అదే అరాచకం.. అదే దౌర్జన్యం

గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు.

Updated : 18 Apr 2024 09:41 IST

జిల్లాల్లో ఎస్పీలు మారినా... ఆగని దాష్టీకాలు
ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గూండాలు
‘మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా’ అంటూ జులుం
వారిని అరెస్టు చేయకుండా బాధితులపైనే రివర్స్‌ కేసులు పెడుతున్న పోలీసులు
పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో దారుణ పరిస్థితులు
డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలపై ఎన్నికల సంఘం చర్యలేవి?
రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ హింస
ఈనాడు - అమరావతి

గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. ‘మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ ఇళ్లలోకి చొరబడి మరీ కర్రలు, రాడ్లతో కొడుతుంటే పోలీసులు వారికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. బాధితులపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వైకాపా నాయకుల్లో ఒక్కర్నీ అరెస్టు చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తేలికపాటి సెక్షన్ల కింద మొక్కుబడి కేసులు పెట్టి మమ అనిపించేయడం మినహా దర్యాప్తు చేయట్లేదు. వైకాపా నాయకుల దౌర్జన్యాలు, దమనకాండ పట్ల చేతులు ముడుచుకుని కూర్చొంటూ... వారికి అండదండలు అందిస్తున్నారు. జగన్‌ పాలనలో మరో చంబల్‌లోయగా మారిపోయిన పల్నాడు జిల్లా మాచర్లతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వైకాపా దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ రెండు జిల్లాల ఎస్పీలను బదిలీచేసి కొత్తవారిని నియమించినా పరిస్థితులు మారలేదు. కొత్త ఎస్పీలు సైతం అధికారపార్టీ అరాచకాలను పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు అధికారపార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిని ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే.. ప్రతిపక్ష శ్రేణులపై దాడులు ఉద్ధృతమవుతున్నాయి.

మాచర్లను పిన్నెల్లికి రాసిచ్చేశారా?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించేశారా? మన చట్టాలు, రాజ్యాంగం అక్కడ వర్తించబోవని శాసనమేమైనా చేశారా? వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ ప్రాంతాన్ని రాసిచ్చేశారా? అక్కడ వరుసగా ప్రతిపక్షాలపై దాడులు, దాష్టీకాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? అధికారపార్టీ గూండాలను ఎందుకు అదుపు చేయట్లేదు? ‘తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డిని ఊళ్లోకి తెచ్చేంత మగాడివా నువ్వు? ఇకపై తెదేపాకు ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు’ అంటూ తెదేపా నేత జలీల్‌ఖాన్‌పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. చేతులు వెనక్కి విరిచేసి కట్టి దారుణంగా కొట్టారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. ‘ఇది మా అడ్డా.. ఇక్కడికి ఎవడు పంపించాడ్రా నిన్ను’ అంటూ ఆ వాహన డ్రైవర్‌ను హింసించారు. క్షేత్రస్థాయి పోలీసులు ఈ అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు. తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి సరిపెట్టేస్తున్నారు. నిందితులు కళ్లముందే కనిపిస్తున్నా ఒక్కర్నీ అరెస్టు చేయట్లేదు. మాచర్లలో ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రచారం చేయడమే నేరమన్నట్లు వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే కొత్తగా నియమితులైన ఎస్పీ ఏం చేస్తున్నట్లు? ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తున్నవారిని ఎందుకు అరెస్టు చేయట్లేదు? ఈ ఘర్షణలన్నింటికీ అసలు కుట్రదారైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

దాడులకు తెగబడుతుంటే చూస్తుండటమేనా పోలీసుల విధి?

  • ఎన్నికల షెడ్యూలు విడుదలైన మర్నాడే మాచర్లలో తెదేపా నాయకుడి కారును వైకాపా నాయకులు తగలబెట్టారు. అప్పట్నుంచి రోజూ ఇక్కడ హింసాత్మక ఘటనలే. అందుకే పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. ఆయన స్థానంలో బిందుమాధవ్‌ గరికపాటిని నియమించింది. ఆ తర్వాతా ప్రతిపక్షాలపై దాడులు ఆగలేదు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మర్నాడే తెదేపా కార్యాలయాన్ని దుండగులు తగలబెట్టేశారు. వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి పేర్లతో తెదేపా ఫిర్యాదుచేసినా ఇప్పటివరకూ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో ముదావత్‌ తులసీనాయక్‌ తలపై గొడ్డలితో దాడిచేసి, ఆయన దుకాణం, ఆటో ధ్వంసం చేశారు. కారంపూడి మండలం కాకానివారిపాలెం ఎస్సీ కాలనీలో కడియం నాగరాజుపై గొడ్డలితో దాడి చేశారు. సత్తెనపల్లె నియోజకవర్గం ముప్పాళ్ల మండలం తొండపిలో తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని ముగ్గురు ముస్లింలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తెదేపా తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనల్లో ఒక్కరిపైనా చర్యల్లేవు. పోలీసులు ఉన్నది ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా నాయకులు దాడులు చేస్తుంటే చూస్తూ ఉండటానికా?
  • పల్నాడు జిల్లావ్యాప్తంగా ఎక్కువ చోట్ల వైకాపాతో అంటకాగుతూ, అరాచకాలకు కొమ్ము కాసేవారినే ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలుగా నియమించుకున్నారు. దీంతో అధికారపార్టీ అరాచకాలకు అడ్డుకట్ట పడట్లేదు. జగన్‌ పాలనలో అయిదేళ్లుగా ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు హక్కులు లేవు. గతంలో మాచర్లలో తెదేపా కార్యాలయాలకు, తెదేపా నాయకుల ఇళ్లకు వైకాపా నాయకులు నిప్పంటిస్తే.. డీజీపీ రాజేంద్రనాథరెడ్డే ‘వివాదాస్పద ప్రాంతాలకు మిమ్మల్ని ఎవడు వెళ్లమన్నాడు? అక్కడ మీకేం పని?’ అంటూ ప్రతిపక్షాలనే తప్పుపడుతూ, వైకాపా గూండాల చర్యలను వెనకేసుకొస్తున్నట్లుగా మాట్లాడారు. ఆ మాటల్నే పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారేమో గానీ.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు కూడా ప్రచారం నిర్వహించుకోకుండా ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే చోద్యం చూస్తున్నారు.

స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలా... కోర్టులో హాజరుపరచాలా అనేది వైకాపా ఎమ్మెల్యే నిర్దేశిస్తారా?

రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకు ఉన్నారంటూ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్యను ప్రశ్నించినందుకు ఒంగోలు సమతానగర్‌కు చెందిన ప్రభావతి, ఆమె కుమారులపై వైకాపా గూండాలు కర్రలతో దాడిచేశారు. తెదేపా నాయకుడు మేడికొండ మోహన్‌ను రక్తమోడేలా కొట్టారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనల్లో ఇద్దరు వైకాపా నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా... వారిని విడిపించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వైకాపా శ్రేణులు స్టేషన్‌పైకి దండెత్తినా వారిపై కేసే నమోదు చేయలేదు. సీఐని చొక్కా పట్టుకుని దుర్భాషలాడినా బాలినేనిపై చర్యల్లేవు. అదే స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే ఇలాగే వదిలేస్తారా? సమతానగర్‌ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వైకాపా నాయకులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాల్సిందేనని బాలినేని ఒత్తిడి చేస్తే పోలీసులు జీ హుజూర్‌ అన్నారు. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలా? కోర్టులో హాజరుపరచాలా అనేది పోలీసులు చట్టప్రకారం నిర్ణయిస్తారా? వైకాపా నాయకుల ఆదేశాల మేరకే వ్యవహరిస్తారా? ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికారపార్టీ నాయకుల దాష్టీకాలకు వత్తాసు పాడుతూ, వారిపట్ల వీర విధేయత ప్రదర్శిస్తుంటే దాడులు ఎలా ఆగుతాయి?


డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను బాధ్యుల్ని చేస్తేనే..

రాజకీయ హింసకు తావులేకుండా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని.. ఎక్కడైనా ఉంటే సంబంధిత జిల్లాల ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా పదే పదే చెబుతున్నారు. కానీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎన్నికల ప్రచారమే చేసుకోనివ్వకుండా అధికారపార్టీ నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అయినా పోలీసులు వాటిని నియంత్రించట్లేదు. నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి తరుణంలో ఎస్పీలను బదిలీ చేసినంత మాత్రాన ఫలితం లేదు. క్షేత్రస్థాయిలో వైకాపా మత్తులో ఊగిపోతున్న డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను ఆయా ఘటనలకు బాధ్యుల్ని చేసి, కఠినచర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రం అధికార వైకాపా దాడులు, దౌర్జన్యాలతో రావణకాష్ఠంలా రగులుతూనే ఉంటుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని