్షలు చేసేందుకు యంత్రం అందుబాటులో ఉన్నా రోగులను బయటకు పంపిస్తున్నారు. స్కానింగ్‌ విభాగాన్ని మధ్యాహ్నం తర్వాత మూసేస్తున్నారు. ఎక్స్‌రే ఫిల్మ్‌ల కొరత వేధిస్తోంది. మరోవైపు ప్రైవేటు, ప్రభుత్వ కేంద్రాల్లోని ‘పరీక్షల ఫలితాలు’ వేర్వేరుగా ఉంటున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.
  • శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపత్రిలో లిపిడ్‌ ప్రొఫైల్‌, సీరం, థైరాయిడ్‌  పరీక్షలు జరగడంలేదు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. రసాయనాల కొరతతో థైరాయిడ్‌ పరీక్షల్లో వాడే ఎనలైజర్‌ పరికరం చాలాకాలంగా నిరుపయోగంగా మారింది. ఈ ఆసుపత్రి రేడియాలజిస్టు దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో రోగుల పరీక్షల నిర్వహణ, నిర్ధారణకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
  • నరసన్నపేటలోని ప్రాంతీయ ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్ష చేసేందుకు అవసరమైన పరికరం లేదు. హెచ్‌బీఏ1సీ ఫుల్‌ ఆటోమెటిక్‌ యంత్రం అందుబాటులో ఉన్నా అవసరమైన కిట్లు కరవయ్యాయి.

తెలంగాణలో 134 రకాల పరీక్షలు

తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 31 డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వాటిలో టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ పరీక్షలతోపాటు.. కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌, రక్తంలో కొలెస్ట్రాల్‌, మూణ్నెళ్ల సగటు చక్కెరస్థాయి, కీళ్లవాతం తదితర ఖరీదైన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇలా మొత్తం 134 రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తూ పేద, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తోంది.


21 రేడియాలజీ హబ్‌లు...

తెలంగాణ ప్రభుత్వం 2020లో హైదరాబాద్‌లో 20 రేడియాలజీ హబ్‌లను, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఒక మినీ రేడియాలజీ హబ్‌ను నెలకొల్పింది. వీటిలో ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో, టిఫా స్కాన్‌, అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌, మామోగ్రామ్‌... వంటి వాటిని ఉచితంగా చేస్తున్నారు.

డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌లలో ఇప్పటివరకు 79.80 లక్షల మందికి 14.48 కోట్ల పరీక్షలు చేశారు. వాటి విలువ రూ.1,010 కోట్లు. పరీక్షల ఫలితాలు నేరుగా రోగి వాట్సప్‌ నంబరు, ఈ-మెయిల్‌కు అందుతాయి.


ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని