ఇదేనా బైబిల్‌కిచ్చే గౌరవం?

మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలతో సమానం! ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా... అమలు చేయలేని హామీని ఇవ్వను... ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా... 2019 ఎన్నికలప్పుడు జగన్‌ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!!

Published : 18 Apr 2024 03:47 IST

నాడు సీపీఎస్‌ రద్దు చేస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటన
హామీలను విస్మరించే నాయకులు ఇంటికి వెళ్లిపోవాలని వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చాక మాట మార్చేసిన వైనం

మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలతో సమానం!  
ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా...
అమలు చేయలేని హామీని ఇవ్వను...
ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా...
2019 ఎన్నికలప్పుడు జగన్‌ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!!
గెలిచాక ఓటర్ల నమ్మకాన్ని బలిచేశారు...
పవిత్ర గ్రంథాలపై ప్రమాణాన్ని అపహాస్యం చేశారు!!


జగన్‌, ఆయన వందిమాగధుల స్వరం మారిందిలా...

ఎన్నికల ముందు.. రద్దుకు మాటిచ్చారు

‘‘జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు.

సీఎం అయ్యాక.. ఆర్థిక భారాన్ని సాకుగా చూపారు

సీఎంగా సీపీఎస్‌ రద్దు చేయాలంటే నిమిషం పని. మరి ఎందుకింత ఆలోచిస్తున్నాం? పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలైతే ఖజానాపై మోయలేని భారం పడుతుంది’’ అంటూ 2022 ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌ మాట మార్చారు.


తెలియకుండానే హామీ ఇచ్చాం

‘‘పదవీ విరమణ తర్వాత సీపీఎస్‌ ఉద్యోగుల   పరిస్థితి ఏంటనే అంశంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చామే తప్ప ఇందులో టెక్నికల్‌ సబ్జెక్టు మాకూ తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బడ్జెట్‌ సరిపోయేలా లేదు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.

మేం తొందరపడి చెప్పాం...

‘‘సీపీఎస్‌ రద్దుపై తొందరపడి హామీ ఇచ్చాం.  సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయడం సాధ్యం కాదు. ఓపీఎస్‌ ముగిసిన అధ్యాయం. ఉద్యోగులు ఆందోళన చేస్తే మేమేం చేయలేం’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తమ అసలు రంగును కుండబద్దలు కొట్టారు.


‘‘ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి’’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రతి సభలోనూ పదేపదే ప్రస్తావించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తన మ్యానిఫెస్టోలో పొందుపరచిన ‘వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు’ హామీని నెరవేర్చలేదు. ఉద్యోగులు ఎన్నిసార్లు గుర్తు చేసినా... సాకులు చెబుతూ సాగదీస్తూ ఐదేళ్లు ముగించేశారు. మరి, మాట తప్పిన రాజకీయ నాయకుడిగా రాజీనామా చేసి, ఎందుకు ఇంటికి వెళ్లిపోలేదు? పైగా వారి డబ్బునే దారి మళ్లించేసి, ఉద్యోగులకు ఆర్థికంగా తీవ్ర నష్టం మిగిల్చారు.

ఎన్నో వ్యథలు.. ఎన్నెన్నో ఆందోళనలు

రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఓపీఎస్‌ అమలుకు చర్యలు చేపట్టాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌లో మాత్రం చలనం రాలేదు. ఉద్యోగులు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా వారిని స్వయంగా పిలిచి మాట్లాడలేదు. తమ గళం వినిపించడానికి సీపీఎస్‌ ఉద్యోగులు ఐదేళ్లలో ఎన్నో ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. కొందరు గుండు గీయించుకున్నారు. మరికొందరు జగన్‌కు ఓటేసినందుకు చెప్పులతో తమనుతాము కొట్టుకున్నారు. ఇంకొందరు భిక్షాటన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కానీ, జగన్‌ గుండె కరగలేదు. పైగా 2023 అక్టోబరు 20న గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) ఇస్తామంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఓపీఎస్‌ హామీకి సమాధి కట్టారు.

నిరసనలపై సీఎం ఉక్కుపాదం

సీపీఎస్‌ రద్దు హామీ అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసనలు, ఆందోళనలు, సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. నిరసనలపై ప్రకటన చేస్తే చాలు నిర్బంధం విధించింది. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసింది. వారిళ్లకు పోలీసులను పంపించి, కుటుంబ సభ్యులను సైతం భయపెట్టింది. ఉద్యోగుల కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లి పోలీసులతో  నోటీసులు ఇప్పించింది. రాత్రికిరాత్రి ఇళ్ల తలుపులు పగలగొట్టి ముందస్తు అరెస్టులు చేయించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పదేపదే దొంగతనాలకు, నేరాలకు పాల్పడే వారి మాదిరిగా ఉద్యోగులపై బైండోవర్‌ కేసులు పెట్టింది. సత్ప్రవర్తన కలిగి ఉంటామంటూ ఒక్కో ఉద్యోగి నుంచి ఆరు నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు పూచీకత్తు తీసుకుంది.

నిఘా అధికారి పచ్చి మోసం

సీపీఎస్‌ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులను పక్కదారి పట్టించేందుకు నిఘా విభాగంలోని కీలక అధికారి తన పోలీస్‌ బుర్రను వినియోగించారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఆయా సంఘాల నాయకులను అనధికారికంగా ఐదు రోజులపాటు పంపించారు. వారి వెంట డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కూడిన బృందాన్ని పంపారు. విమాన టికెట్లు, నాయకుల ఖర్చులను  భరించారు. అక్కడ ఓపీఎస్‌ అమలుపై అధ్యయనం చేయాలని సూచించారు. తర్వాత వారు సమర్పించిన నివేదికను మూలకు పడేశారు. పైగా ప్రభుత్వంతో తెగే వరకు లాగొద్దంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. సర్కారుతో చర్చలు ఏర్పాటు చేయిస్తానని నమ్మించి మోసగించారు.


రూ.1,500 కోట్ల బకాయి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలకు సంబంధించిన బకాయిలను సీపీఎస్‌ ఉద్యోగులకు 90% నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.1,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జులైలో డీఏ మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు.


పొదుపు డబ్బులనూ మింగేశారు

మరోవైపు ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10% వాటాను సీపీఎస్‌ ప్రాన్‌ ఖాతాలకు జమ చేయలేదు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగి వాటాతోపాటు ప్రభుత్వ వాటాను కలిపి జమ చేయాల్సి ఉండగా.. కొందరికి 2023 జూన్‌ వరకు, మరికొందరికి 2023 నవంబరు వరకు మాత్రమే జమ చేశారు. చివరికి వాళ్ల డబ్బులు రూ.933 కోట్లు మింగేశారు.


అసలు విధానం ఏమిటి?

కాంట్రిబ్యూటరీ పింఛను పథకం 2004 సెప్టెంబరు నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి ప్రతినెలా తన మూల వేతనం నుంచి 10%  పింఛను నిధికి జమ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రతినెలా తన వాటా కింద 10% జమ చేయాలి. కేంద్రం తాజాగా ఈ మొత్తాన్ని 14 శాతంగా మార్పు చేసినా జగన్‌ సర్కారు పది శాతమే చెల్లిస్తోంది. పదవీ విరమణ సమయంలో ఈ నిధి నుంచి ఉద్యోగి 60% తిరిగి తీసుకోవచ్చు. మిగిలిన 40% మొత్తం యాన్యుటీ పింఛను పథకంలో పెట్టుబడి పెడతారు. ఆ సమయంలో ఉద్యోగి ఎంచుకునే పింఛను విధానాన్ని బట్టి ప్రతినెలా కొంత మొత్తం పింఛనుగా చెల్లిస్తారు. ఇది మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనికి గ్యారెంటీ లేదు. పైగా దీనికి డీఆర్‌ ఉండదు. పీఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు దక్కవు. ఈ స్కీంలో అందే పింఛనుతో ప్రభుత్వానికి, ఖజానాకు సంబంధం ఉండదు. ఆరోగ్య పథకం కింద దక్కే ప్రయోజనాలు ఉండవు.

పదవీ విరమణ తర్వాత పింఛన్‌ భద్రత లేకపోవడం, పీఆర్సీ ప్రయోజనాలు లభించకపోవడం, ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రయోజనం కూడా లేకపోవడంతో ఉద్యోగులు దీన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని